logo

Andhra News: ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ చంపలేం!

రాజకీయ ఆధిపత్య పోరు ఒకరి హత్యకు దారి తీసింది. కళ్ల ముందే ఎదిగిపోతున్న వైకాపా గ్రామ అధ్యక్షుడి హవాను జీర్ణించుకోలేక అదే పార్టీకి చెందిన మరో వ్యక్తి హత్య చేసిన ఘటన ఇటీవల ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జి కొత్తపల్లిలో

Updated : 05 May 2022 08:16 IST

అనుచరులకు నూరిపోసిన బజారయ్య

నాగ ప్రసాద్‌ హత్యకు దారి తీసిన ఆధిపత్యపోరు

కీలక సూత్రధారి సహా ఆరుగురి అరెస్టు

నిందితుల అరెస్టు చూపుతున్న ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: రాజకీయ ఆధిపత్య పోరు ఒకరి హత్యకు దారి తీసింది. కళ్ల ముందే ఎదిగిపోతున్న వైకాపా గ్రామ అధ్యక్షుడి హవాను జీర్ణించుకోలేక అదే పార్టీకి చెందిన మరో వ్యక్తి హత్య చేసిన ఘటన ఇటీవల ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జి కొత్తపల్లిలో సంచలనం కలిగించింది. ఈ కేసులో మొత్తం 12 మంది నిందితులపై కేసు నమోదు కాగా ప్రస్తుతం ప్రధాన సూత్రధారి సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఏలూరులోని ఎస్పీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ వివరాలను వెల్లడించారు.

జి.కొత్తపల్లి వైకాపా గ్రామ అధ్యక్షుడు గంజి నాగప్రసాద్‌కు అదే గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యుడు బిరుదుగడ్డ బజారయ్యకు మధ్య విభేదాలున్నాయి. గ్రామంలో జరుగుతున్న చిన్నచిన్న గొడవలకు బజారయ్య పంచాయితీలుచేస్తున్నాడు. నాగప్రసాద్‌ కూడా పార్టీ నాయకుడు కావటంతో ఈ పంచాయితీలు వారి మధ్య ఆధిపత్యపోరుకు దారి తీశాయి. స్థానిక నాయకులు రాజీయత్నాలు కుదిర్చినా పరిస్థితి చక్కబడలేదు. ఈ నేపథ్యంలోనే నాగప్రసాద్‌ను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని బజారయ్య కుట్ర పన్నాడు. అతని వల్ల ఇబ్బంది పడిన కొంత మందిని దగ్గరకు చేర్చుకుని ఆదరించాడు. వారిని అనుచరులుగా చేసుకున్నాడు.

అంతా ఏకమై..

ఒక సంవత్సరం కిందట ఓ హోటల్‌ వ్యవహారంలో కూడా ఇద్దరి మధ్య గొడవలు నెలకొన్నాయి. దీంతో దాన్ని మూసివేశారు. ఆ హోటల్‌ నిర్వాహకుడు సేనం హేమంత్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తూ ఉద్యోగం పోగొట్టుకున్న ఉండ్రాజవరపు మోహన్‌ కుమార్‌ బజారయ్యకు దగ్గరయ్యారు. వీరితోపాటు రెడ్డి సత్యనారాయణ, మండవల్లి సురేష్‌, గంజి నాగార్జున తదితరులను తన వెంట తిప్పుకొంటూ వారిలో నాగప్రసాద్‌ పై విద్వేషాన్ని రగిల్చాడు. తరచూ వారికి మద్యం తాగించే వాడు. ఇటీవల జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో జరిగిన గొడవల నేపథ్యంలో గత నెల 20న తన వర్గాన్ని సమావేశపరిచి నాగప్రసాద్‌ను చంపాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. రోజురోజుకు ఎదిగిపోతున్న అతనిని ఇప్పుడుకాకపోతే ఇంకెప్పుడూ చంపలేమని తన అనుచరులకు నూరిపోశాడు. 10 రోజుల్లో దీన్ని అమలు చేయాలని అనుచరులకు సూచించాడు.

మొదటి ప్రయత్నం విఫలమైనా.. గత నెల 28న రెక్కీ నిర్వహించి, 29న హత్య చేసేందుకు రంగంలోకి దిగినా పరిస్థితులు అనుకూలించక ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అదే రోజు జంగారెడ్డిగూడెంలో రెడ్డిసత్యనారాయణ వివాహ వార్షికోత్సవంలో బజారయ్య అనుచరులందరినీ సమావేశపరిచాడు. కేకు కోసి అదే రోజు రాత్రి జంగారెడ్డిగూడెం లోని ఓ దాబాలో మద్యం తాగారు. 30న ఉదయం హత్య చేయాలని మరో సారి పథకం పన్నారు. దీనిలో భాగంగానే ఘటనా స్థలానికి వెళ్లేవారికి ధైర్యం కోసం మూడు మద్యం సీసాలు కొనుగోలు చేశారు.

అరెస్టయ్యింది వీరే.. ప్రధాన నిందితుడైన బిరుదుగడ్డ బజారయ్య, మండవల్లి సురేష్‌, ఉండ్రాజవరపు మోహన్‌కుమార్‌, సేనం హేమంత్‌, గంజి నాగార్జున (జి.కొత్తపల్లి), జంగారెడ్డి గూడెంలో ఉంటున్న రెడ్డి సత్యనారాయణలను అరెస్టు చేశారు. మరో ఆరుగురు నిందితులను అరెస్టు చేయాల్సి ఉంది. జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం గ్రామంలోని మద్ది ఆంజనేయస్వామి గుడి ఎర్రకాల్వ వంతెన వద్ద నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి కారు, ద్విచక్రవాహనం, మూడు కత్తులు, నేరం చేసిన సమయంలోని దుస్తులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ తెలిపారు.

అనుకున్న విధంగా పని పూర్తి.. గంజి నాగప్రసాద్‌ను గత నెల 30న హత్య చేసి తాము అనుకున్న పని పూర్తి చేశారు. నాగార్జున ఉదయమే వీళ్లందరినీ సమాయత్తం చేశాడు. బజారయ్య అద్దె కారులో నాగ ప్రసాద్‌ ఇంటి మీదుగా వెళ్లాడు. అదే సమయంలో పెట్రోలు బంకు, దాడి చేయాల్సిన స్థలాన్ని ఫొటోలు తీసి వాట్సప్‌లో నాగార్జునకు పంపించాడు. పెట్రోలు బంకు వద్ద నాగార్జున కాపలా కాశాడు. నాగప్రసాద్‌ ఉదయం 7:40కి పాలు తెచ్చుకునేందుకు తన ఇంటి నుంచి ద్విచక్రవాహనంపై బయలు దేరగా...ఈ సమాచారాన్ని మిగిలినవారికి అందించాడు. కత్తులతో సిద్ధంగా ఉన్న మోహన్‌ కుమార్‌, సురేష్‌, హేమంత్‌ కుమార్‌లు ద్విచక్రవాహనంపై నాగప్రసాద్‌కు ఎదురెళ్లి ఢీకొన్నారు. కిందపడిపోయిన అతనిపై కత్తులతో దాడి చేసి చంపారు. ఆ సమయంలో నాగార్జున కూడా అక్కడకు చేరుకుని వారికి సహకరించాడు. అనంతరం నిందితులందరూ పరారయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని