logo

Hyd News: నేడే వీరహనుమాన్‌ విజయయాత్ర.. ట్రాఫిక్‌ ఆంక్షలు ఎక్కడంటే?

హనుమజ్జయంతి సందర్భంగా ఏటా వైభవోపేతంగా నిర్వహించే వీరహనుమాన్‌ విజయయాత్రను ప్రశాంతంగా పూర్తిచేసేందుకు పోలీస్‌ యంత్రాంగం సిద్ధమైంది. 8000 మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించనున్నారు.

Updated : 16 Apr 2022 07:39 IST

 గౌలిగూడ రామాలయం- తాడ్‌బండ్‌ వీరాంజనేయ స్వామి దేవాలయం వరకు నిఘా
8 వేల మంది పోలీసుల మోహరింపు

శోభాయాత్ర సాగే మార్గాన్ని నగర సీపీ సీవీ ఆనంద్‌కు వివరిస్తున్న ఏసీపీ పి.దేవేందర్‌, చిత్రంలో అదనపు సీపీ చౌహాన్‌ తదితరులు

ఈనాడు, హైదరాబాద్‌; సుల్తాన్‌బజార్‌, గాంధీనగర్‌, కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: హనుమజ్జయంతి సందర్భంగా ఏటా వైభవోపేతంగా నిర్వహించే వీరహనుమాన్‌ విజయయాత్రను ప్రశాంతంగా పూర్తిచేసేందుకు పోలీస్‌ యంత్రాంగం సిద్ధమైంది. 8000 మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించనున్నారు. గౌలిగూడ రామ్‌మందిర్‌ నుంచి తాడ్‌బండ్‌లోని వీరాంజనేయస్వామి దేవాలయం వరకూ 21 కి.మీ. మేర యాత్ర కొనసాగనుంది. వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌ నేతృత్వంలో శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమై రాత్రి 8 గంటలకు ముగిసే ఈ ఊరేగింపులో వేల సంఖ్యలో కార్యకర్తలు, యువకులు పాల్గొననున్నారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌, తదితర కీలక ప్రాంతాల్లో యాత్ర కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ తాడ్‌బండ్‌ వీరాంజనేయ స్వామి ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకొన్నారు. అక్కడ పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించారు. అదనపు పోలీస్‌ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌, జాయింట్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌, స్పెషల్‌ బ్రాంచి జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ పి.విశ్వప్రసాద్‌, జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌(అడ్మిన్‌) ఎం.రమేష్‌, జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌(సీసీఎస్‌) జి.భూపాల్‌, డీసీపీలు ప్రకాశ్‌రెడ్డి, రాజేష్‌చంద్ర, చందనాదీప్తి, చక్రవర్తి, అదనపు డీసీపీ రమణారెడ్డి, చిక్కడపల్లి ఏసీపీ చల్లా శ్రీధర్‌, వీరాంజనేయస్వామి ఆలయ ఈవో అంబుజ తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యక్ష ప్రసారం: ఊరేగింపును ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాలను ఆయా ఠాణాల ద్వారా కంట్రోల్‌ రూంకు అనుసంధానించి పరిశీలించనున్నారు. అదనంగా మరో నాలుగు డ్రోన్‌ కెమెరాలు వినియోగించనున్నారు.

ట్రాఫిక్‌ ఆంక్షలు..
*  ఊరేగింపు సాగనున్న ప్రాంతాల్లో శనివారం ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలవనున్నాయి.
*  ఉదయం 11- మధ్యాహ్నం 12.30 గౌలిగూడ రామ్‌మందిర్‌ నుంచి ఆంధ్రా బ్యాంక్‌ కోఠి వరకు.
*  మ. 12.30-1.30 వరకు: కోఠీలోని డీఎంహెచ్‌ కార్యాలయం నుంచి కాచిగూడ క్రాస్‌రోడ్స్‌ వరకు.
* మ. 1.30-2.15 గంటలు: కాచిగూడ క్రాస్‌రోడ్స్‌ నుంచి నారాయణగూడ క్రాస్‌రోడ్స్‌ వరకు.

* మ.2.15-4.15: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, వీఎస్‌టీ, బాగ్‌లింగంపల్లి, ఇందిరాపార్క్‌, కవాడీగూడ క్రాస్‌రోడ్స్‌ వరకు.
*  సాయంత్రం 4.15-5.45: పాత రాంగోపాల్‌పేట ఠాణా వరకు.

* సా.6-7: ప్యారడైజ్‌ కూడలి నుంచి బ్రూక్‌బాండ్‌ కాలనీ వరకు.

* సా.7- రాత్రి 8: బ్రూక్‌బాండ్‌ నుంచి తాడ్‌బండ్‌ వీరాంజనేయ స్వామిదేవాలయం వరకు.

నేడు మద్యం అమ్మకాలు బంద్‌
నేరేడ్‌మెట్‌: హనుమజ్జయంతిని పురస్కరించుకొని రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో శనివారం ఉదయం 6 నుంచి ఆదివారం ఉదయం 6గంటల వరకు మద్యం అమ్మకాలు ఉండవని సీపీ మహేష్‌భగవత్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు