logo

Telangana News: కూతురిని ప్రేమిస్తున్న యువకుడి హత్యకు తండ్రి పన్నాగం..రూ.5 లక్షల సుపారీ

సుపారీ ఇచ్చి తన కూతురిని ప్రేమిస్తున్న యువకుడిని హత్య చేయించేందుకు తండ్రి కుట్ర పన్నిన విషయాన్ని పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. నిందితులను అరెస్టు చేశారు

Updated : 10 Aug 2022 10:41 IST

నిందితుల అరెస్టు

వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ రాహుల్‌హెగ్డే, అదనపు ఎస్పీ చంద్రయ్య, వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్‌

సిరిసిల్ల గ్రామీణం, న్యూస్‌టుడే: సుపారీ ఇచ్చి తన కూతురిని ప్రేమిస్తున్న యువకుడిని హత్య చేయించేందుకు తండ్రి కుట్ర పన్నిన విషయాన్ని పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. నిందితులను అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం ఎస్పీ రాహుల్‌హెగ్డే తన కార్యాలయంలో వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం... రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పరిధిలోని తిప్పాపూర్‌కు చెందిన నీలం శ్రీనివాస్‌ (45) తన కూతురు శిరీష (23)ను వేములవాడ పట్టణంలోని సుభాష్‌నగర్‌కు చెందిన చింతలతండం మనోజ్‌కుమార్‌(25) గత కొంత కాలంగా ప్రేమిస్తున్నాడు. శిరీషకు ఏడాది కిందట మరొకరితో వివాహం చేసినా అతనితో ప్రేమవ్యవహారం కొనసాగిస్తుంది. కొన్ని నెలల క్రితం ఆమె ఇంటి నుంచి పారిపోయి మనోజ్‌కుమార్‌తో కలిసి ముంబయికి వెళ్లిపోయింది. అక్కడ వారం రోజులు ఉండి మళ్లీ వేములవాడకు వచ్చింది. అయితే భర్త ఆమెను భార్యగా జీవితంలోని అంగీకరించకపోవడంతో అప్పటి నుంచి తల్లిదండ్రుల వద్దనే ఉంటుంది. ఈక్రమంలోనే పలు పంచాయితీలు నిర్వహించారు. అయినప్పటికీ మనోజ్‌కుమార్‌ను విడిచిపెట్టలేదు. దీంతో ఆమె తండ్రి నీలం శ్రీనివాస్‌, తన స్నేహితుడైన మానుక కుంటయ్యలు కలిసి మనోజ్‌కుమార్‌ను చంపేందుకు నిర్ణయించుకున్నారు. వారం రోజుల క్రితం వేములవాడలో శ్రీనివాస్‌, కుంటయ్యతో సమావేశమై పెద్ద కత్తులతో దాడులు చేసి చంపేందుకు పథకం వేశారు. వీరు బిహార్‌కు చెందిన లఖింద్ర సాహ్ని, కోరుట్ల పట్టణానికి చెందిన బొమ్మిడి రాజుకుమార్‌తో కలిసి రూ.5 లక్షలకు హత్య చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలోనే గురువారం ఉదయం మనోజ్‌కుమార్‌ కదలికలను గమనిస్తూ హత్య చేసేందుకు తిప్పాపూర్‌ బస్టాండ్‌లో కలుసుకున్నారు. ఈ క్రమంలోనే పెట్రోలింగ్‌ చేస్తున్న పోలీస్‌లను చూసి నిందితులు కారు స్టార్ట్‌ చేసి పారిపోవడానికి ప్రయత్నించారు. వారిని పట్టుకొని తనిఖీ చేయగా కారులో రెండు పెద్ద కత్తులు, మారణాయుధాలు లభించాయి. దీంతో నలుగురిని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు. వీరి వద్ద నుంచి రెండు పెద్ద కత్తులు, నాలుగు సెల్‌ఫోన్లు, కారు, బైక్‌, బాధితుని ఫొటో, రూ.5 వేల నగదును స్వాధీనం చేసుకుని, నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్‌, సీఐ వెంకటేష్‌ పాల్గొన్నారు.


పోలీసులు స్వాధీన పరచుకున్న కత్తులు, సెల్‌ఫోన్లు, నగదు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని