logo

అడిగినవి ఇవ్వకుండా.. పనుల పూర్తి ఎలా?

పాఠశాలల్లో నాడు-నేడు కింద చేపట్టిన భవనాలు, అదనపు తరగతి గదుల నిర్మాణాలను ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదంటూ ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారులు, సమగ్రశిక్షా అదనపు సమన్వయకర్తలకు మెమోలిచ్చింది.

Published : 20 May 2024 05:20 IST

ప్రధానోపాధ్యాయులపై తీవ్ర ఒత్తిళ్లు
నాడు-నేడు అసంపూర్తి నిర్మాణాలపై నోటీసులు

అడవితక్కెళ్లపాడు పాఠశాలలో నిలిచిన పనులు 

ఈనాడు-అమరావతి: పాఠశాలల్లో నాడు-నేడు కింద చేపట్టిన భవనాలు, అదనపు తరగతి గదుల నిర్మాణాలను ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదంటూ ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారులు, సమగ్రశిక్షా అదనపు సమన్వయకర్తలకు మెమోలిచ్చింది. దీంతో వారు హడావుడిగా నెలాఖరిలోపు అసంపూర్తి పనుల్ని పూర్తి చేయాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. అయితే నిర్మాణాలు పూర్తి చేయాలంటే అవసరమైన ఇసుక, ఇతర సామగ్రి సరఫరా చేయాలని, అవేమి ఇవ్వకుండా పూర్తి చేయమంటే ఎలా అని పలువురు ప్రధానోపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. పనుల నిర్వహణకు ఇసుక, సిమెంటు, సెంట్రల్‌ ప్రొక్యూర్‌మెంట్‌ కింద కిటికీలు, దర్వాజాలు, ఎలక్ట్రికల్‌ సామగ్రి సరఫరా చేయాలి. ప్రస్తుతం సిమెంటు తప్ప మిగిలినవి పంపడం లేదు. ఇసుకను స్థానికంగా సమకూర్చుకోమంటున్నారు. అయితే ప్రభుత్వం టన్నుకు రూ.500-600కు మించి ఇవ్వదు. ఆ ధరకు బయట మార్కెట్లో లభ్యం కావడం లేదు. రూ.1000 పెడితే టన్ను ఇసుక దొరకని పరిస్థితి. అంత ధర పెట్టి కొనలేక పనులు ప్రారంభించడం లేదని ప్రధానోపాధ్యాయులు అంటున్నారు.

అప్పుడే స్పందించి ఉంటే..

 గతంలో ప్రభుత్వం కొన్ని పాఠశాలలకు స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ ఫండ్‌ కింద పాఠశాల ఖాతాలకు నిధులు పెద్ద మొత్తంలో జమ చేసింది. ఆ మొత్తాన్ని సమీపంలో ఉన్న పాఠశాలలకు కొంత కేటాయించి నాడు-నేడు కింద అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేయాలని మార్చిలో ఆదేశించింది. ఆ తర్వాత ప్రధానోపాధ్యాయులు ఎన్నికల విధుల శిక్షణకు హాజరుకావడం.. పది పరీక్షల నిర్వహణలో ఉండి ఆ పనుల పూర్తిపై దృష్టి పెట్టలేదు. అప్పట్లోనే పనుల పూర్తికి సిమెంటు, ఇసుకతోపాటు సెంట్రల్‌ ప్రొక్యూర్‌మెంట్‌ మెటీరియల్‌ కింద ఇవ్వాల్సిన సామగ్రిని పంపాలని ఇండెంట్లు పెట్టినా సరఫరా చేయలేదు. ఆ సామగ్రి వచ్చి ఉంటే తాజాగా పనులు చేపట్టేందుకు వీలు ఉండేదని ప్రధానోపాధ్యాయవర్గం అంటోంది. ప్రస్తుతం మెటీరియల్‌ లేక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనేలా పనుల తీరు ఉంది.

ఇసుకాసురుల్లో దడ 

ఎన్నికల కోడ్‌ నేపథ్యం.. మరోవైపు ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు ప్రత్యేక కమిటీలను నియమించడంతో అక్రమార్కుల చర్యలకు అడ్డుకట్టపడింది. తవ్వకాలు ఆపేశారు. మరోవైపు సిమెంటు కంపెనీలకు బకాయిలు పేరుకుపోవడంతో సంబంధిత కంపెనీలు సిమెంటు సరఫరాకు ఆ మధ్య ససేమిరా అంటూ పంపలేదు.  వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి పనులు పూర్తి కావాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నారు. ఇసుక, సిమెంటు సకాలంలో సరఫరా చేయకుండా పనులు పూర్తి చేయమంటే ఎలా చేస్తామని హెచ్‌ఎంలు ప్రశ్నిస్తున్నారు.


600 పాఠశాలల్లో అసంపూర్తిగా..

గుంటూరు, పల్నాడు, బాపట్ల మూడు జిల్లాల్లో కలిపి 600కు పైగా పాఠశాలల్లో పనులు అసంపూర్తిగా ఉన్నాయి. కొన్ని స్కూళ్లకు నిధుల లేమి ఉంది. ఇసుక ఆర్డర్‌ పెడితే ఎప్పుడొస్తుందో తెలియడం లేదు. ఇప్పటికే. డీఈఓ, ఏపీసీలకు పనులు పూర్తిచేసి మనబడి-నాడు నేడు సైట్‌లో వివరాలు నమోదు చేయలేదని మెమోలు ఇచ్చారు. ఇటీవల ఎన్నికల క్రతువు ముగియడంతో ప్రస్తుతం ఆ పనులు పూర్తి చేయాలని ఉపాధ్యాయులపై ఒత్తిడి తెస్తున్నారు. భవన నిర్మాణాలకు తాపీ మేస్త్రీల కొరత ఉంది. నిర్దేశిత సమయంలోపు పనులు పూర్తి చేయడానికి వెంటనే మెటీరియల్‌ పంపాలని ప్రధానోపాధ్యాయులు కోరుతున్నారు. ఇంకా కొన్ని పాఠశాలలకు నిధులు ఇవ్వాలి. వాటికి నిధుల లేమి లేకుండా వెంటనే విడుదల చేస్తే పనులు ప్రారంభించేందుకు వెసులుబాటు ఉంటుంది. కొన్ని పాఠశాలల్లో కిటికీలు, దర్వాజాలు బిగిస్తే గదుల నిర్మాణం పూర్తయినట్లు నివేదించొచ్చు. వాటిని అమర్చడానికి ప్రభుత్వం టెక్నీషియన్లను పంపడం లేదు. వారికి నిధులు పెండింగ్‌లో ఉంచడంతో వారు ముందుకు రావడం లేదు. ఇందుకయ్యే ఖర్చును హెచ్‌ఎంలే భరించాల్సి వస్తోంది. ఇన్ని సమస్యల మధ్య అసంపూర్తి నిర్మాణాలు నెలాఖరిలోపు ఎలా పూర్తవుతాయని హెచ్‌ఎంలు ఆందోళన చెందుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని