logo

Crime News: రూ.లక్ష మదుపుతో నెలకు రూ.15 వేల లాభమంటూ..

మా సంస్థలో రూ.లక్ష మదుపు చేస్తే నెలకు రూ.15 వేల చొప్పున ఆరు నెలల్లో రూ.90 వేలు లాభం తీసుకోండి అంటూ ఘాజియాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న మాక్సీజోన్‌ టచ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ

Updated : 23 Apr 2022 09:19 IST

మాక్సీజోన్‌ టచ్‌ సంస్థ టోకరా

చంద్రభూషణ్‌సింగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: మా సంస్థలో రూ.లక్ష మదుపు చేస్తే నెలకు రూ.15 వేల చొప్పున ఆరు నెలల్లో రూ.90 వేలు లాభం తీసుకోండి అంటూ ఘాజియాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న మాక్సీజోన్‌ టచ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ గొలుసుకట్టు పథకం పేరుతో భారీ మోసానికి పాల్పడింది. నెలనెలా లాభం మాక్సీజోన్‌ నుంచి నగదు జమ కాకపోవడంతో మదుపరులకు అనుమానం వచ్చి ఆరా తీయగా.. సంస్థ కార్యాలయాలకు తాళాలున్నాయి.. మోసపోయామని గ్రహించిన బాధితుల్లో కొందరు హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తాము రూ.2 కోట్లకుపైగా మదుపు చేశామని, మెట్రోనగరాలు, పట్టణాల్లో 20 వేల మంది సభ్యులున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు ఈ సంస్థపై కేసు నమోదు చేశారు. ఈ సంస్థపై జంషెడ్‌పూర్‌లోనూ శుక్రవారం అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు.

మీరు చేరితే రూ.15 వేల లాభం.. సభ్యుల్ని చేర్పిస్తే కమీషన్‌

* సంస్థకు ఇచ్చిన రూ.లక్షకు డిపాజిట్‌ పేరుతో రసీదు ఇస్తారు. నెలనెలా సభ్యుడి బ్యాంక్‌ ఖాతాలో రూ.15 వేల నగదు జమ చేస్తారు. ఆరు నెలల తర్వాత సభ్యత్వం ఉపసంహరించుకుంటే రూ.లక్ష వెనక్కి ఇస్తారు.

*ఎవరైనా సభ్యులు కొత్తగా సభ్యులను చేర్పిస్తే ఒక్కో సభ్యుడికి రూ.5 వేల చొప్పున కమీషన్‌ ఇస్తున్నారు.

* హైదరాబాద్‌లో 4 నెలల్లో ఐదు వందల మందికిపైగా సభ్యులుగా చేరారు.

* పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుల్లో ఓ మహిళ తాను మాక్సీజోన్‌ టచ్‌లో రూ.1.47 కోట్లు మదుపు చేశానని, మూడు నెలల నుంచి లాభం ఇవ్వడం లేదని తెలిపింది.

మార్కెట్లో పెట్టుబడులు అంటూ భారీగా ప్రచారం..

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన చంద్రభూషణ్‌సింగ్‌ రెండున్నరేళ్ల క్రితం ఘాజియాబాద్‌లోని రాజ్‌నగర్‌ ఎక్స్‌టెన్షన్‌లో మాక్సీజోన్‌ టచ్‌ కార్యాలయాన్ని ప్రారంభించాడు. రూ.లక్ష చెల్లించి సభ్యులుగా చేరితే.. సభ్యుల డిపాజిట్‌తో తాము షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెడతామని, భారీ లాభాలను సభ్యులకు పంచుతామని పత్రికలు, సామాజిక మాధ్యమాలు, టెలిగ్రామ్‌ల ద్వారా తన సంస్థపై విస్తృతంగా ప్రచారం చేయించాడు. ఏడాదిలోనే 10 వేల మందికిపైగా మాక్సీజోన్‌ టచ్‌లో సభ్యులయ్యారు. రెండు నెలల నుంచి సభ్యులకు లాభం ఇవ్వకపోవడంతోపాటు సభ్యులుగా చేరినప్పుడు చెల్లించిన రూ.లక్ష ఇవ్వాలని కోరినా.. స్పందించడం లేదు. రూ.లక్షల్లో మదుపు చేసిన బాధితుల్లో కొందరు ఘాజియాబాద్‌కు వెళ్లి విచారించగా.. మాక్సీజోన్‌ టచ్‌ కార్యాలయానికి తాళం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని