logo

Crime News: ప్రియురాలిపై మోజుతో తల్లిని హతమార్చిన దత్తపుత్రుడు..

ప్రియురాలిపై మోజుతో తల్లిని దత్తపుత్రుడు దారుణంగా హత మార్చాడు. అతడి మానసిక స్థితి సరిగా లేదని గమనించిన కారుడ్రైవర్‌ దత్తపుత్రుడిని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి స్నేహితుడితో

Updated : 14 May 2022 07:35 IST

ఆపై దత్తపుత్రుడిని నమ్మించి హతమార్చిన కారు డ్రైవర్‌
మహిళను చంపిన కేసులో ఐదుగురి అరెస్ట్‌

ఈనాడు, హైదరాబాద్‌-సరూర్‌నగర్‌ క్రైం, న్యూస్‌టుడే: ప్రియురాలిపై మోజుతో తల్లిని దత్తపుత్రుడు దారుణంగా హత మార్చాడు. అతడి మానసిక స్థితి సరిగా లేదని గమనించిన కారుడ్రైవర్‌ దత్తపుత్రుడిని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి స్నేహితుడితో మట్టుబెట్టించాడు. సంచలనం రేకెత్తించిన భూదేవి(50) అనే మహిళ హత్య కేసులో ఐదుగురు నిందితులు రంగారెడ్డి జిల్లాకు చెందిన కరినాగుల నర్సింహ(24), వి.శివ(23), మహబూబ్‌నగర్‌ జిల్లా వాసి ఏ.హర్ష అలియాస్‌ చింటూ(22), నల్గొండ, వనపర్తి జిల్లాలకు చెందిన బి.సాయిగౌడ్‌(22), ఏ.ఆంజనేయులు(21)లను శుక్రవారం సరూర్‌నగర్‌ పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. పెద్దఎత్తున డబ్బు చేతికి వస్తుందనే ఉద్దేశంతో పక్కా పథకం ప్రకారం రెండు హత్యలు చేసినట్లు సరూర్‌నగర్‌ డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ రవిబాబు తెలిపారు. నిందితుల నుంచి 25 తులాల బంగారు ఆభరణాలు, రూ.2.37లక్షలు  స్వాధీనం చేసుకున్నారు. మహిళ హత్య కేసులో ఏ3 నిందితుడిగా ఉన్న సాయితేజ (26) హత్యతో కేసు మిస్టరీ వీడింది.

ప్రియురాలు దూరమవుతుందని.. న్యూ గడ్డిఅన్నారం కాలనీలో జంగయ్య యాదవ్‌, భూదేవి దంపతులు 1995లో మూడు రోజుల పసికందును దత్తత తీసుకుని సాయితేజ అని పేరు పెట్టారు. పసితనం నుంచే అతడి మానసిక పరిస్థితి సరిగా లేకపోవటంతో వైద్యులకు చూపించి మందులు వాడారు. అదే ప్రాంతంలో ఉండే ఓ యువతి (23)తో సాయితేజ ప్రేమలో పడ్డాడు. ఆమెకోసం ఖరీదైన బహుమతులు కొనిచ్చాడు. ఇంట్లో నగలు, నగదు మాయమవుతుండటంతో కొడుకు నిర్వాకం తల్లిదండ్రులకు తెలిసింది. కొడుకును మందలించడంతోపాటు ఆ అమ్మాయిను హెచ్చరించి ఇల్లు ఖాళీ చేయించినట్లు సమాచారం. ఈ విషయాన్ని సాయితేజ తమ వద్ద కారుడ్రైవర్‌గా పనిచేసి మానేసిన కరినాగుల నర్సింహ అలియాస్‌ నానితో పంచుకున్నాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పథకం వేసిన నరిం్సహ ఇంట్లో నగలు కాజేసి ప్రియురాలిని పెళ్లిచేసుకొని దూరంగా వెళ్లిపోవచ్చంటూ సలహా ఇచ్చాడు.

సీసీ కెమెరాలకు దొరక్కుండా వ్యూహం.. ఈ నెల 2న సాయితేజ ఇంట్లో డబ్బు ఉందనే విషయం తెలియగానే నర్సింహ తన స్నేహితులు వట్టికోటి శివ, అడ్డాకుల హర్ష, బోయినపల్లి సాయిగౌడ్‌, అర్కటం ఆంజనేయులుకు సమాచారమిచ్చాడు. డబ్బు కొట్టేసి వాటాలు పంచుకుందామని అశచూపాడు. ఈ నెల 6న అర్ధరాత్రి(7వతేదీ) దాటాక అందరూ న్యూ గడ్డి అన్నారం చేరుకున్నారు. నర్సింహ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల వైర్లను కత్తిరించాడు. ఇంట్లోకి ప్రవేశించి బీరువా పక్కనే నిద్రపోతున్న భూదేవి ముఖంపై దిండు ఉంచి సాయితేజ, శివ ఊపిరాడకుండా చేశారు. సాయిగౌడ్‌, హర్ష కాళ్లను పట్టుకున్నారు. భూదేవి మరణించినట్టు నిర్ధారించుకున్నాక సొత్తును వాటాలేసుకొని పంచుకున్నారు.

ఎదురు చూస్తోందంటూ నమ్మించి.. హత్య విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు సాయితేజను అడ్డుతొలగించుకోవాలని మిగిలిన నిందితులు భావించారు. దీనిలో భాగంగానే అతడి ప్రేయసి శ్రీశైలంలో ఎదురుచూస్తుందంటూ అతడ్ని నమ్మించిన శివ 7వ తేదీ మధ్యాహ్నం శ్రీశైలం తీసుకెళ్లి సత్రంలో బసచేశారు. మరుసటిరోజు శిరోముండనం చేయించి ఆలయంలో పూజలు చేయించారు. 9న రాత్రి వట్టెవారిపల్లెలో ఉన్నారు. ఏ2 నిందితుడు శివ 10వ తేదీ ఉదయం మల్లెతీర్థం ప్రాంతానికి సాయితేజను తీసుకెళ్లాడు. ఇద్దరూ కలసి మద్యం తాగారు. అనంతరం సాయితేజ తలపై శివ బండరాయితో దాడిచేసి చంపి లుంగీకి రాయి చుట్టి మృతదేహాన్ని నీటిలోకి నెట్టేశాడు. భూదేవి హత్య కేసును ఛేదించేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్న విషయం తెలిసిన శివ ఆందోళనకు గురయ్యాడు. సరూర్‌నగర్‌ ఠాణాలో లొంగిపోయాడు. అతడు ఇచ్చిన సమాచారంతో నిందితులను అరెస్ట్‌ చేశారు. ఎల్బీనగర్‌ ఏసీపీ పి.శ్రీధర్‌రెడ్డి,  సరూర్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సీతారాం, డీఐ రవిబాబు బృందాన్ని సీపీ, డీసీపీలు అభినందించారు.


నా కుమారుడు అమాయకుడు..

హత్యకు గురైన సాయితేజ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. మృతదేహం నగరానికి తీసుకొచ్చేందుకు అనుకూలంగా లేకపోవటంతో అచ్చంపేటలోనే స్థానిక మున్సిపల్‌ సిబ్బంది సహకారంతో అంత్యక్రియలు జరిపారు. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ హంతకుడు అని తెలిసినా తండ్రి జంగయ్యయాదవ్‌ మాత్రం తన కుమారుడు అమాయకుడు అంటున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని