logo

Andhra News: తెదేపా జడ్పీటీసీకి తుపాకీతో బెదిరింపు!

హిరమండలం మండలంలో తుపాకీ సంస్కృతి కలకలం రేపుతోంది. మండల స్థాయి ప్రజాప్రతినిధిపైనే ఇద్దరు వ్యక్తులు తుపాకీతో బెదిరింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు, ఎస్సై ఎం.మధుసూదనరావు తెలిపిన వివరాల ప్రకారం.. హిరమండలం

Updated : 17 May 2022 10:03 IST

హోటల్‌ కౌంటర్‌లో బుచ్చిబాబుతో మాట్లాడుతున్న అనుమానాస్పద వ్యక్తి

హిరమండలం, న్యూస్‌టుడే: హిరమండలం మండలంలో తుపాకీ సంస్కృతి కలకలం రేపుతోంది. మండల స్థాయి ప్రజాప్రతినిధిపైనే ఇద్దరు వ్యక్తులు తుపాకీతో బెదిరింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు, ఎస్సై ఎం.మధుసూదనరావు తెలిపిన వివరాల ప్రకారం.. హిరమండలం జడ్పీటీసీ (తెదేపా) సభ్యుడు పొగిరి బుచ్చిబాబు గొట్టాబ్యారేజీ సెంటరులో అమృత హోటల్‌ను నడుపుతున్నారు. రాత్రి 9 గంటల సమయంలో వ్యాపార పనుల్లో ఉండగా కూర కొనేందుకని ఓ వ్యక్తి వచ్చి అనుమానాస్పదంగా మాట్లాడి వెళ్లాడు. తర్వాత బుచ్చిబాబు 10 గంటల సమయంలో పనులు ముగించుకొని ఒంటరిగా ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్లారు. అప్పటికే ఆయన ఇంటి వద్దకు కారులో ముగ్గురు వచ్చి ఉన్నారు. బుచ్చిబాబు వచ్చిన వెంటనే ఇద్దరు వ్యక్తులు కారు దిగి తాము పోలీసులమని, మాట్లాడాల్సి ఉందని, రావాలని డిమాండ్‌ చేశారు. ఇక్కడే కూర్చొని మాట్లాడుకుందామని, కారులోకి రానని ఆయన స్పష్టం చేశారు. రాకుంటే ఎన్‌కౌంటర్‌ చేస్తామంటూ తుపాకీతో బెదిరించి వాహనంలోకి నెట్టేందుకు ప్రయత్నించారు. దీంతో ఆయన తప్పించుకొని ఇంటి ముందు ఉన్న కర్ర తీసి రక్షించుకునే ప్రయత్నం చేశారు. కారులో ఉన్న డ్రైవరు సూచనలతో ఇద్దరూ అక్కడి నుంచి శ్రీకాకుళం వైపు రహదారి మీదుగా పరారయ్యారు. జడ్పీటీసీ సభ్యుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై మధుసూదనరావు తెలిపారు.

కారణాలేమిటో..: వెనుకబడిన సిక్కోలు, అందులోనూ ఓ మారుమూల మండలంలో గన్‌ కల్చర్‌ స్థానికంగా కలకలం రేపింది. దుండగులు తుపాకీతో బెదిరింపులకు పాల్పడటంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనకు కారణం రాజకీయ కోణమా లేక ఆర్థిక పరమైన లావాదేవీలా అనేది తేలాల్సి ఉంది. జిల్లాలో తెదేపా నుంచి ఎన్నికైన ఏకైక జడ్పీటీసీ సభ్యుడు బుచ్చిబాబు. ఇటీవల పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మరోపక్క స్థానికంగానూ హోటల్‌ నడుపుతూ వ్యాపారం చేస్తున్నారు. వచ్చినవారు పోలీసులమని చెప్పడం గమనార్హం. వారం రోజుల కిందటే ఇంటికి వెళ్తుండగా రెక్కీ నిర్వహించారని, అప్పట్లో మద్యం దుకాణానికి దారెటని అడిగారని, ఇప్పుడు తన నివాసం వద్దే ఎవరూ లేని సమయంలో బెదిరించారని బుచ్చిబాబు పేర్కొన్నారు.

పొగిరి బుచ్చిబాబు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని