logo

Hyd News: మూడు గంటలపాటు ముప్పుతిప్పలు పెట్టిన మూడో తరగతి బాలికలు

మూడో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు పాఠశాల ముగిశాక ఇంటికి చేరలేదు. తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం, పోలీసులు వారి కోసం మూడు గంటలపాటు....

Updated : 12 Apr 2022 09:24 IST

హిందీ పరీక్ష సరిగా రాయలేదని.. పారిపోయేందుకు యత్నం

వనస్థలిపురం, న్యూస్‌టుడే: మూడో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు పాఠశాల ముగిశాక ఇంటికి చేరలేదు. తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం, పోలీసులు వారి కోసం మూడు గంటలపాటు వెతకగా సమీప బస్టాండ్‌లో కనిపించడంతో ఊపిరి పీల్చుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. వనస్థలిపురంలోని క్రాంతిహిల్స్‌, హిల్‌కాలనీకి చెందిన 9, 10 ఏళ్ల ఇద్దరు విద్యార్థినులు స్థానిక రెడ్‌ట్యాంకు వద్ద ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నారు. నిత్యం ఆటోలో బడికెళ్తారు. అదే ఆటోలో ఓ విద్యార్థిని సోదరుడూ వస్తుంటాడు. పాఠశాల వదిలాక బాలిక, ఆమె సోదరుడు ఆటోలో.. మరో బాలిక తన కుటుంబసభ్యులతో ఇంటికి వెళతారు. సోమవారం బాలిక సోదరుడు అక్క కోసం ఆటోలో వేచి ఉన్నాడు. మరో బాలిక కోసం ఆమె తండ్రి ఎదురుచూస్తున్నాడు. ఉదయం 11.30 గంటలకు పాఠశాల వదిశారు. అరగంట గడిచినా బాలికలిద్దరూ రాలేదు. ఆటో డ్రైవర్‌, బాలిక తండ్రి ఉపాధ్యాయులను అడగ్గా.. వారు ఎప్పుడో వెళ్లిపోయారని చెప్పారు. పాఠశాలలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఇద్దరు విద్యార్థినులు నడుచుకుంటూ రెడ్‌ట్యాంకు వైపు వెళ్లే దృశ్యాలు నమోదయ్యాయి. అక్కడ వెతికినా..ఆచూకీ కనిపించలేదు. వనస్థలిపురం ఠాణాలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు జతయ్యారు. ఆ బాలికల స్నేహితుడిని విచారించగా.. వారు పారిపోయేందుకు మూడు రోజులుగా ప్రణాళిక వేస్తున్నారని, సుష్మా రోడ్డువైపు వెళ్తామని చెప్పారన్నాడు. అటు వైపు వెళ్లి వెతకగా.. బాలికలిద్దరూ బస్టాపులో కన్పించారు. పాఠశాలకు తీసుకొచ్చి విచారించగా.. హిందీ పరీక్ష సరిగా రాయలేదని, తల్లిదండ్రులు తమని వసతిగృహంలో చేరుస్తారన్న భయంతో పారిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. విద్యార్థులను కుటుంబసభ్యులకు అప్పగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని