logo

పెళ్లి చేయిస్తానని డబ్బు తీసుకొని తిరిగివ్వకపోవడంతో.. రైలుకు బాంబు బెదిరింపు

శబరి ఎక్స్‌ప్రెస్‌ రైల్లో బాంబు ఉందంటూ ఫోన్‌కాల్‌ చేసి పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించిన వ్యక్తిని ఎట్టకేలకు ఆర్పీఎఫ్‌, సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీసులు అదుపులోకి

Updated : 02 Jun 2022 08:50 IST

పోలీసుల అదుపులో నిందితుడు

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: శబరి ఎక్స్‌ప్రెస్‌ రైల్లో బాంబు ఉందంటూ ఫోన్‌కాల్‌ చేసి పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించిన వ్యక్తిని ఎట్టకేలకు ఆర్పీఎఫ్‌, సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం 12గంటల సమయంలో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లోని 2వ నంబరు ప్లాట్‌ఫాం నుంచి బయల్దేరేందుకు సిద్ధంగా ఉన్న శబరి ఎక్స్‌ప్రెస్‌లో బాంబు ఉందంటూ కంట్రోల్‌ రూంకు ఫోన్‌కాల్‌ రాగా రైలును ఆపి తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. రైల్వే ఉన్నతాధికారులు, ఎస్పీ అనూరాధ ఆదేశాలతో సికింద్రాబాద్‌ డీఎస్పీ నర్సయ్య నేతృత్వంలో ఆర్పీఎఫ్‌, జీఆర్పీ పోలీసులు ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. లారీ అడ్డాల వద్ద కూలీగా పనిచేసే మీరజ్‌ఖాన్‌(55) ఫోన్‌ చేసినట్లు గుర్తించారు. బుధవారం సాయంత్రం అతడిని అదుపులోకి తీసుకున్నారు.

పెళ్లి చేస్తానని డబ్బు వసూలు

నిందితుడికి వివాహం కాలేదు. ఓ మహిళ అతనికి పెళ్లి చేయిస్తానని చెప్పి డబ్బులు తీసుకుంది. ఆమె పెళ్లి చేయకపోగా.. డబ్బులు తిరిగివ్వలేదు. దీంతో ఆ మహిళపై కోపంతో ఉన్న మీరజ్‌ శబరి ఎక్స్‌ప్రెస్‌లో వెళ్తుందని తెలిసి ఆమె బుట్టలో బాంబు ఉందని ఫోను చేసి చెప్పానని పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం. అతడు వాడిన సిమ్‌కార్డు వేరొకరి చిరునామా, పేరుతో ఉండటంతో నిందితుడికి ఎలా వచ్చింది? అనే విషయాలను తెలుసుకునేందుకు పోలీసులు విచారిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని