logo

Andhra News: నాడు ఉప సర్పంచి.. నేడు ఉప ముఖ్యమంత్రి

తారువ ఉప సర్పంచి నుంచి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్థాయికి బూడి ముత్యాలనాయుడి రాజకీయ ప్రస్థానం సాగింది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు

Updated : 12 Apr 2022 06:45 IST

ముత్యాలనాయుడికి అరుదైన అవకాశం

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం, దేేవరాపల్లి, న్యూస్‌టుడే: తారువ ఉప సర్పంచి నుంచి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్థాయికి బూడి ముత్యాలనాయుడి రాజకీయ ప్రస్థానం సాగింది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు అన్ని పార్టీ నుంచి దాదాపు 22 మంది మంత్రులుగా పనిచేశారు. వీరెవరికీ దక్కని గౌరవం ముత్యాలనాయుడికి దక్కింది. రాష్ట్రంలో అయిదుగురికి డిప్యూటీ సీఎం పదవులు దక్కగా అందులో బీసీ కోటాలో బూడికి అవకాశం కల్పించారు.

వైకాపాలోనే కాదు రాజకీయాల్లోనూ ఆయన సీనియర్‌ నాయకుడు. తనకు ఎమ్మెల్యే అవ్వాలనే కోరిక ఈ నాటిది కాదని అనేక సందర్భాల్లో ఆయనే చెప్పారు. ‘కాలేజీ చదివేటప్పుడు దేవరాపల్లిలో ఒక గదిలో ఉండేవాడిని, ఆ గదిలో ఎమ్మెల్యే అనే పదాన్ని రాసుకుని, రోజూ లేచిన వెంటనే ఆ మూడు అక్షరాలు చదివే వాడిని’ అంటూ చెప్పుకొచ్చేవారు. 1988లో ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టి, తారువ పంచాయతీ వార్డు సభ్యుడిగా గెలిచారు. ఉప సర్పంచిగా బాధ్యతలు చేపట్టారు. సర్పంచి, జడ్పీటీసీ సభ్యుడు, ఎంపీపీ పదవులు చేపట్టి ఆ పదవుల్లో తనదైన ముద్ర వేశారు. రాజకీయాల్లో చేరినప్పటి నుంచి అపజయం అనేది చవిచూడలేదు.

2019లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విప్‌ పదవిని తెచ్చిపెట్టింది. తెదేపా ప్రభుత్వంలో చింతకాయల అయ్యన్నపాత్రుడు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ మంత్రిగా ఉపాధి నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసి గుర్తింపు పొందారు. ఇప్పుడు అదే సామాజిక వర్గానికి చెందిన బూడి ముత్యాలనాయుడికి అవే శాఖలు కేటాయించడం విశేషం. తనకు ఇష్టమైన శాఖలు కేటాయించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని