logo

Suicide: కుమారుడి పెళ్లి కాలేదని..చావే పరిష్కారమని..

ఎటువంటి ఇబ్బందుల్లేని కుటుంబం. కొడుక్కి పెళ్లికావట్లేదనే బెంగతో కన్నతల్లి.. సోదరుడు ఒంటరిగా మిగిలిపోతాడనేది ఆ చెల్లెలు గుబులు. మానసిక

Updated : 13 May 2022 07:32 IST

 మనవడి గొంతు నులిమి ఉరేసుకొన్న అమ్మమ్మ

కూతురి ఆత్మహత్యాయత్నం విఫలం

ఈనాడు, హైదరాబాద్‌ నిజాంపేట, న్యూస్‌టుడే: ఎటువంటి ఇబ్బందుల్లేని కుటుంబం. కొడుక్కి పెళ్లికావట్లేదనే బెంగతో కన్నతల్లి.. సోదరుడు ఒంటరిగా మిగిలిపోతాడనేది ఆ చెల్లెలు గుబులు. మానసిక సంఘర్షణకు గురయ్యారు. చావే పరిష్కారమనుకున్నారు. తాము దూరమైతే పసివాడు అనాథగా మారతాడని భావించారు. ముందుగా బాలుడిని గొంతు నులిమి చంపారు. అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో అమ్మమ్మ, మనవడు మరణించగా బాలుడి తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాచుపల్లి ఠాణా పరిధిలో చోటుచేసుకున్న దారుణం గురువారం వెలుగుచూసింది. హన్మకొండ జిల్లా శాయంపేట మండలం నేరేడ్‌పల్లి గ్రామానికి చెందిన ముక్కా కృష్ణమూర్తి, లలిత (56) దంపతులకు కుమారుడు శ్రీకర్‌, ఇద్దరు కుమార్తెలు.. అర్చన, దివ్య (32) సంతానం. 12 ఏళ్ల క్రితమే కృష్ణమూర్తి, లలిత విడిపోగా.. పిల్లలతో నగరానికి వచ్చింది. ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు చేసింది. ఏడాది నుంచి నిజాంపేట వినాయక్‌నగర్‌లోని గ్రేటర్‌ ఇన్‌ఫ్రాస్‌ జువెల్‌ గ్రాండ్‌ అపార్ట్‌మెంట్‌ తల్లి, కుమారుడు ఉంటున్నారు. కుమారుడికి 35 ఏళ్లు దాటినా పెళ్లి కావట్లేదని దివ్యతో చెప్పి తల్లి కన్నీరు పెట్టుకునేది. దివ్యకు కుమారుడు శివకార్తికేయ (ఏడాదిన్నర) ఉన్నాడు. బుధవారం అర్ధరాత్రి దాటే వరకు తల్లీకూతుళ్లు ఇదే విషయమై మాట్లాడుకున్నారు. తల్లి, కూతురు, మనవడు ఒకగదిలో పడుకున్నారు. మరో గదిలో శ్రీకర్‌ నిద్రపోయాడు. గురువారం ఉదయం దివ్య.. అన్న శ్రీకర్‌ గది తలుపుకొట్టి పడిపోయింది. బయటకొచ్చి చూసిన శ్రీకర్‌.. తల్లి, మేనల్లుడు అచేతనంగా పడి ఉండటంతో కుప్పకూలిపోయాడు. తేరుకొని ఇరుకు పొరుగు సాయంతో దివ్యను సమీపంలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించాడు. బాచుపల్లి పోలీసులు ఆమె నుంచి వాంగ్మూలం తీసుకున్నారు.

అసలేం జరిగిందంటే..

విడిపోయిన తల్లిదండ్రులను మళ్లీ కలపాలనే కన్నవారి సమక్షంలోనే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన శ్రీకర్‌కు ఉండేది. దీన్ని తల్లి, సోదరి వ్యతిరేకించేవారని సమాచారం. ఈనేపథ్యంలో కుమారుడి పెళ్లి ప్రయత్నాలు విఫలమవటం, కుటుంబంలో తలెత్తిన గొడవలు ఆ అమ్మ మనసును ఉక్కిరిబిక్కిరి చేశాయి. దివ్య కూడా ఆందోళనకు గురైంది. దీంతో తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. తాము దూరమైతే తన కుమారుడు తల్లి లేని వాడు అవుతాడని దివ్య భావించింది. బుధవారం అర్ధరాత్రి దాటాక లలిత మనవడి గొంతు నులిమి చంపింది. తరువాత పక్కనే పడుకొని చీర కొంగుతో గొంతు బిగించుకొని ప్రాణాలు తీసుకొంది. దివ్య చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకోగా అది తెగి పడటంతో ఆమె కిందపడి అపస్మారకస్థితికి చేరుకుంది. స్పృహలోకి వచ్చాక అన్నను నిద్రలేపింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని