logo

మార్కెట్ల తరలింపు ఎప్పుడో..?

నగరాభివృద్ధి, సదుపాయాల కల్పన విషయంలో గత అయిదేళ్లుగా వైకాపా పాలకులు పట్టించుకున్నది లేదు.

Published : 17 May 2024 04:49 IST

నగర వాసులకు తీవ్ర ట్రాఫిక్‌ ఇక్కట్లు

పట్నంబజారు ప్రాంతంలోని పండ్ల మార్కెట్‌

నగరపాలకసంస్థ (గుంటూరు), న్యూస్‌టుడే: నగరాభివృద్ధి, సదుపాయాల కల్పన విషయంలో గత అయిదేళ్లుగా వైకాపా పాలకులు పట్టించుకున్నది లేదు. ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్యల  కారణంగా నగరంలోని మార్కెట్లను బయటకు తరలించాలనే ప్రతిపాదనను అటకెక్కించారు.

లాలాపేట, పట్నంబజారు ప్రాంతంలో పండ్ల మార్కెట్‌, జీఎంసీ ప్రధాన కార్యాలయం వెనుకగా ఉండే మాంసం, చేపల విక్రయించే వెన్‌లాక్‌ మార్కెట్‌తో నిత్యం ఆయా వీధుల్లో ట్రాఫిక్‌ అస్తవ్యస్తంగా ఉంటోంది. ఒకప్పుడు పొన్నూరురోడ్డు వద్ద జాతీయ రహదారి పక్కగా ఉన్న నగరపాలక సంస్థ స్థలంలోకి మార్కెట్లను తరలించి ఏర్పాటు చేయాలని నాడు శిలాఫలకం ఆవిష్కరించారు. ఆతర్వాత దాని గురించి పట్టించుకోలేదు. నిత్యం మార్కెట్ల కోసం సరకు రవాణా చేసే వాహనాలు, కొనుగోలు, విక్రయాలు చేసేందుకు వచ్చే వారి వాహనాలతో ఈప్రాంతాలు రణరంగంగా మారుతున్నాయి. నగరపాలకసంస్థ పట్టణ ప్రణాళిక విభాగం, ట్రాఫిక్‌ పోలీస్‌ విభాగాలు చర్యలు తీసుకుంటున్నామని చెప్పడమేకానీ ఇక్కట్లు మాత్రం తీరడం లేదు. గత అయిదేళ్లుగా నగరంలో ప్రధాన ప్రాంతాల్లో ఉండే మార్కెట్ల అభివృద్ధి, వ్యాపారుల సంక్షేమం గురించి పాలకులు చేసింది శూన్యం. దీంతో సమస్య జఠిలంగా మారింది.

వెన్‌లాక్‌ మార్కెట్‌లో చేపల విక్రయాలు

పాలకుల వైఫల్యమే

  • పండ్ల మార్కెట్‌కు అరటికాయలు తమిళనాడు, మహానంది, రావులపాలెం, తెనాలి, దుగ్గిరాల నుంచి వస్తాయి. యాపిల్‌ జమ్ము, దిల్లీ, కమలాలు నాగ్‌పూర్‌, ద్రాక్ష బెంగళూరు, దానిమ్మ షోలాపూర్‌, మామిడి కృష్ణాజిల్లా, నల్గొండ, బత్తాయి మార్కాపూర్‌, నల్గొండ ప్రాంతాల నుంచి వస్తాయి. ఇలా నిత్యం పదుల సంఖ్యలో లోడు లారీలు ఇరుకు గొందులోకి వస్తుండడంతో అవస్థలు తప్పడం లేదు.
  • వెన్‌లాక్‌ మార్కెట్‌లో నిర్మాణ లోపాలతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దుకాణాలు కొన్ని చిన్నవిగా ఉన్నాయి. దీంతోపాటు డ్రెయినేజీ వ్యవస్థ, విక్రయాలు, ప్రజల రాకపోకలకు వీలుగా మార్గాలు పక్కాగా లేకపోవడంతో సమస్యలు ఏర్పడుతూనే ఉన్నాయి. కొందరు వ్యాపారులు మార్కెట్‌ సెల్లార్‌లో, బయట మార్జిన్‌లోనే వ్యాపారాలు చేస్తుండడంతో ట్రాఫిక్‌ సమస్యలతో ఇటుగా వచ్చిపోయే వారు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడకు చేపలు, రొయ్యలు బాపట్ల, కొల్లేరు, గోదావరి జిల్లాల నుంచి వస్తుంటాయి. మార్కెట్ల సమస్యల గురించి మాట ఇచ్చిన ప్రజాప్రతినిధులు దానిని విస్మరించారు.

అందరం ఇబ్బంది పడుతున్నాం: మల్లికార్జున, చిరువ్యాపారి

మాది గుజ్జనగుండ్ల ప్రాంతంలో పండ్ల వ్యాపారం. నిత్యం పండ్లు కొనుగోలు చేసేందుకు ఇక్కడకు వస్తుంటాం. విపరీతమైన ట్రాఫిక్‌తో అందరం ఇబ్బంది పడుతున్నాం. ఏదైనా లారీ వచ్చిందంటే ఇక గంటల కొద్దీ వాహనాలు నిలిచిపోతున్నాయి. దీంతోపాటు పారిశుద్ధ్య సమస్య ఏర్పడుతోంది. సమస్యలు పరిష్కరించేందుకు గత అయిదేళ్లుగా పాలకులు చేసిందేం లేదు.


ఎవరూ పట్టించుకోలేదు: శివాజీ, నగరవాసి

మూడు, నాలుగు దశాబ్దాల కిందట అప్పటి నగర పరిస్థితులకు అనుగుణంగా మార్కెట్లు ఏర్పాటు అయ్యాయి. ఇప్పుడు నగరం పెరిగింది. మార్కెట్లు నగరం మధ్యలోకి వచ్చి నిత్యం రద్దీ ఏర్పడుతోంది. మార్కెట్ల తరలింపు విషయంలో పాలకులు మాట తప్పారు. మార్కెట్ల వద్ద ఏళ్ల తరబడి ట్రాఫిక్‌ సమస్యలు నెలకొన్నా ఎవరూ పట్టించుకోలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని