logo

తరలిరానున్న తలంబ్రాలు..!

కరోనా అన్ని రంగాలను అతలాకుతలం చేసింది. ఆధ్యాత్మిక క్షేత్రాలకూ కొవిడ్‌ తాకిడి తప్పలేదు. ఏటా పెద్దసంఖ్యలో జనాలతో అలరారే భద్రాచలం సీతారాముల కల్యాణోత్సవం గత రెండేళ్లుగా ఆంక్షల....

Published : 06 Apr 2022 05:31 IST

‘ఆర్టీసీ’ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలో విశేష ఆదరణ


రసీదు అందజేస్తున్న డీఎం సాయన్న

నిర్మల్‌ పట్టణం, న్యూస్‌టుడే: కరోనా అన్ని రంగాలను అతలాకుతలం చేసింది. ఆధ్యాత్మిక క్షేత్రాలకూ కొవిడ్‌ తాకిడి తప్పలేదు. ఏటా పెద్దసంఖ్యలో జనాలతో అలరారే భద్రాచలం సీతారాముల కల్యాణోత్సవం గత రెండేళ్లుగా ఆంక్షల నడుమ సాదాసీదాగా చేపట్టాల్సి వచ్చింది. పరిస్థితులు సద్దుమణగడంతో ఈసారి ఘనంగా ఉత్సవాలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చాలామంది భక్తులకు వెళ్లాలని ఉన్నా, చిన్న చిన్న అనుమానాలతో వెనుకడుగు వేస్తున్నారు. దీనికితోడు పెరిగిన పెట్రో, డీజీలు ధరలు, ప్రయాణ రుసుముల భారాన్ని ఎలా అధిగమించాలా అనే సందిగ్ధంలో పడిపోయారు. ఇలాంటి వారికి ఊరటనిచ్చేలా ఆర్టీసీ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కోరుకున్న భక్తుల ఇంటికే కల్యాణోత్సవ తలంబ్రాలను తీసుకొచ్చి ఇచ్చేలా ఏర్పాట్లు చేసింది.

కల్యాణం ముగియగానే..
ఏప్రిల్‌ 10న శ్రీరామనవమి నాడు సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా జరుగుతుంది. ఇది పూర్తయిన అనంతరం భక్తులకు తలంబ్రాలను పంపిణీ చేసేందుకు ఆలయాధికారులతో ఆర్టీసీ ఒప్పందం చేసుకుంది. సంస్థలో ప్రత్యేకంగా కొనసాగిస్తున్న కార్గో, పార్సిల్‌ సేవా విభాగం దీన్ని పర్యవేక్షిస్తుంది. తలంబ్రాలు కావాలనుకునే వారు సమీపంలో ఉన్న ఆర్టీసీ పార్సిల్‌ కేంద్రాల్లో రూ.80 చెల్లించి బుకింగ్‌ చేసుకోవాలి. చిరునామా, ఇతర వివరాలను అందించాలి. తదనుగుణంగా పంపిణీ పూర్తి చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. 


ప్రచార ఫ్లెక్సీ

రీజియన్‌ ప్రథమం..
బుకింగ్స్‌ ఇటీవలే ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రీజియన్లలో ఆదిలాబాద్‌ అత్యధిక బుకింగ్స్‌తో ప్రథమస్థానంలో నిలవడం విశేషం. తెలంగాణలో 27,111 బుకింగ్స్‌ జరిగితే ఇందులో ఆదిలాబాద్‌ రీజియన్‌ పరిధిలోనే సోమవారం నాటికి 4,052 బుకింగ్స్‌ నమోదయ్యాయి. రుసుము కింద రూ.3,24,160 చెల్లించారు. హైదరాబాద్‌ రీజిజియన్‌ 1,258 బుకింగ్స్‌తో చివరిస్థానంలో ఉంది. ఆదిలాబాద్‌ రీజియన్‌ పరిధిలో ఉన్న ఆరు డిపోల్లో ఆదిలాబాద్‌ 1,021 బుకింగ్స్‌తో ముందంజలో నిలిచింది. ఉట్నూరు 222 బుకింగ్స్‌ను మాత్రమే నమోదుచేసి ఆరోస్థానంలో ఉంది.

ఆదరణ పెరుగుతోంది : సాయన్న, నిర్మల్‌ బస్‌ డిపో మేనేజరు
ఇంటి ముంగిటకే కల్యాణోత్సవ తలంబ్రాలు తీసుకొచ్చేందుకు సంస్థ చేపట్టిన ‘లోక కల్యాణం- పచ్చతోరణం’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. నిర్మల్‌ పరిధిలోనూ బుకింగ్స్‌ పెరుగుతున్నాయి. రీజియన్‌లో ప్రథమస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు