logo

మిగ్‌జాంతోనైనా కళ్లు తెరవరా?

మిగ్‌జాం తుపానుతో గత ఏడాది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా పంట కాల్వల నుంచి వరద నీరు బయటకు వెళ్లకపోవడంతో లక్షల ఎకరాల్లో చేతికందొచ్చిన పంట నీటిపాలైంది.

Updated : 17 May 2024 06:37 IST

అధ్వానంగా సాగు.. మురుగు నీటి కాలువలు
రూ.12 కోట్ల ప్రతిపాదనల్లో కదలిక లేదాయే  

అధ్వానంగా కొమ్మమూరు కాలువ

మిగ్‌జాం తుపానుతో గత ఏడాది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా పంట కాల్వల నుంచి వరద నీరు బయటకు వెళ్లకపోవడంతో లక్షల ఎకరాల్లో చేతికందొచ్చిన పంట నీటిపాలైంది. మూడు రోజుల పాటు వర్షంలోనే పైరు నీట మునగడంతో నష్ట తీవ్రత పెరిగింది. ఐదేళ్లుగా  కాలువలకు మరమ్మతులు చేయకపోవడంతో సమస్య ఎదురైంది. ఈసారి అయినా మోక్షం లభిస్తుందని అనుకుంటే, ప్రస్తుత మే నెలలో పనులు మొదలయ్యేటట్లు కనిపించడం లేదు. వర్షాలు కురవక ముందే పనులు  మొదలుపెట్టేలా అధికారులు చూడాలని రైతులు కోరుతున్నారు.

బాపట్ల, న్యూస్‌టుడే

జిల్లాలో సాగు, మురుగునీటి కాలువల్లో పూడిక పేరుకుపోవడంతో పాటు కట్టలు కోతకు గురై బలహీనమయ్యాయి. గుర్రపుడెక్క, తూటుకాడతో నిండిపోయింది. మరమ్మతులు చేపట్టటానికి రూ.12 కోట్లతో జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదనలు రూపొందించి రెండున్నర నెలల క్రితం ప్రభుత్వానికి పంపించారు. గత ఐదేళ్లుగా కాలువల్లో మరమ్మతులు సరిగా చేపట్టడం లేదు. సకాలంలో పనులు చేయటం లేదు. వేసవిలో కాకుండా వర్షాలు కురిసే జూన్‌, జులైలో తూతూమంత్రంగా చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. చివరి ఆయకట్టుకు నీరందక పంటలు పండిపోతున్నాయి. భారీవర్షాలు కురిసిన సమయంలో పొలాల నుంచి నీరు త్వరగా బయటకు వెళ్లకుండా వారం, పది రోజులు నిలిచి ఉండటంతో పంటలు ముంపు బారినపడి దెబ్బతిని అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎన్నికల హడావుడి తగ్గటంతో ఇక కీలకమైన సాగునీటి కాలువలపై అధికారులు దృష్టి పెట్టాల్సి ఉంది. ఈ సారి నైరుతి రుతుపవనాలు ముందుగా వచ్చి జూన్‌ మొదటి వారంలోనే తొలకరి వర్షాలు ప్రారంభమవుతాయంటున్నారు. మే మూడో వారం వచ్చినా కాలువల్లో ఇంకా పనులు ప్రారంభించలేదు. తక్షణమే అనుమతులు, నిధులు మంజూరు చేసి పనులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
2 నీటి తీరువా శిస్తు కింద రూ.12 కోట్లకు పైగా వసూలు కావాల్సి ఉంది. నీటి తీరువా శిస్తు వసూలుపై అధికారులు ఇంకా దృష్టి పెట్టలేదు. శిస్తు వసూలు ద్వారా వచ్చే ఆదాయం నుంచే కాలువల మరమ్మతుల బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకుని ఈ నెలలోనే ప్రారంభించి కాలువల్లో మరమ్మతులు పూర్తి చేయాల్సి ఉంది.

గుర్రపుడెక్కతో బాపట్ల ఛానల్‌

  • కృష్ణా పశ్చిమ డెల్టాలో రెండున్నర లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందించే కొమ్మమూరు కాలువలో కనీస నిర్వహణ కరువైంది. కాలువల కట్టలు కోతకు గురై, బలహీనపడి బాగా దెబ్బతిన్నాయి. కాలువకు పూర్తిస్థాయిలో 3500 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తే కట్టలకు గండ్లు పడుతున్నాయి. మిగ్‌జాం తుపాను వరద నీటితో కాలువ కట్టలు కొట్టుకుపోయి గండ్లు పడినా శాశ్వతంగా పూడ్చే పనులు చేపట్టలేదు.
  • నల్లమడ వాగు, పర్చూరు వాగు, రొంపేరు, తుంగభద్ర, భట్టిప్రోలు,  కొల్లిమర్ల, ఆర్‌ఎం, పేరలి మురుగు కాలువలు అధ్వానంగా ఉన్నాయి. డిసెంబరు మిగ్‌జాం తుపాను ప్రభావంతో కురిసిన భారీవర్షాలకు వాగులు, మురుగు కాలువల కట్టలకు గండ్లు పడ్డాయి. గుర్రపుడెక్క, తూటుకాడ దట్టంగా పేరుకుపోయాయి. పూడిక తొలగించాల్సి ఉంది.
  • రైతుల నుంచి ఎకరాకు రూ.200 చొప్పున నీటి తీరువా శిస్తూ వసూలు చేసి ఆ సొమ్మునే కాలువల్లో ఏటా మరమ్మతులు చేయడానికి కేటాయిస్తున్నారు. గతేడాది రూ.8 కోట్ల విలువైన పనులు చేయాల్సి ఉండగా రూ.నాలుగున్నర కోట్ల పనులే చేపట్టారు.
  • గతేడాది చేసిన పనుల తాలూకా బిల్లులే ఇంకా చెల్లించలేదు.  రూ.నాలుగున్నర కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఏడాది అధికారులు సాగు, మురుగు నీటి కాలువల్లో చేపట్టాల్సిన మరమ్మతులకు  ఫిబ్రవరి చివరి వారంలోనే రూ.12 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపించారు.

పూడిక తీయాల్సిన ఈస్ట్‌స్వాంప్‌ మురుగు కాలువ

ఈ ఏడాదైనా పూడిక తొలగించాలి  

గత ఖరీఫ్‌లో ఐదు ఎకరాల్లో వరి సాగు చేశా.  అధ్వానంగా ఉన్న మురుగుకాలువ వల్ల మిగ్‌జాం తుపాను సమయంలో పొలం నుంచి నీరు పది రోజుల వరకు బయటకు వెళ్లలేదు. కోత, నూర్పిడి దశలో ఉన్న వరి పంట నీట మునిగి నష్టపోయా. ఈ ఏడాదైనా బాపట్ల ఛానల్‌ కట్టలు పటిష్ఠం చేసి, మురుగు కాలువలో పూడిక తీయించి పంటల సాగుకు సమస్యలు లేకుండా చూడాలి. 

కమలాకరరావు, రైతు, జమ్ములపాలెం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని