logo

మంత్రి ఉషశ్రీచరణ్‌ ర్యాలీ.. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా అడ్డుకోవడంతో చిన్నారి మృతి!

ప్రాణాపాయ స్థితిలో ఉన్న పసిపాపను ఆసుపత్రికి తీసుకెళుతున్న తల్లిదండ్రులను మంత్రి ఊరేగింపు ఉందనే కారణంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సకాలంలో చికిత్స అందక తమ కూతరు ప్రాణాలు కోల్పోయిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

Updated : 16 Apr 2022 08:21 IST

తల్లిదండ్రుల ఆరోపణ


పాప మృతదేహాన్ని ఎత్తుకుని విలపిస్తున్న తండ్రి గణేష్‌

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రాణాపాయ స్థితిలో ఉన్న పసిపాపను ఆసుపత్రికి తీసుకెళుతున్న తల్లిదండ్రులను మంత్రి ఊరేగింపు ఉందనే కారణంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సకాలంలో చికిత్స అందక తమ కూతురు ప్రాణాలు కోల్పోయిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన కళ్యాణదుర్గంలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. శెట్టూరు మండలం చెర్లోపల్లికి చెందిన గణేష్‌, ఈరక్కకు 8 నెలల కిందట కూతురు పుట్టింది. శుక్రవారం సాయంత్రం పాప తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆటోలో కళ్యాణదుర్గం తీసుకొచ్చారు. స్థానిక ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్‌ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం పట్టణానికి వస్తున్న సందర్భంగా భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. బందోబస్తులో భాగంగా పోలీసులు పట్టణ శివారులోని బ్రహ్మయ్యగుడి వద్ద వాహనాన్ని నిలబెట్టారు. ఆలస్యమవుతుందని అడ్డదారిలో తెలిసినవారి ద్విచక్రవాహనంలో 15 నిమిషాల తర్వాత ఆర్డీటీ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారని తల్లిదండ్రులు వాపోయారు. పోలీసులు అడ్డుకోకుండా ఉంటే తమ పాప బతికేదని తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ విలపించారు. సకాలంలో అంబులెన్సు కూడా రాలేదని పాప మేనమామ ప్రశాంత్‌ ఆరోపించారు. పాప మృతదేహంతో రోడ్డుమీద బైఠాయించేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆ దంపతులకు మూడేళ్ల మరో కుమార్తె ఉంది. కళ్యాణదుర్గం పట్టణ సీఐ తేజోమూర్తి వివరణ కోరగా ర్యాలీ బందోబస్తులో భాగంగా తాము ఎవరినీ అడ్డుకోలేదని.. పాపకు అస్వస్థత అని తెలియగానే వారిని పంపించామని వివరించారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని