logo

Crime News: మాయమాటల్తో మనసు దోచి.. మనువాడతానని డబ్బులన్నీ కాజేసి!

భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటున్న ఓ మహిళ(40) నగరంలోని కార్పొరేట్‌ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. గతేడాది మార్చిలో జీవిత భాగస్వామి కోసం డైవోర్సీ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేశారు. నవంబరులో ఆ వెబ్‌సైట్‌ను పరిశీలిస్తుండగా ఓ వ్యక్తి (రవి మనీష్‌) వివరాలు ఆకట్టుకున్నాయి

Updated : 10 Aug 2022 10:44 IST

ఈనాడు, హైదరాబాద్‌: భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటున్న ఓ మహిళ(40) నగరంలోని కార్పొరేట్‌ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. గతేడాది మార్చిలో జీవిత భాగస్వామి కోసం డైవోర్సీ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేశారు. నవంబరులో ఆ వెబ్‌సైట్‌ను పరిశీలిస్తుండగా ఓ వ్యక్తి (రవి మనీష్‌) వివరాలు ఆకట్టుకున్నాయి. అతడి ఫేస్‌బుక్‌ ఖాతా నుంచి వివరాలు సేకరించి వాట్సప్‌ నంబరుతో ఆమె మాట కలిపారు. ఒకరి గురించి మరొకరు తెలుసుకున్నారు. తాను అమెరికాలో ఆర్థోపెడిక్‌ సర్జన్‌గా పనిచేస్తున్నట్టు తెలిపాడు. ప్రత్యేక విధుల్లో భాగంగా టర్కీ మిలటరీ బేస్‌మెంట్స్‌లో విధులు నిర్వర్తిస్తున్నట్టు నమ్మించాడు. ఇద్దరి అభిరుచులు, ఆలోచనలు కలవటంతో పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభిద్దామంటూ ఆశ చూపాడు. అసోంలోని గువాహటిలో తన బంధువులున్నారంటూ ఓ వ్యక్తి (ప్రియ మహేంద్ర) వాట్సప్‌ నంబరు ఆమెకు పంపాడు. టర్కీ నుంచివచ్చేందుకు 1500 అమెరికన్‌ డాలర్లు అక్కడ చెల్లించాల్సి ఉంటుందంటూ తెలివిగా బాధితురాలిని బుట్టలో పడేశాడు. అక్కడ నుంచి రాగానే పెళ్లి చేసుకుందామని, తన వద్ద చాలా డబ్బు ఉందని మాయమాటలతో నమ్మించాడు. బాధితురాలు వివిధ బ్యాంకుల 12ఖాతాల్లో దఫాల వారీగా మొత్తం రూ.34,12,005 జమ చేసింది. మార్చి 23న పెళ్లి చేసుకుంటానన్నాడు. అదే నెల 24న బాధితురాలి మొబైల్‌ నంబరుకు ఒక మహిళ ఫోన్‌ చేశారు. దిల్లీ విమానాశ్రయంలో రవి మనీష్‌ పట్టుబడ్డాడని, అతడి వద్ద రూ.8 కోట్లు (అమెరికన్‌ డాలర్లు) దొరికాయంటూ ఫోన్‌ ద్వారా వివరించారు. ఆ డబ్బుకు సంబంధించిన పత్రాలు లేకపోవటం వల్ల డీడీ ఛార్జెస్‌, కస్టమ్స్‌ డ్యూటీ కింద రూ.6,07,005 వెంటనే చెల్లించాలంటూ బాధితురాలి వాట్సప్‌ నంబరుకు బ్యాంకు ఖాతా వివరాలు పంపారు. అప్పటికిగానీ బాధితురాలికి అసలు విషయం బోధపడలేదు. తాను మోసపోయినట్టు గ్రహించిన ఆమె సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివాహం, బహుమతులు వచ్చాయంటూ సైబర్‌ మాయగాళ్లు మోసం చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఆశల వల వేసి పెద్దఎత్తున డబ్బు కొట్టేస్తున్న సైబర్‌ నేరస్థుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని