logo

Andhra News: ఇంతలోనే ఏమైంది..?

ఎన్నో కలలు.. మరెన్నో ఆకాంక్షలు.. ఆ ఆశల సౌధం .. ఒక్క తూటాతో తునాతునకలయ్యాయి. ఊహించని ఈ ఘటన.. పచ్చని కుటుంబాన్ని ఒక్క ఉదుటున విషాదంలోకి నెట్టేసింది.. తాళికట్టి ఏడడుగులు నడిచి కలకాలం తోడుంటానని బాసలు చేసిన భర్త.. నిద్ర మబ్బు వీడగానే విగతజీవుడై పడి ఉండడం.. అమ్మా, నాన్నే సర్వస్వం అనుకుని బతుకుతున్న చిన్నారులను ఒంటరి చేసి లోకాన్నే విడిచి వెళ్లడంతో ఆ ఇంట కన్నీటి సుడులు తిరుగుతున్నాయి.

Updated : 14 May 2022 10:02 IST

ఎస్సై గోపాలకృష్ణ ఇంట కన్నీటి సుడులు
ఈనాడు డిజిటల్‌, రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే- కాకినాడ,పెనుగంచిప్రోలు

ఎన్నో కలలు.. మరెన్నో ఆకాంక్షలు.. ఆ ఆశల సౌధం .. ఒక్క తూటాతో తునాతునకలయ్యాయి. ఊహించని ఈ ఘటన.. పచ్చని కుటుంబాన్ని ఒక్క ఉదుటున విషాదంలోకి నెట్టేసింది.. తాళికట్టి ఏడడుగులు నడిచి కలకాలం తోడుంటానని బాసలు చేసిన భర్త.. నిద్ర మబ్బు వీడగానే విగతజీవుడై పడి ఉండడం.. అమ్మా, నాన్నే సర్వస్వం అనుకుని బతుకుతున్న చిన్నారులను ఒంటరి చేసి లోకాన్నే విడిచి వెళ్లడంతో ఆ ఇంట కన్నీటి సుడులు తిరుగుతున్నాయి. ఆ కుటుంబాన్నే కాదు.. సహచర పోలీసులనూ ఎస్సై గోపాలకృష్ణ హఠాన్మరణం విషాదంలోకి నెట్టేసింది.

ఈ వేదన తీరనిది..

ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటకు చెందిన ముత్తవరపు గోపాలకృష్ణ (36) కాకినాడ గ్రామీణ పరిధి సర్పవరం పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్నారు. ఆయన  శుక్రవారం ఉదయం సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. కాకినాడలోని నాగమల్లితోట కూడలిలో అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న నివాసం తూటా పేలుడుతో ఉలిక్కిపడింది. పెద్ద దిక్కు దూరమై అభం శుభం తెలియని పసిబిడ్డలు తండ్రి ప్రేమ అనంతవాయువుల్లో కలిసిపోయిందన్న విషయం తెలుసుకోలేకపోతున్నారు. తల్లి శోకంలో మునిగిపోతే.. అమాయకంగా బిత్తర చూపులు చూస్తున్నారు. కొడుకుని కోల్పోయిన ఆ తండ్రి దుఃఖంలో మునిగిపోతే.. గోపాలకృష్ణ మృతదేహం చూసి అతని ఏడాదిన్నర కొడుకు శర్వన్‌ తండ్రి చనిపోయాడని తెలియక నిశ్శబ్దంగా ఉన్న దృశ్యాలు బంధువుల గుండెలను పిండేశాయి.. అక్కడ ఉన్నవారంతా ఉద్వేగానికి లోనయ్యారు. గోపాలకృష్ణ తన నివాసంలో సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని చనిపోవడం పోలీస్‌ శాఖలోనే కాక సాధారణ ప్రజల్లోనూ చర్చనీయాంశం అయింది.

విలపిస్తున్న తండ్రి శ్రీనివాసరావు

ఎందుకీ ఆంక్షలు..?

ఎస్సై ఆత్మహత్య ఘటన విషయం వెలుగుచూసినప్పట్నుంచి ఆత్మహత్య కారణాలపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎస్సై మరణం విషయంలో ముందెన్నడూ లేని ఆంక్షలు పోలీసులు విధించడం చర్చనీయాంశం అయ్యింది. నివాసంలో సంఘటన జరిగిన ప్రాంతంతోపాటు.. ఆసుపత్రిలో మృతదేహం దృశ్యాల చిత్రీకరణకు అనుమతించలేదు. గోపాలకృష్ణ చనిపోయిన తర్వాత పంచనామా కోసం శుక్రవారం ఉదయం 7 గంటలకు మృతదేహాన్ని కాకినాడ జీజీహెచ్‌లోని మార్చురీకి తరలించారు. 7.30 గంటలకు డీఐజీ పాలరాజు, కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు జీజీహెచ్‌ వద్దకు చేరుకుని మృతదేహాన్ని సందర్శించి వెళ్లిపోయారు. అనంతరం విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు అక్కడకు చేరుకున్నారు. మార్చురీ రెండు గేట్ల వద్ద సీఐ, ఎస్సై స్థాయి అధికారులతోపాటు పదుల సంఖ్యలో స్పెషల్‌ పార్టీ పోలీసులతో పహారా ఏర్పాటు చేశారు. మీడియాను లోపలకు పంపలేదు. గేటు దగ్గరే నిలువరించారు. కనీసం మృతదేహాన్ని ఫొటో తీసుకునేందుకు కూడా అనుమతించలేదు. ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జీజీహెచ్‌ మార్చురీ పోలీసుల ఆధీనంలో ఉంది. మృతుడి భార్య, తండ్రి, ఇతర బంధువుల సమక్షంలో శవపంచనామా పూర్తి చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఎస్పీ మార్చురీ వద్దకు చేరుకుని పోస్టుమార్టం అయ్యే వరకు అక్కడే ఉన్నారు. ఇదిలా ఉండగా.. సూసైడ్‌ నోట్‌తోపాటు, సంఘటన దృశ్యాల చిత్రాలనూ పోలీసులు బహిర్గతం చేయకపోవడం  గమనార్హం. శుక్రవారం ఉదయం మృతుని బంధువులు రివాల్వర్‌ మిస్‌ఫైర్‌ అయిందని చెబితే.. కొంత సమయం తర్వాత పోలీసులు ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రకటించారు.


మార్చురీ వద్ద మృతుని భార్య పావని, కుటుంబ సభ్యులు


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని