logo

BP: రక్తం పోటెత్తుతోంది..!

ఈ మధ్య కాలంలో ఎవరిని కదిలించినా నాకు బీపీ వచ్చిందండి అంటున్నారు. నూటికి 95 శాతం మందిలో రక్తపోటు పెరగడానికి కారణాలు తెలియదు.  అది నిశ్శబ్దంగా  శరీరాన్ని ఆవహిస్తోంది.  అశ్రద్ధ చేస్తే మొదటికే ప్రమాదం. 

Updated : 19 May 2022 12:15 IST

ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే: ఈ మధ్య కాలంలో ఎవరిని కదిలించినా నాకు బీపీ వచ్చిందండి అంటున్నారు. నూటికి 95 శాతం మందిలో రక్తపోటు పెరగడానికి కారణాలు తెలియదు.  అది నిశ్శబ్దంగా  శరీరాన్ని ఆవహిస్తోంది.  అశ్రద్ధ చేస్తే మొదటికే ప్రమాదం. 

ఇవి తెలుసుకుంటే మేలు.. 

* రక్తపోటు అంటే.. గుండె రక్తనాళాలలో ఉండే రక్తం వాటి గోడలపై చూపించే ఒత్తిడిని రక్తపోటు (బ్లడ్‌ ప్రజర్‌) అంటారు.

* స్పిగ్మోమనోమీటరు సాధనంతో దీన్ని కొలుస్తారు.

* అరోగ్యవంతమైన నడివయస్సువారికి 120/80 సాధారణ బీపీ ఉండాలి. 130/90 ఉంటే హై బీపీగా, 90/60 ఉంటే లో బీపీగా గుర్తిస్తారు.  

* ఆహారపు అలవాట్లలో మార్పు, జీవన శైలి, ఒత్తిడి, మానసిక ఆందోళన, ఊబకాయం, కిడ్నీ సమస్య, హార్మోన్లలో మార్పులు, ఉప్పు ఎక్కువగా తినడం, వంశపారపర్య లక్షణాలతో హైబీపీ వస్తుందని వైద్యులు చెబుతున్నారు.

* అధిక రక్తపోటు సమస్య మూత్రపిండాల వ్యాధి, గుండెపోటు లాంటి ఆటుపోట్లకు దారితీస్తుంది.

* తరచూ తలనొప్పి రావడం, నడినెత్తిలో బరువు, భారంగా ఉండటం, తలతిరగడం, ఛాతిబరువు, నొప్పిగా ఉండటం, చూపు మందగించడం, వికారం, వాంతి అనిపించడం, మాట తడబడటం, చెమట పట్టడం లక్షణాలు రక్తపోటు రావడానికి ముందు కనిపిస్తాయి. 

ఉమ్మడి జిల్లాలో 2 లక్షలకుపైగా బాధితులు: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో 2018లో పైలెటు ప్రాజెక్టు కింద జనగామ జిల్లాలో అసంక్రమిత వ్యాధుల గుర్తింపు కార్యక్రమం (ఎన్‌సీడీ) చేపట్టింది. అక్కడ విజయవంతం కావడంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ అమలు చేసింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల పరిధిలోని గ్రామ, పట్టణ ప్రాంతంలో ప్రతి ఇంటికి వైద్య బృందం వెళ్లి ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేశారు. ఇందులో రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్‌ వ్యాధుల గుర్తింపునకు స్క్రీనింగ్‌ చేశారు. 

* సర్వే ఇప్పటికీ కొనసాగుతుండగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2,19,438 పైగా రక్తపోటుతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వారందరికి ప్రభుత్వం ఉచితంగా మందులు అందిస్తోంది.

వైద్యుల్లోనూ బాధితులు: వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో రక్తపోటు దినోత్సవం సందర్భంగా ఈనెల 17న నిర్వహించిన స్క్రీనింగ్‌ కార్యక్రమంలో 100మందికి పరీక్షలు చేయగా 20 మందికి రక్తపోటు ఉన్నట్లు గుర్తించారు. ఆసుపత్రిలో పని చేస్తున్న 250 మంది వైద్యుల్లో 40 మందికి రక్తపోటుతో బాధపడుతున్నారు. 

ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటిస్తున్నా: వినోద్‌కుమార్, వరంగల్‌

గత సంవత్సరం నాకు కరోనా వచ్చింది. ఆ సమయంలో వైద్యుల సూచన మేరకు ప్రతిరోజు వ్యాయామం, యోగా, ధాన్యంతో పాటు జొన్నలు, రాగులు, బర్లీ, చపాతి మాత్రమే ఆహారంగా తీసుకున్నాను. ఇప్పటికీ అదే పాటిస్తున్నాను. ఎక్కడికైనా వెళ్లినప్పుడు మాత్రమే భోజనం చేస్తాను. దీంతో నా బీపీ నార్మల్‌కు వచ్చింది. రెండుసార్లు వైద్యుల వద్ద చెక్‌ చేయించుకున్నాక.. 8 నెలల కిందట మాత్రలు వాడటం మానేశాను. నాకు ఇప్పుడు రక్తపోటు సమస్యలేదు. 

ఇక ఇంటి వద్దకే మందుల కిట్లు 

మధుమేహం, రక్తపోటు, అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారికి మందులతో కూడిన కిట్టును అందించే కార్యక్రమాన్ని ఇటీవల మహబూబాబాద్‌ జిల్లాలో మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. ఇప్పటికే కిట్ల పంపిణీ ఖమ్మం జిల్లాలో కొనసాగుతోంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అసంక్రమిత వ్యాధుల జాబితాలో నమోదైన వ్యాధిగ్రస్థుల ఇంటికి వెళ్లి అందజేయడానికి వైద్యాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

అందరికీ అర్థమయ్యేలా.. 

ఒక పర్సు రూపంలో ఉండే కిట్టులో మూడు వేర్వేరు రంగుల పౌచ్‌లు ఉంటాయి. అవి తీసుకోవాల్సిన రోజు సమయాన్ని బట్టి మందులను వేరు చేస్తాయి. దీనివల్ల చదువు రాని సైతం ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఏ మందులు తీసుకోవాలో ప్రజలకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరికి నెలరోజులకు సరిపోయే మందుల కిట్టును అందిస్తారు. 

40 ఏళ్ల పైబడిన వారంతా జాగ్రత్త పడాలి: డాక్టర్‌ ముత్తినేని పవన్‌కుమార్, ప్రొఫెసర్, జనరల్‌ మెడిసిన్, ఎంజీఎం ఆసుపత్రి

40 ఏళ్లు దాటిందంటే ఎవరికివారు స్వచ్ఛందంగా ప్రతి ఆరునెలలకు ఒకసారి రక్తపోటు పరీక్షలు చేయించుకోవాలి. ప్రతిరోజు వ్యాయామం, యోగా, ధ్యానం ద్వారా ఒత్తిడిని అధిగమిస్తే రక్తపోటు రాదు. తగ్గిందని మాత్రలు వాడటం మానొద్దు. సమతుల్య ఆహారం తీసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని