logo

Guntur: ఎవరి కోసం కట్టారు.. ఎంత కొట్టేశారు?

నాటి వైకాపా ప్రభుత్వంలోని కొంతమంది కోసం నగరపాలక సంస్థ సాధారణ నిధులు దాదాపు రూ. 10 కోట్లను మంచినీళ్లలా ఖర్చు పెట్టేశారు.

Updated : 15 Jun 2024 09:27 IST

రూ.10 కోట్ల పనుల్లో అక్రమాలు
ఎవరికీ ఉపయోగపడని జిమ్‌ భవనం
గాంధీ పార్కులో పరిష్కారం కాని సమస్యలు

ప్రభుత్వ అనుమతి లేదు... కౌన్సిల్‌ తీర్మానం చేయలేదు... గాంధీ పార్కును ఆధునికీకరించేశారు! ఎన్టీఆర్‌ స్టేడియంలో జిమ్‌ భవనం నిర్మించారు. ఇందుకోసం రూ. 10 కోట్లకుపైగానే ఖర్చు చూపించారు. అవేమన్నా.. ప్రజలకు ఉపయోగపడుతున్నాయా..
అంటే లేదనే సమాధానం వస్తోంది.

ఈనాడు - అమరావతి: నాటి వైకాపా ప్రభుత్వంలోని కొంతమంది కోసం నగరపాలక సంస్థ సాధారణ నిధులు దాదాపు రూ. 10 కోట్లను మంచినీళ్లలా ఖర్చు పెట్టేశారు. గాంధీ పార్కులో వర్షం వస్తే నీరంతా నిల్వ ఉండిపోతోంది. జిమ్‌ భవనంలో పరికరాలను పెట్టలేదు. అనుమతులు, తీర్మానాల్లేకుండా ఈ పనులేంటని గత కౌన్సిల్‌ సమావేశాల్లో తెదేపా కౌన్సిలర్లు ప్రశ్నిస్తే.. అధికారులు నోరు మెదపలేదు.  అసలు ఈ పనులకు వాస్తవంగా అయిన ఖర్చెంత? వైకాపా ప్రజాప్రతినిధులు, నగరపాలక యంత్రాంగం బొక్కిందెంతో నిగ్గు తేల్చాలని కూటమి నాయకులు పట్టుబడుతున్నారు. ఈ మేరకు నగరంలోని ఇద్దరు ఎమ్మెల్యేల ద్వారా ప్రభుత్వానికి లేఖ రాయించి విచారణకు ఆదేశించేలా ఉత్తర్వులు తీసుకురావాలని కొందరు నాయకులు కోరుతున్నారు. ఈ పరిణామంతో కౌన్సిల్‌ సభ్యులు, అధికారుల్లో ఎవరి మెడకు చుట్టుకుంటాయోనని ఆందోళన చెందుతున్నారు.

వైకాపా కార్పొరేటర్ల నోట అవినీతి మాట

కోటి రూపాయలకుపైగా వెచ్చించి చేపట్టే ఏ పనులకైనా ప్రభుత్వ అనుమతి, ఈఎన్‌సీ ఆమోదం తప్పనిసరి. కానీ.. గాంధీ చిల్డ్రన్‌ పార్కు కోసం రూ. ఆరేడు కోట్లకుపైగా వెచ్చించారు. ఈ పనుల్లో పెద్దఎత్తున అవినీతి చోటుచేసుకుందని, ఎంత ఖర్చు పెట్టారో వెల్లడించాలని, అసలు కార్పొరేటర్లకు తెలియకుండా అంత రహస్యంగా చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని నాడు అధికారపక్షమైన వైకాపా కార్పొరేటర్లే కౌన్సిల్‌ సమావేశంలో ప్రశ్నలు సంధించి నిలదీశారు. ఈ పనులు చేసిన గుత్తేదారులు ఎవరు? టెండర్ల పద్ధతిలో చేశారా? నామినేషన్లపై చేశారా? స్పష్టత ఇవ్వాలని కోరినా ఎవరూ స్పందించలేదు. ఈ పనుల పేరు చెప్పి కొంతమంది రూ. కోట్లలో వెనకేసుకున్నారని నాడు వైకాపా నేతలే ఆరోపించారు. అప్పట్లో వైకాపా ప్రభుత్వ అండ చూసుకుని తమ మాటలను కౌన్సిల్‌లో లెక్క చేయలేదని, సమగ్ర విచారణ జరిపి అక్రమాలకు వెలికి తీసేవరకు ఈసారి విశ్రమించబోమని తెదేపా కార్పొరేటర్లు చెబుతున్నారు.

ఎన్టీఆర్‌ స్టేడియంలో జిమ్‌ భవనం

కొద్దిపాటి వర్షానికే నీళ్లు వస్తున్నాయ్‌

ఆరేడు కోట్ల రూపాయలకుపైగానే వెచ్చించి నగరం నడిబొడ్డున ఉన్న గాంధీపార్కును ఆధునికీకరించామని వైకాపా నేతలు గొప్పలకు పోతున్నారు. ఇక్కడి సమస్యలేమో వినోద ప్రియులకు అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి. కొద్దిపాటి వర్షానికే నీళ్లు నిలబడుతున్నాయి. సందర్శకులు తిరగలేని పరిస్థితి. ఆధునికీకరణ పేరుతో కమీషన్లు మింగేశారు తప్ప పనుల్ని ప్రణాళికాబద్ధంగా చేపట్టలేదన్న ఆరోపణలు ఉన్నాయి.. ఐదారేళ్ల పాటు పార్కు వినియోగంలో లేదు. రూ. కోట్ల ప్రజాధనంతో పనులు చేశాక కూడా సమస్యలు పరిష్కారం కాలేదు. సరైన పార్కింగ్‌ సదుపాయం లేదు. పక్కా డ్రైనేజీ వ్యవస్థ లేదు. పార్కు పక్కనే ఉన్న ప్రధాన మురుగుకాల్వ నిర్వహణ కొరవడి దుర్వాసన వెలువడుతోంది. ఇన్ని సమస్యలున్నా.. పనుల పేరుతో గుత్తేదారులకు నిధులు కుమ్మరించేసి కమీషన్లు దండుకున్నారు.

గత వైకాపా ప్రజాప్రతినిధుల మెప్పు కోసం ఈ రెండు పనులను కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు ఒక పద్ధతి లేకుండా చేపట్టారన్న ఆరోపణలున్నాయి. విచారణ జరిపి బాధ్యులైన ఇంజినీరింగ్, ఇతర ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసే యోచనలో కూటమి నాయకులున్నారు.

కోర్టు ఆదేశాలు భేఖాతర్‌

ఎన్టీఆర్‌ స్టేడియంలో రూ. 3 కోట్లతో చేపట్టిన జిమ్‌ భవన నిర్మాణ పనులకు అనుమతుల్లేవని అప్పట్లో నగరానికి చెందిన కొందరు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పనులను నిలిపేయాలని న్యాయస్థానం ఆదేశించింది. వీటిని పట్టించుకోకుండా హడావుడిగా చేసేసి ఎన్నికల కోడ్‌ రావటానికి ఒక రోజు ముందు ఆ భవనాన్ని ప్రారంభించారు. నేటికీ అందులో జిమ్‌ పరికరాలను ఏర్పాటు  చేయలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని