logo

తలొగ్గారని తప్పించారు

రాష్ట్రవ్యాప్తంగా 14 సమస్యాత్మక నియోజకవర్గాలుంటే అందులో నాలుగు పల్నాడు జిల్లాలో ఉన్నాయంటేనే ఆలోచించాలి.

Updated : 17 May 2024 06:41 IST

పోలింగ్‌ రోజున, అనంతరం పల్నాడులో పలుచోట్ల హింసాత్మక ఘటనలు
అధికారుల నిర్లిప్తతపై కన్నెర్రజేసిన ఎన్నికల సంఘం
కలెక్టర్‌, ఎస్పీలతో పాటు ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్సైలపై కొరడా
ఈనాడు, ఈనాడు డిజిటల్‌- నరసరావుపేట, న్యూస్‌టుడే- గురజాల, నరసరావుపేట అర్బన్‌

దాచేపల్లిలో పెట్రో బాంబు దాడితో చెలరేగిన మంటలు

రాష్ట్రవ్యాప్తంగా 14 సమస్యాత్మక నియోజకవర్గాలుంటే అందులో నాలుగు పల్నాడు జిల్లాలో ఉన్నాయంటేనే ఆలోచించాలి. ఎన్నికలకు ముందస్తు ప్రణాళిక, కసరత్తు లేకుంటే ముందుకెళ్లడం కష్టం. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ఊహించని ఘటనలు ఎదురవుతాయి.   ఎన్నికలు ఏవైనా నిర్వహించేది ఎన్నికల సంఘమే అయినా క్షేత్రస్థాయిలో సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్‌, ఎస్పీపై ఉంటుంది. వీరిద్దరూ ఎన్నికల క్రతువు మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకూ ప్రజాస్వామ్య ప్రక్రియకు కుడి, ఎడమలుగా నిలబడాలి. ఎక్కడ ఎలాంటి పొరపాటు జరిగినా.. పక్షపాతం చూపినా, నిర్లక్ష్యం వహించినా దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో అదే జరిగింది. ఎన్నికల నిర్వహణను చిత్తశుద్ధితో కాకుండా ప్రహసనంలా మార్చేశారు. పోలింగ్‌ ప్రక్రియను అడ్డుకుంటున్నా, రౌడీమూకలు రెచ్చిపోతున్నా.. అధికార పార్టీ నేతలు పదుల సంఖ్యలో వాహనాల్లో తిరుగుతూ అలజడి సృష్టిస్తున్నా అరాచకశక్తులు పెట్రేగిపోయినా కట్టడి చేయలేకపోయారు. పల్నాడు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు అరికట్టడంలో జిల్లా యంత్రాంగం విఫలం కావడం, పోలింగ్‌ తర్వాత దాడులు కొనసాగడాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. పల్నాడు జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌ను బదిలీ చేయగా ఎస్పీ బిందుమాధవ్‌పై సస్పెన్షన్‌ వేటు వేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. వీరితోపాటు విధుల్లో నిర్లక్ష్యం వహించిన పలువురిపై చర్యలు తీసుకోవడంతోపాటు ప్రతి ఘటనపైనా విచారణ చేసి రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించడంతో జిల్లా యంత్రాంగంలో కలకలం మొదలైంది.

కలెక్టరు.. ముందస్తు కసరత్తు ఏదీ?

కొత్త జిల్లా ఏర్పడిన 4 ఏప్రిల్‌, 2022 నుంచి పనిచేస్తున్న కలెక్టర్‌ శివశంకర్‌కు ఇక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన హింసాత్మక ఘటనలు, ఆతర్వాత వరుసగా ప్రతిపక్షాలపై దాడులు, హత్యలతో పల్నాడు అట్టుడికిపోయింది. వీటిన్నింటిని పరిగణనలోకి తీసుకుని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లి జిల్లాకు అదనపు బలగాలు రప్పించుకుని ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడంలో విఫలమయ్యారు. జిల్లాల్లో అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో పోలింగ్‌కు ముందురోజు తీసుకోవాల్సిన చర్యలు, పోలింగ్‌ రోజు, తర్వాత రోజు చేపట్టాల్సిన చర్యలపై కసరత్తు చేసి ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో హింసను కట్టడి చేయలేకపోయారు. జిల్లాలో రీపోలింగ్‌ నిర్వహించకూడదన్న లక్ష్యంతో దాడులు జరిగిన తర్వాత ఈవీఎంలు మార్చి ఎన్నికలు పూర్తిచేయడానికి చూపిన శ్రద్ధ ఘర్షణలు అరికట్టడంలో చూపలేకపోయారు. పోలింగ్‌ తర్వాత కూడా జిల్లాలో వరుసగా దాడులు, ఆస్తుల విధ్వంసం జరుగుతున్నా జిల్లా మేజిస్ట్రేట్‌ హోదాలో 144 సెక్షన్‌ అమలుచేసి కఠిన చర్యలు తీసుకునే అవకాశమున్నా రెండు రోజులు మిన్నకుండిపోయారు. ఎన్నికల సంఘం అప్రమత్తమై ఆదేశాలు ఇచ్చేవరకు దాడులు అరికట్టే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. జిల్లా ఎస్పీ నెల రోజుల కిందటే వచ్చినందున ఆయనకు మార్గదర్శిగా ఉంటూ ఎన్నికల ప్రశాంతంగా నిర్వహించడంలో జిల్లా కలెక్టర్‌ పూర్తిగా విఫలమయ్యారన్న ఆరోపణలు మూటకట్టుకున్నారు.


ఎస్పీ.. గడప దాటలేదు

జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ ఎన్నికలకు ముందు పల్నాడు జిల్లాలో సుమారు ఏడాది పాటు ఏఎస్పీగా పని చేశారు. దీంతో ఆయనకు జిల్లాలో శాంతిభద్రతలపై పూర్తి అవగాహన ఉంది. అయినా కీలకమైన ఎన్నికల సమయంలో విధులు పకడ్బందీగా నిర్వహించడంలో విఫలమయ్యారు. ఎంతసేపటికీ కార్యాలయానికే పరిమితమవుతూ నిఘా, ఎస్‌బీ వర్గాల సమాచారంపై ఆధారపడి పనిచేశారనే అపవాదు ఉంది. పోలింగ్‌ వేళ మాచర్ల, గురజాల, జిల్లా కేంద్రం నరసరావుపేటలో పెద్దఎత్తున హింస చోటుచేసుకుంది. పోలింగ్‌ ముగిసిన మరుసటి రోజే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కిరాయి మూకలను వెంటబెట్టుకుని  ఇనుపరాడ్లతో కారంపూడిలో స్వైర విహారం చేసినా ఏ మాత్రం ఆయన స్పందించలేదు. ఎస్పీ అప్రమత్తమై కిందిస్థాయి యంత్రాంగానికి ఆదేశాలిచ్చి ఉంటే వారు చాలా వరకు కారంపూడిలోనే పట్టుబడేవారు. కానీ దర్జాగా వారు తిరిగి మాచర్లవైపు వెళ్లిపోయారు. ఏ ఒక్కరూ పట్టుబడలేదు. ఇలా అడుగడుగునా ఎస్పీ నిర్వాకం ఉండటం వల్లే ఈసీ సస్పెన్షన్‌ వేటు వేసిందనే చర్చ పోలీసు వర్గాల్లో వినిపిస్తోంది. క్షేత్రస్థాయిలో కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీతో అంటకాగుతూ ప్రతిపక్షాలపై దాడులకు సహకారం అందిస్తున్నా దానిని పసిగట్టలేకపోయారు. పల్నాడు జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ ఇద్దరు సీఐలు ఇచ్చే సమాచారంపైనే ఆధారపడటంతో అల్లర్లు కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇద్దరు సీఐలు అధికార పార్టీ నేతలకు అనుకూలంగా పనిచేస్తూ దాడుల సమాచారాన్ని ఎస్పీకి సకాలంలో అందించకపోవడంతో ఎస్పీ ఉన్నతాధికారులకు ఇక్కడి పరిస్థితిని వివరించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోలేకపోయారు. దీంతో పల్నాడు జిల్లాలో ఎన్నికలు రక్తసిక్తమయ్యాయి.


చోద్యం చూసిన నరసరావుపేట డీఎస్పీ వర్మ

పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో అధికార పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అధ్వర్యంలో తెదేపా అభ్యర్థి చదలవాడ అరవిందబాబు వాహనాలపై దాడి చేసి ధ్వంసం చేశారు. అక్కడి నుంచి తప్పించుకున్న అరవిందబాబు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అరవిందబాబు అనుచరులు ఎమ్మెల్యే ఇంటిపై రాళ్లు వేయడంతోపాటు ఇంటి ముందు ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు. జిల్లా కేంద్రంలోనే పరస్పర దాడులు జరగడం, సుమారు రెండు గంటలపాటు ఉద్రిక్తత కొనసాగుతున్నా కట్టడి చేయడంలో డీఎస్పీ వర్మ విఫలమయ్యారు. అదేవిధంగా దొండపాడులో ఎస్‌ఐ సమక్షంలోనే వైకాపా కార్యకర్తలు తెదేపా ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలుపై దాడికి ఎగబడి మూడు వాహనాలు ధ్వంసం చేశారు. దీనిని కట్టడి చేయడంలోనూ పోలీసు యంత్రాంగం విఫలమైంది. వీటిన్నింటిని పరిగణనలోకి తీసుకున్న ఈసీ డీఎస్పీ వర్మపై వేటు వేసింది. జిల్లా వ్యాప్తంగా వరుస ఘటనలు జరుగుతున్నా సకాలంలో సమాచారం ఇవ్వకపోవడం, అధికార పార్టీకి సహకరించే క్రమంలో ఉన్నతాధికారులకు ఉద్దేశపూర్వకంగా సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారన్న కారణంతో స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐలు బాలనాగిరెడ్డి, ప్రభాకర్‌ను విధుల నుంచి తప్పించి విచారణకు ఆదేశించింది. 

నరసరావుపేటలో విధ్వంసం ఇలా.. 


దాడులను అడ్డుకోలేకపోయిన డీఎస్పీ పల్లంరాజు

మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో పోలింగ్‌కు ముందే సమస్యాత్మక ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి ఆరాచకాలకు పాల్పడే వారిని బైండోవర్‌ చేయాల్సిన గురజాల డీఎస్పీ పల్లంరాజు విఫలమయ్యారు. అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గి ప్రతిపక్షాలపై అక్రమకేసులు పెట్టడం ద్వారా వారిని ఇబ్బంది పెట్టేందుకు ప్రాధాన్యం ఇచ్చారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. పోలింగ్‌ రోజు అధికార పార్టీ నేతలు ఆరాచకాలు చేస్తున్నా అదనపు బలగాలు అందుబాటులో ఉన్నప్పటికీ డివిజన్‌ కార్యాలయానికి పది కిలోమీటర్ల దూరంలో ప్రతిపక్షాలపై దాడులు జరుగుతున్నా మిన్నకుండిపోయారన్న అపవాదును మూటకట్టుకున్నారు. మాచర్లలో ఏం జరుగుతుందో పసిగట్టి ఉన్నతాధికారులకు సమాచారం అందించి ముందస్తు చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. పోలింగ్‌ రోజు రెంటచింతల మండలం రెంటాల, తుమృకోట, వెల్దుర్తి మండలం కడ్లకుంట, కె.పి.గూడెం, గొట్టిపాళ్ల వంటి ప్రాంతాలలో అధికార పార్టీ  దౌర్జన్యాలకు పాల్పడవచ్చునని తెలిసినా కనీస చర్యలు చేపట్టలేదు. ఎన్నికల రోజున కండ్లకుంట, కె.పి.గూడెంలలో జరుగుతున్న అరాచకాలకు ఊతం ఇచ్చారు. పోలింగ్‌ ముగిసిన తర్వాత కూడా అధికార పార్టీ నేతలు యథేచ్ఛగా దాడులు చేసి ఆస్తులు ధ్వంసం చేస్తున్నా అడ్డుకట్ట వేయలేకపోయారు. ఈ నేపథ్యంలోనే డీఎస్పీ పల్లంరాజుపై సస్పెన్షన్‌ వేటు వేసి ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది. ఇదే సబ్‌ డివిజన్‌ పరిధిలోని కారంపూడి ఎస్‌ఐ రామాంజనేయులు, నాగార్జునసాగర్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ డీవీ కొండారెడ్డిపై సస్పెన్షన్‌ వేటు వేసి ఈసీ విచారణకు ఆదేశించింది.

పోలింగ్‌ రోజు పోలీసు నిర్లక్ష్యానికి సాక్ష్యం..


కారంపూడిలో వైకాపా మూకలు స్వైరవిహారం చేశారిలా..

కారంపూడి ఎస్సై రామాంజనేయులు అయితే ఎన్నికలకు ముందు తెదేపా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేశారు. సోమవారం కారంపూడిలో విధ్వంసం వెనుక రామాంజనేయుల హస్తం ఉందని ఆరోపణలున్నాయి. మాచర్ల నియోజకవర్గంలో నిఘా సమాచారం ఎప్పటికప్పుడు చేరవేస్తుండేవారు. ఎక్కడ తనిఖీలు జరుగుతున్నాయి? పోలీసు ఉన్నతాధికారులు ఎప్పుడు వస్తున్నారు? తెదేపా నేతలు ఏయే రూట్లలో వెళ్తున్నారు? వంటి నిఘా సమాచారం ఎప్పటికప్పుడు పిన్నెల్లి సోదరులకు చేరవేశారని నిఘా వర్గాలు గుర్తించాయి.

నిఘా సమాచారం వైకాపా నేతల చేతుల్లోకి..: జిల్లాలో ఎక్కడ ఏం జరిగినా మొదటగా సమాచారం వచ్చేది స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులకే. పలానా చోట హింసాత్మక ఘటనలు జరగొచ్చనే సమాచారం ముందస్తుగానే వస్తున్నా చర్యలు తీసుకోవడంలో స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐలు ప్రభాకర్‌, నాగిరెడ్డి పూర్తిగా విఫలమయ్యారు. ప్రభాకర్‌ గురజాల సీఐగా కూడా పనిచేశారు. నరసరావుపేట టౌన్‌ సీఐగా కూడా పనిచేశారు. జిల్లాపై పూర్తి పట్టుంది. తర్వాత ఎస్‌బీ సీఐగా వచ్చారు. అయినా సరే అల్లర్లు అరికట్టడంలో చొరవ చూపలేదు. మాచర్ల, నరసరావుపేట ఎమ్మెల్యేలు పోలింగ్‌రోజున దాడులకు ప్రణాళికలు వేస్తున్నారన్న సమాచారం ఉన్నా పోలీసు బలగాల మోహరింపు వంటి చర్యలు తీసుకోలేదు. జిల్లాలో జరిగే అల్లర్లన్నీ అప్పటికప్పుడు జరిగేవేనని, ఏవీ కూడా ప్రణాళికాబద్ధంగా జరిగినవి కావని స్టేట్‌మెంట్లు ఇచ్చారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అల్లర్లు జరుగుతాయనే సమాచారం ఉన్నా కూడా వైకాపా నేతల కోసం వదిలేశారు. బయటకు కనిపించకపోయినా అంతర్గతంగా వైకాపాకు నిఘా సమాచారం అందిస్తారని ఆరోపణలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని