logo

Hyderabad News: గ్రేటర్‌ పరిధిలో మరోసారి.. వడ్డీ మాఫీ!

గ్రేటర్‌ పరిధిలో ఆస్తి పన్ను మొండి బకాయిల వసూలుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. రెండు నుంచి మూడు నెలల గడువిచ్ఛి. ఓటీఎస్‌(వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ స్కీమ్‌) పథకం కింద బకాయిలు వసూలు చేసేందుకు సర్కారు సిద్ధమైంది.

Published : 15 May 2022 08:52 IST

ఆస్తిపన్ను మొండి బకాయిలపై సర్కారు దృష్టి

 

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌ పరిధిలో ఆస్తి పన్ను మొండి బకాయిల వసూలుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. రెండు నుంచి మూడు నెలల గడువిచ్ఛి. ఓటీఎస్‌(వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ స్కీమ్‌) పథకం కింద బకాయిలు వసూలు చేసేందుకు సర్కారు సిద్ధమైంది. వారం రోజుల్లోపు పథకాన్ని రాష్ట్ర పురపాలకశాఖ ప్రకటించనుంది. అందులో భాగంగా ఇప్పటికే జీహెచ్‌ఎంసీ నుంచి పురపాలకశాఖ అధికారులు అన్ని వివరాలు తీసుకున్నారు. ఓటీఎస్‌ పథకాన్ని ప్రవేశపెట్టడమే తరువాయి అని జోనల్‌ కమిషనర్లు, ఉప కమిషనర్లు స్పష్టం చేస్తున్నారు.

రూ.వెయ్యి కోట్లు లక్ష్యం

జీహెచ్‌ఎంసీ పరిధిలో 17.5 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఉన్నారు. అందులో 2 నుంచి 3లక్షల మంది కొన్నేళ్లుగా పన్ను కట్టట్లేదు. వారి నుంచి వసూలు కావాల్సిన మొత్తం బకాయి వడ్డీతో కలిపితే రూ.1,500కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. వడ్డీని గతంలో మాదిరి 90శాతం మాఫీ చేస్తే.. డిమాండు రూ.1000కోట్లకు తగ్గనుంది. ఆ మొత్తాన్ని వసూలు చేస్తే ఆర్థిక భరోసా దక్కతుందని అధికారులు చెబుతున్నారు. అయితే మూతపడ్డ పరిశ్రమలు, కోర్టు వివాదాల్లోని ఆస్తులు, రోడ్డు విస్తరణలో కూల్చిన భవనాలు, ఇతరత్రా నిర్మాణాలు వాస్తవంగా కనిపించవు. కానీ రికార్డుల్లో వాటి పేర్లు అలాగే కొనసాగుతున్నాయి. ఆయా ఆస్తులకు సంబంధించిన ఖాతా సంఖ్యను రికార్డుల్లోంచి తొలగించక పోవడంతో మొండి బకాయిలుగా మారుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒకే భవనానికి రెండు ఖాతా సంఖ్యలు ఉండటం, చనిపోయిన వ్యక్తుల పేరుతో ఉన్న ఖాతా సంఖ్యను అలాగే కొనసాగిస్తుండటం వంటి సమస్యలు సైతం మొండి బకాయిలు పెరిగేందుకు కారణమవుతున్నాయి. వాటన్నింటినీ లెక్క తేల్చి రికార్డుల్లోంచి ఖాతా సంఖ్యలను తొలగించాల్సిన అవసరముందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. దాని వల్ల పన్ను చెల్లింపుదారుల జాబితా పక్కాగా తయారవుతుందని, ఎంత పన్ను రావాలి, ఎంత బకాయి ఉందనే గణాంకాలు స్పష్టంగా ఉంటాయని పేర్కొంటున్నారు. ఆగస్టు 1, 2020న ప్రభుత్వం ఓటీఎస్‌ పథకాన్ని ప్రవేశపెట్టగా రూ.550కోట్ల మేర పన్ను వసూలైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23లో మొత్తం రూ.2వేల కోట్ల ఆస్తిపన్ను వసూలు చేయాలని జీహెచ్‌ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.1635 కోట్లు వసూలైంది. ఊహించని విధంగా పన్ను వసూలవడంతో.. ఈ ఏడాది లక్ష్యాన్ని అధికారులు రూ.2వేల కోట్లుగా నిర్ధారించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని