logo

Telangana News: అమెరికాలో నల్గొండ జిల్లావాసి దుర్మరణం

అమెరికాలో ఈ నెల 7న జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్గొండ జిల్లాకు చెందిన యువకుడు దుర్మరణం చెందాడు. బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో బి.అన్నారం గ్రామానికి చెందిన సారెడ్డి క్రాంతి కిరణ్‌ రెడ్డి(25)..

Published : 11 May 2022 09:14 IST

సారెడ్డి క్రాంతి కిరణ్‌ రెడ్డి

మిర్యాలగూడ గ్రామీణం, న్యూస్‌టుడే: అమెరికాలో ఈ నెల 7న జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్గొండ జిల్లాకు చెందిన యువకుడు దుర్మరణం చెందాడు. బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో బి.అన్నారం గ్రామానికి చెందిన సారెడ్డి క్రాంతి కిరణ్‌ రెడ్డి(25).. అమెరికాలోని ‘యూనివర్సిటీ ఆఫ్‌ సెంట్రల్‌ మిస్సౌరి’లో ఎం.ఎస్‌.చదువుతున్నాడు. ఈ నెల 7వ తేదీ సాయంత్రం 7 గంటల సమయంలో తన రూమ్‌మేట్స్‌ ముగ్గురితో కలిసి మరో స్నేహితుడిని కలిసి తిరిగి వస్తుండగా.. వీరు ప్రయాణిస్తున్న కారును ట్రక్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముందుసీటులో కూర్చున్న క్రాంతి కిరణ్‌రెడ్డి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మిగిలిన వారు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు మంగళవారం ఉదయం మృతుడి తండ్రి శ్రీనివాస్‌రెడ్డికి అమెరికా నుంచి సమాచారం అందినట్లు బంధువులు వెల్లడించారు.

తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు.. సారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు క్రాంతి కిరణ్‌ రెడ్డి ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. హైదరాబాద్‌లోని టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తుండగా ఎం.ఎస్‌.చదివేందుకు అవకాశం రావడంతో గతేడాది జూన్‌ 23న అమెరికాకు వెళ్లారు. పెద్ద కుమారుడు చంద్రకాంత్‌రెడ్డి సైతం ఎం.ఎస్‌.చదివేందుకు గతేడాది డిసెంబర్‌లో అమెరికా వెళ్లాడు. అన్నదమ్ములు ఇద్దరు చదువు దృష్ట్యా వేర్వేరు ప్రదేశాల్లో ఉంటున్నారు. ఈ ఏడాది ఆగస్టులో కిరణ్‌ రెడ్డి కోర్సు పూర్తి కానుండగా అంతలోనే ఈ ఘోరం జరిగింది. మృతదేహాన్ని స్వదేశానికి పంపేందుకు అక్కడి తెలుగువారు డబ్బు సమకూర్చడం కోసం వాట్సాప్‌ స్టేటస్‌లో సమాచారం ఉంచారు. చేతికందొచ్చిన కొడుకు అర్ధాంతరంగా దూరమయ్యాడని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ప్రభుత్వం చొరవ చూపి తమ కుమారుడి మృతదేహాన్ని త్వరితగతిన స్వగ్రామానికి తీసుకురావాలని వేడుకుంటున్నారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు సూర్యాపేటకు వెళ్లి మంత్రి జగదీశ్‌రెడ్డితో మాట్లాడారు. విషయాన్ని వారు మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని