logo

IND Vs SA: విజయమో..వీర పోరాటమో!

విశాఖలో జరిగే మ్యాచ్‌ భారత్‌కు కీలకం. ఓడిపోతే టీ-20 సిరీస్‌ దక్షిణాఫ్రికా సొంతమవుతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనే సంకల్పంతో భారత క్రికెటర్లు ఉన్నారు. మరో వైపు వరుసగా రెండు విజయాలతో దక్షిణాఫ్రికా జట్టు దూకుడుగా

Updated : 14 Jun 2022 13:12 IST

నేడే... క్రికెట్‌ సమరం

కలిసొచ్చే మైదానం.. భారత్‌ అదరగొట్టేనా..!

కీలకంగా మారిన విశాఖ టీ-20 మ్యాచ్‌

స్టేడియం వెలుపల విద్యుద్దీపాల వెలుగులు

విశాఖ క్రీడలు, న్యూస్‌టుడే: విశాఖలో జరిగే మ్యాచ్‌ భారత్‌కు కీలకం. ఓడిపోతే టీ-20 సిరీస్‌ దక్షిణాఫ్రికా సొంతమవుతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనే సంకల్పంతో భారత క్రికెటర్లు ఉన్నారు. మరో వైపు వరుసగా రెండు విజయాలతో దక్షిణాఫ్రికా జట్టు దూకుడుగా ఉంది. ఈ నేపథ్యంలో విశాఖ మ్యాచ్‌ హోరాహోరీగా సాగే అవకాశాలు ఉన్నాయని క్రీడా నిపుణులు అంచనా వేస్తున్నారు. విశాఖ స్టేడియం భారత జట్టుకు కలిసొచ్చిన పిచ్‌గా గుర్తింపు పొందింది. ఇక్కడ ఆడిన మ్యాచ్‌ల్లో (వన్డేలు, టెస్ట్‌లు) అత్యధిక విజయాలు సొంతం చేసుకుంది. దీంతో భారత క్రికెటర్లలో, అభిమానుల్లో ఇక్కడ మ్యాచ్‌ అంటే గెలుపు నల్లేరు మీద నడకేనని అభిప్రాయపడుతుంటారు. మంగళవారం మ్యాచ్‌కు సంబంధించి ఇప్పటికే పిచ్‌ సిద్ధమైంది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టు 200పైగా పరుగులు సాధించేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

టీ-20లో మిశ్రమ ఫలితాలు: గతంలో విశాఖ స్టేడియంలో మూడు టీ-20 మ్యాచ్‌లు జరిగాయి. ఒకటి భారత్‌ గెలవగా, ఒకటి ఓడిపోయింది.మరొకటి రద్దయింది. 2012 సెప్టెంబరు 8న భారత్‌- న్యూజిలాండ్‌ మ్యాచ్‌ వర్షానికి రద్దయింది. 2016 ఫిబ్రవరి 14న భారత్‌- శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్‌ జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2019 ఫిబ్రవరి 24న భారత్‌- ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. మంగళవారం జరగనున్న భారత్‌- దక్షిణాఫ్రికా మ్యాచ్‌ నాలుగోది. ఇందులో ఎవరు విజయం సాధిస్తారో అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది.

సోమవారం సాయంత్రం భారత్‌-దక్షిణాఫ్రికా క్రికెటర్లు నగరానికి చేరుకున్నారు. రుషికొండ బీచ్‌ సమీపంలోని రాడిసన్‌ బ్లూ హోటల్‌లో బస చేశారు. దీంతో పోలీసులు అడుగడుగునా భద్రత కట్టుదిట్టం చేశారు. పీఎంపాలెం ఏసీఏ, వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ట్రాఫిక్‌, గ్యాలరీలు, స్టాండ్‌లు, క్రీడాకారులకు రక్షణ, స్టేడియం ప్రధానగేట్లు, క్రికెటర్ల డ్రెస్సింగ్‌ గదులు తదితర ప్రదేశాల్లో ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మ్యాచ్‌ సజావుగా సాగేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. 

 విమానాశ్రయంలో భారత క్రీడాకారులు


1487 మంది పోలీసులతో భద్రత

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే : భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే టీ-20 అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. నగర పోలీసు కమిషనర్‌ శ్రీకాంత్‌ ఇప్పటికే దీనిపై తగు సూచనలు ఇచ్చారు. నగరంలో  మంగళవారం మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 12 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయి. మ్యాచ్‌ను తిలకించేందుకు వచ్చే ప్రేక్షకులు... తిరిగి ఇళ్లకు పయనమయ్యే సమయంలో ఎలాంటి ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా సుమారు 1,487 మంది పోలీసు సిబ్బందిని నియమించారు. ప్రత్యేక బృందాలను సైతం రంగంలోకి దించారు.

 ట్రాఫిక్‌ ఇబ్బందులను అధిగమించేందుకు 9 పోలీసు పార్టీలను నియమించారు. ఒక ఆక్టోపస్‌ బృందం, 10 యాంటీ సబాటేజ్‌ చెక్‌ పాయింట్లు, 42 యాక్సిస్‌ కంట్రోల్‌ బృందాలు, 5 పోలీసు కుక్కలతో కూడిన బృందం, 15 ఎ.ఆర్‌.సెక్షన్లు, 2 స్పెషల్‌ పార్టీలను నియమించారు. విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, తూ.గో. జిల్లాల నుంచి పోలీసు బృందాలు నగరానికి చేరుకున్నాయి.

స్టేడియంలోకి ఎలాంటి మంచినీటి సీసాలు, ఆహార పదార్థాలను అనుమతించరని పోలీసులు స్పష్టం చేశారు. ప్రేక్షకుల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా నడుపుతున్న 100 బస్సు సర్వీసులను వినియోగించుకోవాలని పోలీసు కమిషనర్‌ శ్రీకాంత్‌ కోరారు. మ్యాచ్‌ అనంతరం ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే సమయంలో ప్రతీ ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని