logo

Fraud in Guntur: నొక్కేద్దాం.. దొరికితే చూద్దాం.. జేబులు నింపేసుకున్న ఇంటి దొంగలు

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు రైతులకు రుణాలు ఇచ్చి వారి అభ్యున్నతికి పాటుపడాల్సి ఉంది. ఇందుకు భిన్నంగా రైతులకు పంట రుణాలు రూపంలో ఇవ్వాల్సిన సొమ్ము బ్యాంకు, సొసైటీ సిబ్బంది జేబు నింపుకుంటున్న ఘటనలు గత నాలుగేళ్ల కాలంలో వరుసగా చోటుచేసుకున్నాయి.

Updated : 16 Jun 2024 07:27 IST

బాధ్యులను గుర్తించినా కానరాని వసూళ్లు
ఏటా సొమ్ములు కొల్లగొడుతున్నా చర్యలు శూన్యం

ఈనాడు-అమరావతి: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు రైతులకు రుణాలు ఇచ్చి వారి అభ్యున్నతికి పాటుపడాల్సి ఉంది. ఇందుకు భిన్నంగా రైతులకు పంట రుణాలు రూపంలో ఇవ్వాల్సిన సొమ్ము బ్యాంకు, సొసైటీ సిబ్బంది జేబు నింపుకుంటున్న ఘటనలు గత నాలుగేళ్ల కాలంలో వరుసగా చోటుచేసుకున్నాయి. వినుకొండ, పొన్నూరు, ప్రత్తిపాడు, గుంటూరు బ్రాంచ్‌ల పరిధిలో సుమారు రూ.20 కోట్ల వరకు సొమ్ము దుర్వినియోగమైంది. వరుసగా అక్రమాలు జరుగుతున్నా బాధ్యులపై నిర్మాణాత్మక చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. రూ.కోట్లలో అక్రమాలు జరిగితే రూ.లక్షల్లో కూడా రికవరీ లేకపోవడం గమనార్హం. 

రూ.కోట్ల సొమ్ము దుర్వినియోగం చేసినా ఏదో ఒక రాజకీయ పార్టీ అండ ఉంటే చాలన్న ధోరణిలో ఉద్యోగులు వ్యవహరించారు. వైకాపా పాలనలో నేతల ఆదేశాలకు అనుగుణంగా అడ్డగోలుగా నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలకు రుణాలు ఇవ్వడం, డ్వాక్రా మహిళల పేరుతో బోగస్‌ బృందాలు సృష్టించి వారికి రుణాలు ఇచ్చినట్లు చూపి బ్యాంకు ఉద్యోగులు సొంత జేబులు నింపుకున్నారు. వీరిపై యుద్ధప్రాతిపదికన విచారణ చేసి చర్యలు తీసుకోకుండా పాలకవర్గంలోని నేత ఒకరు, బ్యాంకు కీలక అధికారి ఒకరు ఉద్దేశపూర్వకంగా వారిని కాపాడారన్న అపవాదును మూటకట్టుకున్నారు.


అక్రమార్కులకు సహకారం

గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) నుంచి ఆయా శాఖల ద్వారా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లోని సభ్యులకు పంట రుణాలు ఇస్తున్నారు. వైకాపా పాలనలో పీఏసీఎస్‌ పరిధిలో ఎన్నికలు ఆగిపోవడంతో ముగ్గురితో కూడిన కమిటీని ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో సొసైటీ సీఈవోలు, సిబ్బంది పని చేస్తూ రుణాలు ఇచ్చారు. కొందరు బ్యాంకు అధికారులు, నేతలు కుమ్మక్కై నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు, నకిలీ ఆధార్‌కార్డులు, నకిలీ చిరునామాలతో రుణాలు పొంది రూ.కోట్లు కొల్లగొట్టారు. ఎంత అడ్డగోలుగా చేశారంటే రైతులు, పట్టాదారు పాసుపుస్తకాలు, ఆధార్‌కార్డులు అన్నీ నకిలీవి అయినప్పటికీ రుణాలు ఇచ్చేశారు. సొసైటీ సిబ్బందికి కొందరు బ్యాంకు అధికారులు సహకరించడం, సదరు అధికారులకు గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులోని ఉన్నతస్థాయిలో ఉన్న అధికారి ఒకరు అండదండలు అందించడంతో యథేచ్ఛగా అక్రమాలు కొనసాగాయి. ప్రత్తిపాడు శాఖలో అక్రమాలు వెలుగులోకి వస్తే విచారణ, క్రిమినల్‌ కేసులు అంటూ హడావుడి చేసినా రికవరీలో మాత్రం శూన్యం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకుండా నాన్చివేత ధోరణి అవలంభించడం, అక్రమార్కులు వారి పని చక్కబెట్టుకునేంత సమయం ఇచ్చి వారికి అరదండాలు పడకుండా కొందరు సహకరిస్తున్నారు. 


రికవరీలో తీవ్ర జాప్యం 

ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల్లో పక్కదారి పట్టిన నిధుల రికవరీ విషయంలో ఒక్క అడుగూ ముందుకు పడలేదు. మందడం సొసైటీ పరిధిలో మాత్రమే తిరిగి జమచేశారు. పాలకవర్గాల ఆస్తులను రెవెన్యూ రికవరీ చట్టం కింద అటాచ్‌ చేసినా వసూలులో పెద్దగా ప్రయోజనం లేదు. సొసైటీల్లో రుణాలు తీసుకున్న వారి చిరునామాలన్నీ నకిలీవి కావడంతో వారి నుంచి వసూలు చేయడానికి అవకాశం లేకుండా పోయింది. సొసైటీ సొమ్ము పక్కదారి వ్యవహారంలో కొందరు బ్యాంకు అధికారుల పర్యవేక్షణ లోపం ఉందని గుర్తించి వారిని అప్పట్లో విధుల నుంచి తప్పించారు. అయితే న్యాయస్థానానికి వెళ్లడంతో వారిని విధుల్లోకి తీసుకున్నారు. కొన్ని సొసైటీల పాలక వర్గాలు విచారణ చేయించి తప్పు లేదని తేలిన సెక్రటరీలను విధుల్లోకి తీసుకున్నారు. ఈ విషయమై బ్యాంకు సీఈవో కృష్ణవేణిని వివరణ కోరగా సొసైటీల్లో ఉద్యోగులు న్యాయస్థానాలకు వెళ్లి స్టే తెచ్చుకోవడంతో సొమ్ము రికవరీ చేయడానికి అడ్డంకులు ఉన్నాయన్నారు. వినుకొండ శాఖలో 51 విచారణ పూర్తయితే రికవరీకి చర్యలు తీసుకుంటామన్నారు. 


క్రిమినల్‌ కేసులు నమోదైనా భయం లేదు

బ్యాంకు ఉద్యోగులు, అధికారులకు బోనస్‌ పంపిణీ, ఇతర బ్యాంకు నిధులు రూ.5.73 కోట్లు దుర్వినియోగమైనట్లు విచారణలో గుర్తించారు. బ్యాంకు పాలకవర్గ సభ్యులు, బ్యాంకు సిబ్బంది, సొసైటీ అధికారులు కలిపి 46 మందిని బాధ్యులుగా గుర్తించి రికవరీ నోటీసులు ఇచ్చినా అడుగు ముందుకు పడలేదు. పొన్నూరు బ్రాంచ్‌ పరిధిలో రూ.2.32 కోట్లు దుర్వినియోగం కాగా అసలు వసూలు చేసినా వడ్డీ కింద సొమ్ము ఇప్పటికీ వసూలుకాలేదు. ప్రత్తిపాడు బ్యాంకు పరిధిలోని 7 సొసైటీలతోపాటు మరో 10 సొసైటీల్లో కలిపి 17 సొసైటీల్లో 184 మంది బినామీ రైతులకు రూ.10.67 కోట్లు రుణాలు ఇచ్చారు. విచారణలో 184 మంది బినామీ రైతులు, 65 మంది పాలకవర్గ సభ్యులు, 20 మంది సంఘం సీఈవోలు, 27 మంది బ్యాంకు ఉద్యోగులు, 9 మంది రెవెన్యూ అధికారులు, 21 మంది సహకారశాఖ అధికారులపై చర్యలతోపాటు కొందరిపై క్రిమినల్‌ కేసులు పెట్టారు. పీఏసీఎస్‌ల్లో రూ.9.74 కోట్లు దుర్వినియోగం కాగా, రూ.9లక్షలు మాత్రమే రికవరీ చేశారు. కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో తదుపరి చర్యలు పెండింగ్‌లో ఉన్నాయి. వినుకొండ బ్రాంచ్‌ పరిధిలోని 5 సొసైటీల్లో డ్వాక్రా సంఘాల మహిళలకు రుణాల మంజూరులో అవకతవకలు గుర్తించి రూ.1.95కోట్లు నిధులు దుర్వినియోగమైనట్లు గుర్తించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని