logo

TTD: సర్వం సమస్యలే

సర్వదర్శనం టికెట్లకు రెండు రోజుల విరామం అనంతరం భక్తుల రాకను అంచనా వేయలేకపోవడం.. వేకువజామునే టోకెన్లు ఇవ్వకుండా ఆలస్యం చేయడం.. రద్దీకి అనుగుణంగా భద్రతా సిబ్బంది, పోలీసులను ఏర్పాటు చేయకపోవడం.. వెరసి భక్తుల మధ్య

Updated : 13 Apr 2022 07:26 IST

భక్తుల రాకను అంచనా వేయలేకపోయిన తితిదే
నేరుగా కొండకు అనుమతించాలని అభిప్రాయం 

ఈనాడు-తిరుపతి, న్యూస్‌టుడే, తిరుపతి(తితిదే, గాంధీరోడ్డు, వైద్యవిభాగం): సర్వదర్శనం టికెట్లకు రెండు రోజుల విరామం అనంతరం భక్తుల రాకను అంచనా వేయలేకపోవడం.. వేకువజామునే టోకెన్లు ఇవ్వకుండా ఆలస్యం చేయడం.. రద్దీకి అనుగుణంగా భద్రతా సిబ్బంది, పోలీసులను ఏర్పాటు చేయకపోవడం.. వెరసి భక్తుల మధ్య తిరుపతిలో తొక్కిసలాట చోటుచేసుకుంది. తిరునగరిలో మూడుచోట్ల సర్వదర్శనం టికెట్లు ఇవ్వగా గోవిందరాజస్వామి సత్రాలు, అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లోనే తొక్కిసలాట జరగడం గమనార్హం. శ్రీనివాసంలో క్యూలైన్ల నిర్వహణ బాగుండటంతోనే ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. తితిదే అధికారులు  టోకెన్లు లేకుండా తిరుమలకు అనుమతిస్తున్నట్లు ప్రకటించడంతో పెద్ద ముప్పు తప్పింది.

టైమ్‌స్లాట్‌ టోకెన్ల విధానం కొవిడ్‌ సమయంలో బాగున్నా.. పెరుగుతున్న రద్దీ దృష్ట్యా అమలు చేయడం కష్టసాధ్యమని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో సాధారణ భక్తులను నేరుగా తిరుమలకు అనుమతించి.. కంపార్ట్‌మెంట్లలోకి వచ్చిన తర్వాత రద్దీ మేరకు దర్శనం కల్పించేవారు. అప్పట్లో రోజుకు 75వేల మంది వరకు దర్శనం చేసుకునేవారని, ప్రస్తుతం 65వేల మంది కూడా ఉండట్లేదని అంటున్నారు.  ముందున్న విధానంలోనే భక్తులను కొండకు అనుమతించి దర్శనం కల్పిస్తే బాగుంటుందని భాజపా అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి సహా పలువురు నేతలు సూచిస్తున్నారు.

* శ్రీవారి దర్శన టిక్కెట్లు పొందే క్యూలో నెలకొన్న తొక్కిసలాటలో అస్వస్థతకు గురైన తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా అవిసిరి మండలం సింగారం గ్రామానికి చెందిన వెంకయ్య(65) తిరుపతి రుయా అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు.  

క్యూలైన్లు పర్యవేక్షించిన పోలీసులు 

టోకెన్ల కౌంటర్ల క్యూలైన్‌లో కొంత మేరకు తొక్కిసలాటను పోలీసులు నియంత్రించారు. టోకెన్ల మంజూరు ప్రారంభించిన కొద్దిసేపటికే తొక్కిసలాట జరగడంతో  పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అప్పటికే పదుల సంఖ్యలో భక్తులు కిందపడి అస్వస్థతకు గురయ్యారు. చిత్తూరు ఎస్పీ రిషాంత్‌ రెడ్డి, తిరుపతి అదనపు ఎస్పీలు సుప్రజ, ఆరిఫుల్లా పర్యవేక్షించారు. తిరుపతి తూర్పు సీఐ బీవీ శివప్రసాద్‌రెడ్డి, అలిపిరి సీఐ అబ్బన్న తమ సిబ్బందితో కౌంటర్ల వద్ద  పర్యవేక్షించారు. 

తెదేపా నాయకుల పరామర్శ 

భక్తుల రద్దీని అంచనా వేయడంలో తితిదే విఫలమైందని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆరోపించారు. తిరుపతిలో సర్వదర్శన టోకెన్లు జారీ చేసే క్రమంలో జరిగిన తొక్కిసలాట, తోపులాట ప్రాంతాలను తెదేపా నాయకులు సందర్శించారు. అక్కడున్న భక్తులతో మాట్లాడారు. నాయకులు నరసింహయాదవ్, కార్పొరేటర్‌ ఆర్‌సీˆ మునికృష్ణ, దంపూరి భాస్కర్‌ యాదవ్, రవినాయుడు, సురేంద్రనాయుడు తదితరులు ఉన్నారు. 


పాదయాత్రగా వచ్చి నిలిచిపోయా

 గోపాల్, తిరువణ్ణామలై, తమిళనాడు

తిరువణ్ణామలై నుంచి 20 మంది బృందంతో కలిసి వచ్చా. అందరూ లైన్‌లోకి వెళ్లారు. తోపులాటలో ఊపిరి ఆడక బయటకొచ్చేశా. వందల కిలో మీటర్లు నడచి వచ్చినా ఇబ్బంది కలగలేదు. స్వామివారి దర్శనం కల్పించడంలో తితిదే పూర్తిగా విఫలమైంది. డబ్బులు పెట్టేవారికి మంచి దర్శనాలు కల్పిస్తోంది. మాలాంటి వారికి దర్శనం ఇవ్వరు. 


రెండు రోజులుగా అన్నం, నీళ్లు లేవు

 రాధమ్మ, కేజీఎఫ్, కర్ణాటక 

మా గ్రామస్థులతో కలిసి వచ్చా. శనివారం రాత్రి తిరుపతికి వస్తే టికెట్లు ఇవ్వమని చెప్పడంతో ఇక్కడే చెట్ల కింద ఉన్నాం. ఇంత దూరం వచ్చిన తర్వాత స్వామి దర్శనం చేసుకోవాలని ఇక్కడే ఉంటున్నాం. రెండు రోజులుగా తాగడానికి నీళ్లు, తినడానికి అన్నం లేదు. తితిదే ఇంతమంది భక్తులకు సౌకర్యాలు కల్పించకపోతే ఎలా?



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు