logo

డైరీ, రిజిస్టర్లు ఏమయ్యాయి?

పోలింగ్‌ ముగిసి నాలుగు రోజులైంది. ఈవీఎం బాక్సులను స్ట్రాంగ్‌ రూముల్లో భద్రపరిచారు. పోలింగ్‌ ప్రక్రియకు సంబంధించిన వివరాలను ప్రతి ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు ఎన్నికల సంఘం నిర్దేశించిన డైరీతో పాటు 17 సీ రిజిస్టర్‌లో నమోదు చేస్తారు.

Published : 18 May 2024 05:36 IST

ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఫోన్లు
వివరాలుంటే పంపమనడంతో పీఓ, ఏపీఓల్లో ఆందోళన
ఈనాడు, అమరావతి

పోలింగ్‌ ముగిసి నాలుగు రోజులైంది. ఈవీఎం బాక్సులను స్ట్రాంగ్‌ రూముల్లో భద్రపరిచారు. పోలింగ్‌ ప్రక్రియకు సంబంధించిన వివరాలను ప్రతి ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు ఎన్నికల సంఘం నిర్దేశించిన డైరీతో పాటు 17 సీ రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. ఆ వివరాలను పోలింగ్‌ ముగిసిన వెంటనే ఆర్వోకు అందజేస్తారు. వాటిని ఆర్వో తన కస్టడీలో జాగ్రత్త పరుస్తారు. కౌంటింగ్‌ రోజున ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు వాటిని జాగ్రత్తగా దాచిపెట్టాలి. ఈ కీలకమైన డైరీలు, రిజిస్టర్లు కొన్ని మిస్సైనట్లు ప్రచారం జరుగుతోంది. దానికి బలాన్ని చేకూర్చేలా ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో పీఓ, ఏపీఓలుగా బాధ్యతలు నిర్వహించిన వారిలో కొందరికి ఎన్నికల అధికారులు ఫోన్లు చేసి ఆ వివరాలు మీరేమైనా ఫోన్లో ఫొటో తీసుకుని పెట్టుకుంటే తమకు వాట్సాప్‌లో షేర్‌ చేయాలని కోరడం ఉద్యోగుల్లో చర్చనీయాంశమవుతోంది. డైరీలు, రిజిస్టర్లు పోవడం వల్లే వాటిని తిరిగి సేకరిస్తున్నారని తెలుస్తోంది. పోలింగ్‌ ముగిసిన తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలించి, సీలు వేయడానికి కూడా చాలా జాప్యం జరిగింది. అప్పట్లోనే దీనిపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. మిగిలిన నియోజకవర్గాల నుంచి చాలా ముందుగా వచ్చాయని, పొన్నూరు బాగా ఆలస్యమైందని ఉన్నతాధికారులు సైతం కోపగించుకున్నారు.

నమోదయ్యే అంశాలివే..

ప్రతి పోలింగ్‌ బూత్‌లో ఎన్ని ఓట్లు పోలయ్యాయి? అందులో స్త్రీ, పురుషులు ఎంత మంది ఓట్లు వేశారు, ఎవరైనా తన ఓటు వీవీప్యాట్‌లో కనిపించలేదని తాను ఒక గుర్తుకు వేస్తే మరో గుర్తు కనిపించిందని హడావుడి చేసి తిరిగి టెండర్‌ ఓటు కోరినా, తన ఓటు ఎవరో ఇతరులు వేశారని అభ్యంతరాలు వ్యక్తం చేసినా వారికి ఏజెంట్ల సమక్షంలో టెండర్‌ ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. ఆ ఓట్లకు కేవలం బ్యాలట్‌ పేపరు మాత్రమే వాడతారు. ఇలా ఎవరైనా ఓటు వేసి ఉంటే ఆ వివరాలను డైరీలో నమోదు చేస్తారు. ఈవీఎంలు మొరాయించి తిరిగి అవి ఎప్పుడు పునరుద్ధరణకు నోచుకున్నాయి, ఎంతసేపు పోలింగ్‌ ఆగిపోయింది, కొత్త మిషన్లు ఏమైనా మార్చారా, పోలింగ్‌ బూత్‌లలో ఎక్కడైనా అల్లర్లు, గొడవలు జరిగాయా.. ఆ కారణంగా పోలింగ్‌ ప్రక్రియ నిలిచినా నమోదు చేస్తారు. గంటల వారీగా నమోదైన పోల్‌ పర్సంటేజీ వివరాలు అందులో ఉంటాయి. ఈ వివరాలన్నీ వాస్తవమేనని ఆ రోజున పోలింగ్‌బూత్‌లలో ఉన్న ఏజెంట్ల సంతకాలు తీసుకుని వారికి ఈ వివరాలతో కూడిన నకలు అందజేస్తారు.

సమాచారం సరిపోలాక కౌంటింగ్‌..

కౌంటింగ్‌ నిర్వహణ రోజున ఆర్వో, ఏజెంట్ల వద్ద ఉన్న సమాచారం రెండూ ఒక్కటేనని నిర్ధారించుకుని కౌంటింగ్‌ ప్రక్రియను ప్రారంభిస్తారు. ఇలాంటి కీలకమైన డైరీలు, 17 సీ రిజిస్టర్లు మిస్‌ కావడం వల్లే ముందుగా మేల్కొని అధికారులు వాటిని పీఓ, ఏపీఓల నుంచి సేకరించుకునే పనిలో పడినట్లు సమాచారం. పలువురు పీఓ, ఏపీఓలు తమకు ఫోన్లు చేసి ఆ సమాచారం వివరాలు ఫోన్‌లో ఉంటే ఫొటో పెట్టాలని కోరుతున్నారని ‘ఈనాడు’కు తెలిపారు. 17సీ రిజిస్టర్‌లో పోలింగ్‌ స్టేషన్‌ నంబరు, మాక్‌ పోలింగ్‌ వివరాలు ఎన్ని గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది, టెండర్‌ ఓటు ఇచ్చేటప్పుడు సదరు ఓటరుకు పెట్టిన కండీషన్లు ప్రతిదీ అందులో నమోదు చేస్తామని పీఓలు చెప్పారు. ప్రస్తుతం ఆ వివరాలు పంపాలని వారిని కోరడం అనుమానాలకు తావిస్తోంది. తామిప్పుడు ఈ ఫొటో కాపీ పంపితే ఏమైనా ఇబ్బంది అవుతుందా అని ఆందోళన చెందాల్సి వస్తోందని పీఓ ఒకరు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని