logo

Crime News: కారు ఖరీదెంతైనా రూ.5 లక్షలకే విక్రయం

రాజస్థాన్‌కు చెందిన అంతర్రాష్ట్ర దొంగ సత్యేంద్రసింగ్‌ షెకావత్‌ మామూలోడు కాదంటున్నారు పోలీసులు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వందలాది కార్లను కొట్టేసిన ఇతడు గతేడాది గ్రేటర్‌ పరిధిలోనూ 5 కార్లు

Updated : 25 Apr 2022 07:23 IST

సత్యేంద్రసింగ్‌ షెకావత్‌

ఈనాడు, హైదరాబాద్‌ న్యూస్‌టుడే, జూబ్లీహిల్స్‌: రాజస్థాన్‌కు చెందిన అంతర్రాష్ట్ర దొంగ సత్యేంద్రసింగ్‌ షెకావత్‌ మామూలోడు కాదంటున్నారు పోలీసులు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వందలాది కార్లను కొట్టేసిన ఇతడు గతేడాది గ్రేటర్‌ పరిధిలోనూ 5 కార్లు చోరీ చేసినట్టు కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని బంజారాహిల్స్‌ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విచారణలో షెకావత్‌ గురించి పలు కొత్త విషయాలు వెలుగుచూసినట్టు సమాచారం. జైపూర్‌లో పుట్టి పెరిగిన షెకావత్‌ ఎంబీఏ చదివాడు. విలాసవంతమైన జీవితం గడిపేందుకు దొంగతనాలను ఎంచుకున్నాడు. 2003 నుంచి ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా ఇతడిపై 500లకు పైగా కేసులు నమోదయ్యాయి.

ఒకే ఒక్కడు.. లక్కీ కారు
ఇతడు ఎవర్నీ నమ్మడు. దొంగతనాలు చేసేందుకు ఎవరి సహాయం తీసుకోడు. కొట్టేసిన కార్లను అమ్మగా వచ్చిన సొమ్ముతో సొంతగా స్కోడా రాపిడ్‌ కొన్నాడు. ఎక్కడ చోరీ చేయాలన్నా అదే లక్కీకారులో ఒక్కడే వెళ్తాడు. నక్షత్రాల హోటళ్లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, పబ్‌లు సంపన్నవర్గాలు వెళ్లే ప్రాంతాలను ఎంచుకుంటాడు. ఖరీదైన కారును ఎంపిక చేసుకుని చైనా నుంచి కొనుగోలు చేసిన పరికరం సహాయంతో దాని తాళాన్ని హ్యాకింగ్‌ చేస్తాడు. 30-40 నిమిషాల్లో నకిలీ తాళం తయారు చేయించి దర్జాగా కారును కొట్టేస్తాడు. సొంతకారును అక్కడే పార్కింగ్‌లో వదిలేసి చోరీ చేసిన వాహనంతో హరియాణా సరిహద్దుకు చేరతాడు. అక్కడే ఖరీదైన కారును రూ.4-5లక్షల మధ్య విక్రయిస్తాడు. సొంత కారు వదిలిన నగరానికి విమానంలో వచ్చి దాన్ని తీసుకెళ్తాడు. గతేడాది బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 2 పార్క్‌ హయత్‌ హోటల్‌లో చోరీ చేసిన కారును హరియాణాలో రూ.5లక్షలకు విక్రయించినట్టు పోలీసుల కస్టడీలో చెప్పినట్టు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని