logo

దృఢ సంకల్పంతో ధ్రువతారగా ఎదిగిన అక్కినేని

దృఢ సంకల్పంతో సినీ వినీలాకాశంలో ధ్రువతారగా ఎదిగిన మహోన్నత వ్యక్తిత్వ శిఖరం అక్కినేని నాగేశ్వరరావని పలువురు ప్రముఖులు కీర్తించారు.

Published : 24 Sep 2023 05:52 IST

నాగేశ్వరరావు శతజయంతి సభలో పలువురు ప్రముఖులు

అక్కినేని-వంద సంవత్సరాలు పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న శారద, రాయుడు, బుర్రా సాయిమాధవ్‌, మురళి, భువనచంద్ర, తోటకూర ప్రసాద్‌, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, దక్షిణామూర్తి, రవి తదితరులు

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: దృఢ సంకల్పంతో సినీ వినీలాకాశంలో ధ్రువతారగా ఎదిగిన మహోన్నత వ్యక్తిత్వ శిఖరం అక్కినేని నాగేశ్వరరావని పలువురు ప్రముఖులు కీర్తించారు. అక్కినేని ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా ఆధ్వర్యంలో గుంటూరు శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో అక్కినేని శతజయంతి సభ శనివారం రాత్రి జరిగింది. సభకు తానా పూర్వాధ్యక్షుడు తోటకూర ప్రసాద్‌ అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ తన బలహీనతలను బలాలుగా మార్చుకుని వ్యక్తిత్వ వికాసానికి నిలువుటద్దంగా ఎదిగిన ఆదర్శ మూర్తి అక్కినేని అన్నారు. సభలో ఫౌండేషన్‌ అధ్యక్షుడు మురళి వెన్నం, కార్యదర్శి రవి కొండబోలు, కమిటీ సభ్యురాలు శారద ఆకునూరి తదితరులు తమ తమ ప్రసంగాలలో అక్కినేని సినీ, జీవిత విశేషాలను, ఆయన అమెరికా వచ్చినప్పటి మధుర జ్ఞాపకాలను, అక్కినేనితో తమ అనుబంధాలను గుర్తు చేసుకున్నారు. డాక్టర్‌ పాటిబండ్ల దక్షిణామూర్తి తదితరులు మాట్లాడారు.  

పురస్కార ప్రదానోత్సవం: ఈ సందర్భంగా పలువురు ప్రముఖులకు నిర్వాహకులు పురస్కారాలిచ్చి సత్కరించారు. పద్మశ్రీ డాక్టర్‌ అన్నవరపు రామస్వామికి జీవన సాఫల్య పురస్కారాన్ని, డాక్టర్‌ కొండబోలు బసవపున్నయ్యకు వైద్య రత్న పురస్కారాన్ని, విద్యారత్న పురస్కారాలను డాక్టర్‌ కోనేరు సత్యప్రసాద్‌, మాదల సుబ్రహ్మణ్యేశ్వరరావు, డాక్టర్‌ బులుసు అపర్ణ, పరుచూరి నారాయణాచార్యులు(లల్లాదేవి)లకు ప్రదానం చేశారు. సినీరత్న పురస్కారాలను జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, భువనచంద్ర, బుర్రా సాయిమాధవ్‌లకు అందజేశారు. సేవారత్న పురస్కారాలను నన్నపనేని సదాశివరావు, డాక్టర్‌ ఎంవీ రాయుడు, లంక సూర్యనారాయణ, నల్లాని రాజేశ్వరి, సంగీత విద్వాంసుడు స్వర వీణాపాణిలకు ఇచ్చారు. రంగస్థలరత్న పురస్కారాలను కేవీ సత్యనారాయణ, సురభి ప్రభావతి, వ్యాపారరత్న పురస్కారాలను కొత్త సుబ్రహ్మణ్యం, మునగాల మోహన్‌శ్యామ్‌ ప్రసాద్‌, అంబికా రాజాలకు ఇచ్చి సత్కరించారు. వినూత్న రత్న పురస్కారాలను బుర్రా శివ వరప్రసాద్‌, టి.శ్రీనివాసరెడ్డి, రావర్ల వినోద్‌ చౌదరి, అక్కినేని అంతర్జాతీయ ప్రత్యేక పురస్కారాలను డోగివర్తి శంకరరావు, పొత్తూరి రంగారావు, మన్నె శ్రీనివాసరావులకు ఇచ్చి సన్మానించారు. ఈ సందర్భంగా అక్కినేని శతకం, అక్కినేని-100 సంవత్సరాలు పుస్తకాలను అతిథులు, నిర్వాహకులు ఆవిష్కరించారు. చంద్రశేఖర్‌, వినయ్‌ల నృత్యప్రదర్శన, బాలకామేశ్వరరావు, శాంతిశ్రీ రామకృష్ణ, శారద ఆకునూరి పాడిన పాటలు అలరించాయి. ఏవీకే సుజాత వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని