logo

Andhra News: ప్రియుడితో తిరగొద్దన్నందుకు.. భర్తను చంపించిన భార్య

పిల్లలకు ఎదిగే వయసొచ్చిందని.. ప్రియుడితో తిరగడం ఆపాలని భర్త పదేపదే చెప్పడంతో భార్య వైరం పెంచుకొంది. కొందరితో కలిసి కట్టుకున్న భర్తనే కడతేర్చింది. అనంతరం మృతదేహాన్ని రైలు పట్టాలపై పడేయగా.. అనుమానం వచ్చిన పోలీసులు ఆరా తీశారు.

Updated : 02 May 2022 14:02 IST


వివరాలు వెల్లడిస్తున్న సీఐ సత్య మంగవేణి, ఎస్‌ఐలు 

విజయనగరం (నేరవార్తా విభాగం) న్యూస్‌టుడే: పిల్లలకు ఎదిగే వయసొచ్చిందని.. ప్రియుడితో తిరగడం ఆపాలని భర్త పదేపదే చెప్పడంతో భార్య వైరం పెంచుకొంది. కొందరితో కలిసి కట్టుకున్న భర్తనే కడతేర్చింది. అనంతరం మృతదేహాన్ని రైలు పట్టాలపై పడేయగా.. అనుమానం వచ్చిన పోలీసులు ఆరా తీశారు. హత్యగా నిర్ధారించి నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించిన ఘటన విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలను సీఐ సత్య మంగవేణి ఆదివారం వెల్లడించారు.  
మెరకముడిదాం గ్రామానికి చెందిన అట్టాడ చంద్రశేఖర్‌ మిమ్స్‌లో క్లర్కుగా పనిచేస్తున్నారు. ఆయనకు 16 ఏళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని వెంకటాపురానికి చెందిన అరుణ జ్యోతితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. వీరంతా నెల్లిమర్ల మండలంలోని గొల్లవీధికి చెందిన కె.రాంబాబు ఇంట్లో అద్దెకు ఉన్నారు. ఆ సమయంలో రాంబాబు, అరుణ జ్యోతి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత చంద్రశేఖర్‌ భార్యతో కలిసి వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు. అనంతరం తరచూ రాంబాబు ఇంటికి రావడాన్ని గమనించిన చంద్రశేఖర్‌ ఆమెతో గొడవకు దిగాడు. దీంతో ప్రియుడి వద్దకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న ఆమె శ్రీకాకుళంలో ఉన్న తల్లి ఎస్‌.సత్యవతి సహకారం కోరింది. ఆమె రూ.20 వేలు ఇవ్వగా, ప్రియుడు మరో రూ.20 వేలు సమకూర్చాడు. ఈ సొమ్ము తీసుకొని తన భర్తను చంపాలని నెల్లిమర్ల మండలంలోని ఎర్రంశెట్టి సతీష్‌ను పురమాయించింది.
అనుమానం రాకుండా.. : ఈ నెల 24న రాత్రి మాట్లాడాలని ఉందని చంద్రశేఖర్‌ను రాంబాబు బయటకు తీసుకువెళ్లాడు. వీరు మాట్లాడుతుండగా చంద్రశేఖర్‌ తలపై వెనుక నుంచి వచ్చిన సతీష్‌ రాడ్డుతో కొట్టాడు. తీవ్రగాయమవడంతో ప్రాణాలు కోల్పోయాడు. అనుమానం రాకుండా అర్ధరాత్రి దాటిన తర్వాత మృతదేహాన్ని రైలు పట్టాలపై పడేశారు. అరుణ జ్యోతి మీద అనుమానం ఉందని కుటుంబ సభ్యులు చెప్పడంతో పోలీసులు దర్యాప్తు చేసి, నిందితులను పట్టుకున్నారు. ఆమెతో పాటు తల్లి సత్యవతి, రాంబాబు, సతీష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ మంగవేణి తెలిపారు. కేసును ఛేదించిన ఎస్‌ఐలు పి.నారాయణరావు, కిరణ్‌కుమార్‌ నాయుడు, నసీమా భేగమ్‌ తదితరులను ఆమె అభినందించారు.

 


చంద్రశేఖర్‌ (పాతచిత్రం) 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని