logo

క్షణక్షణం ఉత్కంఠ.. పోలింగ్‌ నాటి ఘటనలతో గ్రామాల్లో ఉద్రిక్తత

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ముగిసినా ఉమ్మడి గుంటూరులో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Updated : 17 May 2024 06:54 IST

కనిపించని పోలీసుల ముందస్తు పికెట్లు, కవాతులు
ఈనాడు, అమరావతి

కొల్లూరు: గొడవల్లో ధ్వంసమైన కారు

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ముగిసినా ఉమ్మడి గుంటూరులో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన, ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నెల 13న జరిగిన పోలింగ్‌ సందర్భంగా పలు గ్రామాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఎవరికి వారు దాడులకు సన్నద్ధమవుతున్నారు. అయినా ఇవేమి పోలీసులకు పట్టడం లేదు. ఈ సమాచారం నిఘా, స్పెషల్‌ బ్రాంచి పోలీసుల ద్వారా తెలుసుకుని పోలింగ్‌ అనంతరం గ్రామాల్లో ఎలాంటి గొడవలకు ఆస్కారం లేకుండా ముందస్తు పికెట్లు, శాంతి సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. గొడవలు జరిగాక చూద్దాంలే అనే నిర్లక్ష్య ధోరణిలో పోలీసులు ఉన్నారు.

బాపట్ల జిల్లాలో..

  • బాపట్ల మండలం పడమర పిల్లిబోయినవారిపాలెంలో పోలింగ్‌ ముగిసిన కొద్ది గంటలకే ఎన్టీఆర్‌ విగ్రహానికి నిప్పు అంటించారు. మొక్కుబడిగా పికెట్‌ పెట్టారు. ఆ గ్రామానికి ఉన్నతాధికారులు వెళ్లి శాంతి సమావేశాలు నిర్వహించకపోవడం గమనార్హం.
  • వేమూరు నియోజకవర్గం కొల్లూరులో పోలింగ్‌ రోజున అత్యధికంగా 30 దాకా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. కొల్లూరులో కూటమి, వైకాపా కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్నారు. ఆరేడు గ్రామాల్లో వైకాపా, తెదేపా కార్యకర్తలు బాహాబాహాకి దిగి అల్లర్లకు పాల్పడ్డారు. ఆ గ్రామాల్లో కనీసం పికెట్లు లేవు. పోలీసులు క్షేత్రస్థాయిలో పర్యటించి కవాతులు చేయలేదు. ‌
  • రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లి మండలం రాంబొట్లవారిపాలెంలో తెదేపా ఏజెంట్‌ను రాళ్లతో కొట్టి గాయపరిచారు. ఆ గ్రామంలో పికెట్‌ ఏర్పాటు చేయలేదు.‌
  • చీరాలలో వైకాపా అభ్యర్థి కరణం వెంకటేశ్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌ వర్గీయుల మధ్య చీరాల పట్టణంతో పాటు వేటపాలెంలో పలుచోట్ల పోలింగ్‌ రోజు గొడవలు జరిగాయి. ఆ రోజు ఆమంచి కృష్ణమోహన్‌కు చెందిన వాహనాలను ధ్వంసం చేశారు. అప్పటి నుంచి పట్టణంలో కరణం, ఆమంచి వర్గీయుల మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. మొత్తంగా నియోజకవర్గంలో కరణం, ఆమంచి వర్గీయుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ ఇద్దరు నేతలు ఎవరికి వారు కార్యాలయాలు, ఇళ్ల మీద దాడులు చేసుకోవడానికి ప్లాన్‌ చేసుకుంటున్నారని నిఘా వర్గాలు అప్రమత్తం చేసినా పోలీసు ఉన్నతాధికారులు వారిని పిలిచి మాట్లాడలేదు. ఇవన్నీ పోలీసుల వైఫల్యానికి నిదర్శనం.

ఇప్పటికే అట్టుడుకుతున్న మాచర్ల, గురజాల

పోలింగ్‌ వేళ చోటుచేసుకున్న గొడవలతో ఇప్పటికే మాచర్ల, గురజాల అట్టుడుకుతోంది. అక్కడ పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా లేకపోవటంతో ఇప్పటికే వైకాపా నాయకులు, కార్యకర్తలు ప్రతిదాడులతో రెచ్చిపోతున్నారు. వాటిని దృష్టిలో పెట్టుకుని అయినా పోలీసు ఉన్నతాధికారులు గుంటూరు, బాపట్ల జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న గ్రామాలో పోలీసు పికెట్లు ఏర్పాటు చేయడం, కవాతులు నిర్వహించడం వంటివి చేయలేదు. మరోవైపు గ్రామాల్లో ఏక్షణాన ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ రాజకీయ పార్టీల నాయకుల్లోనే కాదు ప్రజల్లోనూ ఉంది. హింస చెలరేగకుండా ఎప్పటికప్పుడు పోలీసులు గ్రామాల్లో పర్యటిస్తూ గొడవలకు పాల్పడేవారిని పిలిచి మాట్లాడడం చేయడం లేదు. ఇదే అదనుగా ఎవరికివారు రెచ్చిపోయే అవకాశం ఉంది. ఐజీ, జిల్లా ఎస్పీలు ఇప్పటికైనా మేల్కొని గొడవలకు ఆస్కారం ఉన్న గ్రామాల్లో ముందస్తు చర్యలు చేపట్టడం ద్వారానే ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చూసుకోవచ్చనే అభిప్రాయాన్ని రాజకీయవర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని