logo

Telangana News: ప్రియురాలి ఇంటిముందు ప్రియుడి అనుమానాస్పద మృతి

ప్రియురాలి ఇంటిముందు ప్రియుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగులో జరిగింది. మంథని ఎస్సై చంద్రకుమార్‌ కథనం ప్రకారం.. వరంగల్‌ జిల్లా చెన్నరావుపేట మండలం పాపయ్యపేటకు

Published : 26 Apr 2022 08:13 IST

పెద్దపల్లి జిల్లాలో ఘటన

సందీప్‌

ఈనాడు డిజిటల్‌, పెద్దపల్లి, న్యూస్‌టుడే, మంథని గ్రామీణం: ప్రియురాలి ఇంటిముందు ప్రియుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగులో జరిగింది. మంథని ఎస్సై చంద్రకుమార్‌ కథనం ప్రకారం.. వరంగల్‌ జిల్లా చెన్నరావుపేట మండలం పాపయ్యపేటకు చెందిన గాలి సందీప్‌ (21) హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతూ వసతిగృహంలో ఉంటున్నాడు. ఇతని తండ్రి గాలి వెంకన్న హమాలీ పని చేస్తుండగా తల్లి విజయ వ్యవసాయ దినసరి కూలీగా పనిచేస్తోంది. ఇతని సోదరి హనుమకొండలోని వసతిగృహంలో ఉంటూ పోటీపరీక్షలకు సిద్ధమవుతోంది. కాగా మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన ఓ అమ్మాయి హనుమకొండలోని ఓ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నప్పుడు సందీప్‌కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని ప్రేమగా భావించి పెళ్లి చేసుకుందామంటూ వేధింపులకు గురిచేయడంతో విషయం అమ్మాయి తల్లిదండులకు తెలిసింది. దీంతో ఆమెను కరీంనగర్‌లోని ఓ డిగ్రీ కళాశాలలో చేర్చి చదివిస్తున్నారు. ప్రేమ విషయమై పలుమార్లు సందీప్‌ను హెచ్చరించినా తనను వివాహం చేసుకోవాలని అమ్మాయిని వేధిస్తున్నాడు. ఆమె నిరాకరించడంతో ప్రతీకారంగా గతంలో వారిద్దరూ కలిసి ఉన్న చిత్రాలను గుంజపడుగు గ్రామానికి చెందిన కొందరు యువకులకు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. ఈ విషయం తెలిసి అమ్మాయి తండ్రి మంథని గత ఫిబ్రవరిలో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో వేధింపుల కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం ఏప్రిల్‌ 22న సందీప్‌ బెయిల్‌పై విడుదలయ్యాడు. ఏప్రిల్‌ 23న సందీప్‌ బాబాయ్‌ శ్రీనివాస్‌తో కలిసి మంథని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కండీషన్‌ బెయిల్‌ ప్రకారం సంతకం చేసి తిరిగి అదే రోజున వారిద్దరూ కాజీపేటలోని శ్రీనివాస్‌ ఇంట్లోనే నిద్రపోయారు. 24న సందీప్‌ తన సోదరిని హనుమకొండలోని వసతిగృహంలో దింపేసి ఇంటికి వెళతానని చెప్పాడు. అర్ధరాత్రి దాటినా సందీప్‌ ఇంటికి రాకపోవడం, ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ రావడంతో కుటుంబ సభ్యులు చెన్నారావుపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా ఆదివారం అర్ధరాత్రి సందీప్‌ పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడని గోదావరిఖని ప్రాంతీయాసుపత్రికి తరలిస్తున్నామని మంథని 108 సిబ్బంది చెన్నారావుపేట పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో వైద్య సిబ్బంది సూచన మేరకు కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే సందీప్‌ చనిపోయినట్లు వివరించారు. తమ కుమారుడి మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని సందీప్‌ తండ్రి వెంకన్న పోలీస్‌లకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చంద్రకుమార్‌ తెలిపారు.

ఎవరూ ప్రేమించవద్దంటూ సందేశం

ఎవరూ ప్రేమ పేరుతో తనలాగా మోసపోవద్దని సందీప్‌ తన స్నేహితులకు సామాజిక మాధ్యమాల ద్వారా పోస్టుపెట్టాడు. జైలు జీవితం ఎవరికీ వద్దని ఐ మిస్‌యూ ఫ్రెండ్స్‌ అంటూ సందేశాలు పంపి తన ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసుకున్నట్లు అతని స్నేహితులు చెబుతున్నారు. తను చనిపోతున్నానని వీలైతే తన తల్లితండ్రులకు, సోదరికి సాయం చేయాలని సందేశాల్లో కోరాడని చెబుతున్నారు.


గుంజపడుగులో కలకలం

ప్రియురాలి ఇంటి ముందు ప్రియుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన మంథని మండలంలో గుంజపడుగులో సోమవారం కలకలం సృష్టించింది. ఒంటిపై పెట్రోల్‌పోసుకొని నిప్పంటించుకున్నట్లు స్థానికులు చెబుతున్నా వాస్తవానికి ఎవరైనా ఒంటిపై పోసి నిప్పంటించారా? అతనే ఆత్మహత్యకు పాల్పడ్డాడా? అనేది చిక్కుప్రశ్నగా మారింది. హనుమకొండ నుంచి ఆదివారం రాత్రి బయల్దేరి ఇంటికి వస్తానని చెప్పిన సందీప్‌ అక్కడి నుంచి నేరుగా మంథనికి ఒక్కడే వెళ్లాడా? ఇంకా ఎవరి సాయంతోనైనా వచ్చాడా? అనేది తేలాల్సి ఉంది. కాగా గుంజపడుగులో సందీప్‌ ప్రియురాలి ఇంటి ముందు గొడవ చేస్తున్నాడని ముందుగా యువతి తండ్రి అర్ధరాత్రి సమయంలో మంథని ఎస్సైకి సమాచారం ఇవ్వగా కానిస్టేబుళ్లను అక్కడికి పంపించినట్లు తెలిసింది. ఈలోగా మరోసారి ఫోన్‌చేసిన యువతి తండ్రి సందీప్‌ ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్నట్లు సమాచారం ఇచ్చాడు. దీంతో ఎస్సై 108 వాహనానికి సమాచారం ఇచ్చి పోలీసులను, స్థానికులను సందీప్‌ను రక్షించేందుకు అప్రమత్తం చేశారు. పోలీసులు చేరుకోగానే సందీప్‌ను 108 వాహనంలో తరలించి గోదావరిఖని ప్రాంతీయాసుపత్రికి తరలించినట్లు చెబుతున్నారు. ఇతర ప్రాంతం నుంచి వచ్చిన యువకుడు పెట్రోల్‌ సీసాతో ఆత్మహత్య చేసుకుంటానని చెప్పే క్రమంలో గ్రామంలో అలజడి ఉంటుంది. స్థానికులు అడ్డుకోవడం, నచ్చజెప్పటం చేస్తుంటారు. ఈ గ్రామంలో అటువంటి పరిస్థితులు కనిపించలేదు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సందీప్‌ మరణ వార్తతో పాపయ్యపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. చేతికందివచ్చిన కుమారుడి ఆత్మహత్యతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. సందీప్‌ మృతదేహాన్ని సోమవారం స్వగ్రామానికి తీసుకువచ్చిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని