logo

Crime News: నాలుగు రోజుల్లో పెళ్లి.. అంతలోనే విషాదం

నాలుగు రోజుల్లో పెళ్లి ఉండగా.. కారు ఢీకొని చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందిన ఘటన మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం ఎదులాబాద్‌లో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం..

Updated : 02 May 2022 07:25 IST

కారు ఢీకొని చికిత్స పొందుతూ యువకుడి మృతి

వట్టిపల్లి నాగరాజు

ఘట్‌కేసర్‌, న్యూస్‌టుడే: నాలుగు రోజుల్లో పెళ్లి ఉండగా.. కారు ఢీకొని చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందిన ఘటన మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం ఎదులాబాద్‌లో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎదులాబాద్‌కు చెందిన వట్టిపల్లి లక్ష్మి, యాదయ్యగౌడ్‌ దంపతుల ఏకైక కుమారుడు నాగరాజుగౌడ్‌(28) ప్రైవేటు ఉద్యోగి. ఏప్రిల్‌14న పెద్దలు పెళ్లి కుదిర్చారు. వివాహం యాదాద్రిభువనగిరి జిల్లా భువనగిరి మండలం బండసోమారంలో నిశ్చయించారు. శుభలేఖలు బంధుమిత్రులకు ఇచ్చారు. దగ్గర బంధువులు పెళ్లి ఇంటికొచ్చారు. ఆ ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది. గత నెల 10న పెళ్లి కోసం సామగ్రి కొనుగోలుకు ద్విచక్రవాహనంపై తన సోదరితో కలిసి నాగరాజుగౌడ్‌ ఘట్‌కేసర్‌కు బయలుదేరారు. పెట్రోల్‌ బంకు వద్దకు రాగానే అతివేగంగా వచ్చిన కారు ఢీకొంది. తీవ్ర గాయాలు కావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి(గత నెల 30న) మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను వినయ్‌ని అరెస్టుచేసినట్లు ఎస్సై విజయకృష్ణ చెప్పారు.

గ్రామస్థుల ఆందోళన

నాగరాజు మృతదేహాన్ని ఘట్‌కేసర్‌ మండలం బొక్కానిగూడలో నివాసముంటున్న కారు యజమాని ఇంటి వద్దకు గ్రామస్థులు, స్నేహితులు, బంధువులు తీసుకొచ్చారు.  కుటుంబ సభ్యులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. పోలీసులు నచ్చజెప్పడంతో రాత్రి ఆందోళన విరమించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని