logo

Crime News: హైదరాబాద్‌లో మోసాలు... గోవాలో విలాసాలు

కార్లు కొనేందుకు బ్యాంకుల్లో రుణాలు తీసుకునే వారికి నకిలీ టీఆర్‌(తాత్కాలిక రిజిస్ట్రేషన్‌) నంబర్లు ఇచ్ఛి. రూ.కోట్లు స్వాహా చేసిన తల్వార్‌ కార్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ యజమాని సాకేత్‌

Updated : 21 Apr 2022 08:06 IST

‘తల్వార్‌ కార్స్‌’ యజమాని సాకేత్‌ అరెస్ట్‌

ఈనాడు, హైదరాబాద్‌: కార్లు కొనేందుకు బ్యాంకుల్లో రుణాలు తీసుకునే వారికి నకిలీ టీఆర్‌(తాత్కాలిక రిజిస్ట్రేషన్‌) నంబర్లు ఇచ్ఛి. రూ.కోట్లు స్వాహా చేసిన తల్వార్‌ కార్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ యజమాని సాకేత్‌ తల్వార్‌(41)ను హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. గోవాలోని ఓ విల్లాలో అతన్ని అదుపులోకి తీసుకొని, స్థానిక కోర్టులో హాజరుపరిచి హైదరాబాద్‌ తీసుకొస్తున్నారు. మూడేళ్ల నుంచి సాకేత్‌ ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు బ్యాంక్‌ అధికారులు ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా నారాయణగూడ కెనరా బ్యాంక్‌ చీఫ్‌ మేనేజర్‌ ఫిర్యాదు చేశారు. వోల్వో కారుకు రుణం కావాలంటూ శ్రేష్ట్‌ ఇండస్ట్రీస్‌ సంప్రదించగా.. రూ.కోటి రుణం ఇచ్చామని, తర్వాత వారు కిస్తీలు చెల్లించడంలేదని పేర్కొన్నారు. పలు బ్యాంకులను ఇలా బురిడీ కొట్టించిన సాకేత్‌ బృందం రూ.1.90 కోట్లు కొల్లగొట్టినట్లు పోలీసులు గుర్తించారు. గతేడాది ఆగస్టులో నిందితుణ్ని అరెస్ట్‌ చేశారు. బెయిల్‌పై విడుదలై కొద్దినెలల క్రితం గోవాకు వెళ్లాడు. నెలకు రూ.10 లక్షల పైనే చెల్లించి ఒక విల్లాలో అద్దెకు ఉంటున్నాడు. అక్కడ విందులు, వినోదాలతో గడుపుతున్నాడు. హైదరాబాద్‌లో ఉంటే అరెస్ట్‌ చేస్తారని తెలుసుకున్న సాకేత్‌ గోవాకు మకాం మార్చగా ఎస్సై కె.రామకృష్ణ అక్కడికెళ్లి నిందితుణ్ని అరెస్ట్‌ చేశారు. నిందితుడిపై హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్లలో ఎనిమిది కేసులున్నాయని సంయుక్త కమిషనర్‌(నేర పరిశోధన) డాక్టర్‌ గజరావ్‌ భూపాల్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని