logo

Cab booking : క్యాబ్‌ సంస్థల జిమ్మిక్కులు..ప్రయాణికులకు అవస్థలు

మహానగరంలో చినుకుపడితే చాలు క్యాబ్‌ సంస్థలకు పండగే!.. సర్జ్‌, పీక్‌అవర్స్‌ పేరిట చేసే వసూళ్లతో సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. వర్షం పడినప్పుడల్లా క్యాబ్‌ బుకింగ్‌కు ప్రయాణికుల తిప్పలు అన్నీ ఇన్నీ కావు.. మూడు కిలోమీటర్ల దూరానికి క్యాబ్‌లు బుక్‌ కాకపోవడం ఒక ఎత్తయితే..

Updated : 13 Jul 2022 07:27 IST

సర్జ్‌, పీక్‌ అవర్స్‌ పేరుతో రెట్టింపు వసూళ్లు
ఈనాడు, హైదరాబాద్‌

మహానగరంలో చినుకుపడితే చాలు క్యాబ్‌ సంస్థలకు పండగే!.. సర్జ్‌, పీక్‌అవర్స్‌ పేరిట చేసే వసూళ్లతో సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. వర్షం పడినప్పుడల్లా క్యాబ్‌ బుకింగ్‌కు ప్రయాణికుల తిప్పలు అన్నీ ఇన్నీ కావు.. మూడు కిలోమీటర్ల దూరానికి క్యాబ్‌లు బుక్‌ కాకపోవడం ఒక ఎత్తయితే... బుక్కైన వాహనానికి రెట్టింపు ఛార్జీలు చూపిస్తుండటం మరో ఎత్తు. అకస్మాత్తుగా వాన కురిసి ఎంతకీ తగ్గకపోవడం.. దీంతో వెళ్లాల్సిన చోటుకు సకాలంలో చేరుకోమేమోనన్న ఆత్రుతతో క్యాబ్‌ యాప్‌ను క్లిక్‌ చేస్తే రైడ్‌ ఖరారుకు గంటలు పట్టడమే కాక రెట్టింపు ఛార్జీలనూ వసూలుచేస్తున్నారు. నాలుగు చినుకులు పడితే చాలు క్యాబ్‌ సంస్థలు వాటర్‌ లాగింగ్‌ అంటూ ఛార్జీలను పెంచుతుండడం వారిని మరింత ఆందోళనకు గుర్తి చేస్తోంది.
* ఖైరతాబాద్‌ నుంచి బేగంపేట్‌ మెట్రోస్టేషన్‌(3 కి.మీ.)కు వెళ్లేందుకు ఆదివారం రాత్రి ఓ వ్యక్తి క్యాబ్‌ బుక్‌ చేయగా రూ.330 చూపించింది. సాధారణ రోజులతో పోల్చితే ఇది రెట్టింపు. మరో వ్యక్తి గతంలో క్యాబ్‌ బుకింగ్‌ చేసేందుకు ప్రయత్నించగా అర గంట సమయం తీసుకొంది. ముసురేస్తేనే పరిస్థితి ఇలా ఉంటే.. భారీ వర్షం కురిస్తే ఏంటి పరిస్థితి అని అనంతరం అతడు వాపోయాడు. ‘క్యాబ్‌ సర్వీసు ఛార్జీలు ఎప్పుడు, ఎలా ఉంటాయో అర్థం కావడంలేదు. తెలియకుండానే జేబులకు చిల్లులు పడిపోతున్నాయి. వాటిపై నియంత్రణ అవసరం’ అంటూ సామాజిక మాధ్యమాల్లో పలువురు పెడుతున్న పోస్టులు పరిస్థితి తీవ్రతను తెలియచేస్తున్నాయి.

మూడు నుంచి నాలుగు రెట్ల ధరలు..
వర్షం పడినప్పుడు, ఆఫీసు సమయాలు, రద్దీ ఉండే వేళల్లో ఆయా క్యాబ్‌ సంస్థలు చేసే జిమ్మిక్కులే ఇవని సంబంధిత సంస్థల డ్రైవర్లే చెబుతుండటం గమనార్హం. సర్జ్‌, పీక్‌ అంటూ మూడు నుంచి నాలుగు రెట్ల ధరలు వసూలు చేసుకోవడానికి కంపెనీల ఆల్గారిథమ్‌ లెక్కలివని అంటున్నారు. ‘వాహనాలు అందుబాటులో ఉన్నా బుక్‌ అవకపోవడం.. అంటే కొన్నిసార్లు ఎదురుగా క్యాబ్‌ ఖాళీగా కనిపిస్తున్నా.. బుక్‌ కాకపోవడం...చాలా ఆలస్యంగా బుక్‌ అయితే రెండు నుంచి మూడు రెట్లు ఛార్జీలు వేయడం’ సర్జ్‌కు ఓ ఉదాహరణ. ఈ సమస్యలను వర్షం పడిన సందర్భాల్లో ప్రయాణికులు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. ‘కార్యాలయాల వేళలు, రద్దీ సమయాలు వంటి పీక్‌ అవర్స్‌ను క్యాబ్‌ సంస్థలు తమకు అనువుగా మలచుకుని సర్జ్‌ ఎక్కడ ఉండాలి... పీక్‌ సమయంలో ఛార్జీలు ఎలా ఉండాలని ఆయా సంస్థలు నిర్దేశిస్తున్నాయి. సర్జ్‌, పీక్‌ పేరుతో ఇష్టారీతిన దండుకోవద్దని కేంద్ర ప్రభుత్వం మండిపడినా ఆయా సంస్థలు మాత్రం ఖాతరు చేయడంలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని