logo

Lavu Srikrishna Devarayalu: తెదేపా పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలు.. తక్కువ సమయంలో ప్రత్యేక గుర్తింపు..

తెలుగుదేశం పార్టీలో కష్టానికి ప్రతిఫలం ఉంటుందని, యువతకు ప్రాధాన్యం ఉంటుందని మరోసారి నిరూపితమైంది. తెదేపా పార్లమెంటరీ పార్టీ నేతగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను ఖరారు చేశారు.

Updated : 23 Jun 2024 08:43 IST

ఈనాడు డిజిటల్, నరసరావుపేట: తెలుగుదేశం పార్టీలో కష్టానికి ప్రతిఫలం ఉంటుందని, యువతకు ప్రాధాన్యం ఉంటుందని మరోసారి నిరూపితమైంది. తెదేపా పార్లమెంటరీ పార్టీ నేతగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను ఖరారు చేశారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్టీఆర్‌ భవన్‌లో శనివారం జరిగిన తెదేపా పార్లమెంటరీ పార్టీ తొలిసారి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన అతితక్కువ సమయంలోనే ఉన్నత పదవులు దక్కించుకున్న వారి సరసన ఎంపీ లావు చేరారు. దీంతో ఆయన అభిమానులు, పల్నాడు వాసులు హర్షం వ్యక్తం చేశారు. 2014లో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. 2019లో నరసరావుపేట నుంచి వైకాపా తరఫున పోటీచేసి తెదేపా అభ్యర్థి రాయపాటి సాంబశివరావుపై గెలిచారు. ఈ ఏడాది జనవరి 23న వైకాపాకు రాజీనామా చేసి తెదేపాలో చేరారు. ఈ ఎన్నికల్లో తెదేపా తరఫున నరసరావుపేట నుంచే పోటీ చేసి మరోసారి గెలుపొందారు. గుంటూరు విజ్ఞాన్‌ విద్యాసంస్థల ఛైర్మన్‌ లావు రత్తయ్య కుమారుడైన శ్రీకృష్ణదేవరాయలు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఆస్ట్రేలియాలో మీడియా స్టడీస్‌ చేశారు. 2019-24 మధ్య ఎంపీగా ఉన్న సమయంలో వరికపూడిశెల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తీసుకురావడంలో కష్టపడ్డారు. రూ.10.61 కోట్లతో నకరికల్లు మండలంలో ఇండో-ఇజ్రాయెల్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. తక్కువ పెట్టుబడులతో కూరగాయలు, వరి పండించి, రైతులకు లాభాలు తీసుకురావడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. రూ.మూడువేల కోట్లతో జిల్లాలో పలు జాతీయ రహదారులను మంజూరు చేయించడమే కాకుండా పనులు జరుగుతున్నాయి. కొన్ని పనులు తుది దశలో ఉన్నాయి. రెండు కేంద్రీయ విద్యాలయాలను కూడా జిల్లాకు మంజూరు చేయించారు. మొదటిసారి ఎంపీగా ఉన్న సమయంలో జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యులయ్యారు. ఈసారి ఎలాగైనా వరికపూడిశెల ప్రాజెక్టు పనులు శరవేగంగా జరిగేలా చూస్తానని మాట ఇచ్చారు. 2019-24 మధ్య జిల్లాకు చేసిన అభివృద్ధితో రెండోసారి పల్నాడు వాసులు లావును గెలిపించారు. 

గౌరవం దక్కింది

 తెదేపా పార్లమెంటరీ పార్టీ నేతగా మంచిపేరు తెచ్చుకోవడమే కాకుండా జిల్లాకు పలు ప్రాజెక్టులు తీసుకొచ్చి సమస్యలను పరిష్కరించాలని పల్నాడు వాసులు ఆశిస్తున్నారు. ఈ సందర్భంగా ఎంపీ లావు ‘ఈనాడు’తో మాట్లాడుతూ.. ‘మంచి గౌరవం దక్కింది. నాపై నమ్మకం ఉంచి పెద్ద బాధ్యతలు అప్పగించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నా. రాష్ట్రానికి రావాల్సిన పలు ప్రాజెక్టులకు సంబంధించిన నిధులు, జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కేంద్ర ప్రాజెక్టులనూ పూర్తి చేసేలా తీవ్రంగా కృషి చేస్తా. అంతేకాకుండా నా కష్టాన్ని చూసి రెండోసారి గెలిపించిన పల్నాడు వాసులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా’ అన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని