logo

Telangana News: కసాయి కొడుకులు.. తల్లి హత్యకు సహకరించిన తనయులు

కన్నతల్లి ప్రేమకు ఏదీ సాటి రాదు.. అలాంటి అమ్మను.. కళ్ల ముందే తండ్రి చావబాదుతున్నా.. అడ్డుకొనే ప్రయత్నం చేయలేదు సరికదా.. అరిస్తే చెల్లెలిని చంపేస్తామని బెదిరించడంతో దెబ్బలు తింటూ నరకయాతన అనుభవించింది.

Updated : 01 May 2022 07:51 IST


బాలకృష్ణ, శివశంకర్‌, లక్ష్మణ్‌

జీడిమెట్ల, న్యూస్‌టుడే: కన్నతల్లి ప్రేమకు ఏదీ సాటి రాదు.. అలాంటి అమ్మను.. కళ్ల ముందే తండ్రి చావబాదుతున్నా.. అడ్డుకొనే ప్రయత్నం చేయలేదు సరికదా.. అరిస్తే చెల్లెలిని చంపేస్తామని బెదిరించడంతో దెబ్బలు తింటూ నరకయాతన అనుభవించింది. శుక్రవారం గాజులరామారంలో జరిగిన మహిళా హత్య కేసులో నిందితుడైన భర్త, సహకరించిన తనయులను రిమాండ్‌కు తరలించినట్లు జీడిమెట్ల ఇన్‌స్పెక్టర్‌ కె.బాలరాజు వెల్లడించారు. గాజులరామారం బతుకమ్మబండకు చెందిన బాలకృష్ణ, మమత(38) దంపతులు. వారికి 23 ఏళ్ల కిందట వివాహం జరిగింది. ఇద్దరు కొడుకులు ఇంటర్‌లోనే చదువు మానేసి తండ్రితో పాటు ఏసీ మెకానిక్‌లుగా పనిచేస్తున్నారు. ఓ కుమార్తె ఉంది. ఏడాదిగా భర్తకు భార్యపై అనుమానం కలుగుతోంది. దాంతో ఇంట్లోనే గృహ నిర్బంధం చేశాడు. ఈ వేధింపులు తాళలేక ఈ ఏడాది జనవరిలో కుమార్తెతో కలిసి ఇల్లు విడిచివెళ్లిపోయింది. ఆచూకీ తెలుసుకొని మళ్లీ ఇంటికి తీసుకొచ్చారు. కుమార్తె కూడా తల్లికి సహకరిస్తుందనే కారణంతో చదువు మాన్పించారు. హత్యకు వారం రోజుల ముందు నుంచి గొడవ ముదిరింది. శుక్రవారం ఉదయం మళ్లీ గొడవపడి.. ఇంట్లో కట్టేసి కొట్టి చంపారు. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించగా.. స్థానికులు పోలీసులకు సమచారం ఇవ్వగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భర్త బాలకృష్ణ, కుమారులు శివశంకర్‌, లక్ష్మణ్‌ను రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్‌ కె.బాలరాజు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని