logo

Cyber Crime: జర అవసరం.. డబ్బు ఈ ఖాతాలో వేయండి

ఐఏఎస్‌.. ఐపీఎస్‌ అధికారుల పేర్లతో ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతాలు ప్రారంభించి నగదు బదిలీ చేయాలంటూ పోస్ట్‌ చేసి రూ.లక్షలు కాజేసే సైబర్‌ నేరస్థులు పంథా మార్చారు. ఐఏఎస్‌ల ఫొటోలతో వాట్సాప్‌ డీపీలను ఉంచి

Updated : 05 May 2022 08:31 IST

ఐఏఎస్‌.. ఐపీఎస్‌ల ఫొటోలతో సైబర్‌ నేరస్థుల మాయాజాలం

రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ నుంచి ఆపరేషన్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఐఏఎస్‌.. ఐపీఎస్‌ అధికారుల పేర్లతో ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతాలు ప్రారంభించి నగదు బదిలీ చేయాలంటూ పోస్ట్‌ చేసి రూ.లక్షలు కాజేసే సైబర్‌ నేరస్థులు పంథా మార్చారు. ఐఏఎస్‌ల ఫొటోలతో వాట్సాప్‌ డీపీలను ఉంచి ఉన్నతాధికారులు, తహసీల్దార్లకు నకిలీ మెయిల్స్‌ పంపించి.. తాము సూచించిన ఖాతాల్లోకి నగదు జమ చేయాలని సూచిస్తున్నారు. రాష్ట్ర పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌, గిరిజనశాఖ కార్యదర్శి క్రిస్టినా చొంగ్తు సహా నలుగురు ఐఏఎస్‌ల వాట్సాప్‌ డీపీలతో మోసాలకు పాల్పడ్డారు. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ కేంద్రంగా సైబర్‌ నేరస్థుల ముఠాలు ఈ పని చేస్తున్నాయని పోలీసులు గుర్తించారు.  

అధికారిక వెబ్‌సైట్ల ద్వారా సమాచారం  
ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల వివరాలు, వారి ఫొటోలను ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ల నుంచి సేకరిస్తున్నారు. అధికారుల మెయిళ్లలో స్వల్పంగా మార్పుచేసి మీ వాట్సాప్‌ నంబరు పంపించండంటూ మెయిల్‌ చేస్తున్నారు.  ః కిందిస్థాయి ఉద్యోగులు మెయిల్‌కు వాట్సాప్‌ నంబర్లు పంపించగానే.. ఐఏఎస్‌, ఐపీఎస్‌ పేరుతో ఒక వాట్సాప్‌ నంబరు తీసుకుంటున్నారు. ట్రూకాలర్‌లో అధికారి పేరు వచ్చేలా చూసుకుని ఆ వాట్సాప్‌ నంబరుకు  అధికారి ఫొటోను డీపీగా ఉంచుతున్నారు.  ః ఐఏఎస్‌ అధికారి వాట్సాప్‌ డీపీ ద్వారా తమకు అత్యవసరంగా నగదు అవసరమని, తన స్నేహితులు ఫలానా చోట ఉన్నారని, ఈ ఖాతా నంబరుకు నగదు బదిలీ చేయాలంటూ సందేశం పంపిస్తున్నారు.  సైబర్‌ నేరస్థులు ఐఏఎస్‌, ఐపీఎస్‌ల పేరుతో మెయిల్‌ పంపించినప్పటి నుంచి బాధితులు నగదు బదిలీ చేసేంత వరకూ సైబర్‌ నేరస్థులు ఫోన్‌లో లేదా వాట్సాప్‌ ద్వారా మాట్లాడరు.
* తమ ఉన్నతాధికారులే పంపించారన్న భావనతో జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయాల్లో పనిచేస్తున్న అధికారులు ఒక్కొక్కరూ రూ.50వేల చొప్పున బదిలీ చేశారు. హైదరాబాద్‌లో ఓ విశ్వవిద్యాలయం ఉపకులపతి పేరుతో ఆరుగురికి మెయిళ్లు పంపించగా... నలుగురు ఫోన్‌ చేయగా.. మోసమని తేలింది. ఇద్దరు మాత్రం చెరో రూ.50వేలు పంపించారు.


నిశితంగా పరిశీలించండి.. నిర్ధారించుకోండి  
-కేవీఎం ప్రసాద్‌, ఏసీపీ సైబర్‌క్రైమ్స్‌

ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఇతర ఉన్నతాధికారుల నుంచి డబ్బు పంపాలంటూ మెయిళ్లు వస్తే. వాటిని నిశితంగా పరిశీలించండి. ప్రతి మెయిల్‌ ఐడీ విభిన్నం, వినూత్నం అందుకే సైబర్‌ నేరస్థులు మెయిల్‌ పంపించేటప్పుడు అక్షరాలు, సంకేతాలు అటూ, ఇటూ మార్చుతారు. ఎక్కడి నుంచి మెయిల్‌ వచ్చిందని చూస్తే అప్పుడు తెలిసిపోతుంది. నగదు బదిలీ చేసేటప్పుడు ఐఏఎస్‌, ఐపీఎస్‌ల వ్యక్తిగత కార్యదర్శులతో నిర్ధారించుకోండి. ఈ తరహా మోసాలు బెంగళూరు, చెన్నై నగరాల్లోనూ జరుగుతున్నాయి.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని