logo

అక్రమం చూస్తారా... అడ్డుకట్ట వేస్తారా?

కొల్లిపర మండల పరిధిలోని వల్లభాపురం, మున్నంగి, కొత్తపాలెం, బొమ్మువానిపాలెం, అన్నవరం తదితర గ్రామాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. కోర్టు ఉత్తర్వులను సైతం గుత్తేదారులు లెక్కచేయడం లేదు. భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు నిర్వహిస్తూ టన్నుల కొద్దీ తరలిస్తున్నారు.

Updated : 18 May 2024 05:39 IST

ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు కన్నెర్ర
కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు
ఈనాడు, గుంటూరు, న్యూస్‌టుడే, తాడేపల్లి, కొల్లిపర

కొల్లిపర మండల పరిధిలోని వల్లభాపురం, మున్నంగి, కొత్తపాలెం, బొమ్మువానిపాలెం, అన్నవరం తదితర గ్రామాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. కోర్టు ఉత్తర్వులను సైతం గుత్తేదారులు లెక్కచేయడం లేదు. భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు నిర్వహిస్తూ టన్నుల కొద్దీ తరలిస్తున్నారు. తవ్వకాలకు పగలు రాత్రీ తేడాలేదు. ఇసుక తవ్వకాల కోసం నిశిరాత్రి వేళ భారీ యంత్రాలు చేస్తున్న శబ్దాలు లంక గ్రామాల ప్రజలను కలచివేస్తున్నాయి. పరిపాలించాల్సిన నేతలే దోపిడీకి పాల్పడుతున్న తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. పాతకాలపు వంతెనలు కుంగిపోతున్నాయి. రహదారులు గుంతలమయంగా మారాయి.

తాడేపల్లి మండలం గుండిమెడ ఇసుక క్వారీ నుంచి కళ్లెదుటే భారీగా ఇసుక తరలిస్తూ అందిన మేరకు దోపిడీకి పాల్పడుతున్నా అధికారులెవరూ కన్నెత్తి చూడడం లేదు. ఎన్జీటీ, సుప్రీం కోర్టు చెప్పిన తరువాత కూడా గురువారం రాత్రి 11 గంటల వరకు తవ్వకాలను కొనసాగించారు. లక్షల టన్నుల ఇసుక తవ్వి అక్రమంగా తరలించుకుపోయారు. నదికి వరదలు వస్తే తవ్వకాలు చేయడం సాధ్యపడదనే ఉద్దేశంతో లక్షల టన్నుల ఇసుకను క్వారీ వద్ద నిల్వ చేశారు. సీఎం నివాసానికి కేవలం 10 కి.మీ దూరంలో సాగుతున్న అక్రమం ఇది.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎన్జీటీ తీర్పును ఉల్లంఘిస్తూ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అక్రమ తవ్వకాలపై ఫిర్యాదు చేసినవారిపై దాడులకు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రతి జిల్లాలో పోలీసులు, వివిధ శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి ఎన్జీటీ తీర్పునకు విరుద్ధంగా జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలను ఆపే బాధ్యత తీసుకోవాలని ఆదేశించింది. కమిటీ క్రమం తప్పకుండా పర్యటించి అక్రమ తవ్వకాలు జరగకుండా చూడాలని సూచించింది. కమిటీలో సభ్యులైన కలెక్టర్లు, ఇతర అధికారులు సుప్రీంకోర్టు నియమించిన అధికారుల్లా విధులు నిర్వర్తించాలని ఆదేశించింది. ఎన్జీటీ తీర్పును యథాతథంగా అమలు చేసే బాధ్యత తీసుకోవాలని, ఈ విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలని ఆదేశించింది. జిల్లాలో ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడంతోపాటు ఒక టోల్‌ప్రీ నంబరు, ఈ-మెయిల్‌ ఐడీ ఏర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరించాలని సూచించింది. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన అధికారులను తీవ్రంగా పరిగణిస్తామని సుప్రీంకోర్టు హెచ్చరిస్తూ కోర్టు ధిక్కరణతోపాటు ఇతర చర్యలకు బాధ్యులవుతారని పేర్కొంది. కేంద్ర పర్యావరణ అటవీశాఖ అధికారి ఇచ్చిన ప్రాంతాల్లో కలెక్టర్లు వెంటనే పరిశీలించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

రీచ్‌లలో ఏం జరుగు తోంది?

పల్నాడు జిల్లాలో అచ్చంపేట, అమరావతి, గుంటూరు జిల్లాలో తుళ్లూరు, తాడేపల్లి, దుగ్గిరాల, కొల్లిపర, బాపట్ల జిల్లాలో కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె మండలాల పరిధిలో కృష్ణానదిలో ఇసుక రీచ్‌లు ఉన్నాయి. గత ఐదేళ్లుగా ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగాయి. మార్చి నెలలో ఎన్జీటీ తీర్పు నేపథ్యంలో జిల్లా కలెక్టర్ల పరిశీలన సమయంలో రెండు రోజులు తవ్వకాలు ఆగాయి. ఆ తర్వాత మళ్లీ యథాతథంగా కొనసాగాయి. వీటిపై వరుస ఫిర్యాదులతో కొన్నాళ్లు ఆగాయి. ఈక్రమంలో ఉమ్మడి జిల్లాలో కొన్ని రీచ్‌లలో కూలీల చేత ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇచ్చారు. ఎన్జీటీ మార్గదర్శకాలకు విరుద్ధంగా భారీ యంత్రాలను పెట్టి నదిలో భూగర్భ జలాలు వచ్చేవరకు అత్యంత లోతుకు తవ్వకాలు చేస్తున్నారు. ఈనెల 12వ తేదీ వరకు ఇసుక రీచ్‌లలో రాత్రి పగలు తవ్వకాలు జరిగాయి. నిత్యం వందల లారీల్లో ఇసుక తరలించి సొమ్ము చేసుకున్నారు. నిబంధనలకు నీళ్లొదిలి గుత్తేదారు యథేచ్ఛగా ఇసుక తవ్వి తరలిస్తున్నా యంత్రాంగం కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. నదీ తీర గ్రామాల ప్రజలు అక్రమ తవ్వకాలతో భూగర్భజలాలు అడుగంటి తాగునీటి పథకాలకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన చేస్తే ఇసుకాసురులు వారిపై దాడి చేశారు. అప్పుడు కూడా పోలీసులు, అధికారులు ఇసుకమాఫియాపై చర్యలు తీసుకోలేదు. ఇదే అదనుగా ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేసి సొమ్ము చేసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈనెల 12వ తేదీ నుంచి అన్ని రీచ్‌లలో ఇసుక తవ్వకాలు నిలిపేశారు.

తవ్వకాల వెనుక వైకాపా నేతలు..

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇసుక తవ్వకాలకు అనుమతి పొందిన గుత్తేదారుకు స్థానిక వైకాపా నేతలు అండదండలు అందించి లబ్ధి పొందుతున్నారు. గుత్తేదారుకు అండగా ఉన్నందున నేతలకు ఇసుక తక్కువ ధరకు అమ్మడం, లారీ వచ్చిన వెంటనే లోడ్‌ చేయడం ద్వారా లబ్ధి కలిగేలా చూశారు. ఇందుకు ప్రతిఫలంగా నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేసినా స్థానికులు ఎవరూ అడ్డుకోకుండా వైకాపా నేతలు అండగా నిలిచారు. రెవెన్యూ, పోలీసు, భూగర్భగనులశాఖ అధికారుల నుంచి అడ్డంకులు లేకుండా నాయకులే చక్కబెట్టారు. ఇసుక అక్రమ రవాణాకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్నందుకు వైకాపా ప్రజాప్రతినిధులు భారీస్థాయిలో సొమ్ము చేసుకున్నారు. అటు ఇసుక గుత్తేదారుకు, ఇటు ప్రజాప్రతినిధులకు లబ్ధి చేకూరుతుండటంతో సహజ వనరులను యథేచ్ఛగా కొల్లగొట్టారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా యథాతథంగా ఇసుక రవాణా కొనసాగింది. సుప్రీంకోర్టు నేపథ్యంలో ప్రస్తుతానికి తవ్వకాలు నిలిపేశారు. ఇంతటితో ఇసుక తవ్వకాలకు అడ్డుకట్ట పడుతుందా? కొన్నాళ్ల తర్వాత మళ్లీ యథాతథంగా తవ్వకాలు చేస్తారా? అని నదీతీర గ్రామాల ప్రజలు ఒకింత ఆందోళన చెందుతున్నారు. జిల్లా కలెక్టర్ల పరిశీలన, కమిటీ ఏర్పాటుతో నిర్మాణాత్మక చర్యలు తీసుకుని అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేస్తారని పర్యావరణవేత్తలు ఆశాభావంతో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని