logo

ఎన్నికలంటే అపహాస్యమా?

ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అత్యంత కీలకమైనవి. పౌరులు తమ ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశాన్ని అర్హులైన ఓటర్లకు ఎన్నికల ద్వారా భాగస్వామ్యం కల్పిస్తారు.

Updated : 26 May 2024 05:12 IST

స్థానిక ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకు దౌర్జన్యాలే
పల్నాడులో విస్తరిస్తున్న విష సంస్కృతి
ప్రజాప్రతినిధులే ప్రత్యక్షంగా విధ్వంసానికి పాల్పడిన వైనం
ఈనాడు, అమరావతి

వీవీప్యాట్‌ను ధ్వంసం చేస్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 

ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అత్యంత కీలకమైనవి. పౌరులు తమ ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశాన్ని అర్హులైన ఓటర్లకు ఎన్నికల ద్వారా భాగస్వామ్యం కల్పిస్తారు. ప్రజలు ఎన్నుకున్న అభ్యర్థే ప్రభుత్వాన్ని నడపడంలో భాగస్వామ్యం అవుతారు. ఇంతటి కీలకమైన ఎన్నికలను పల్నాడు ప్రాంతంలో ప్రజాప్రతినిధులే కాలరాసే పరిస్థితికి వచ్చారు. ప్రధానంగా మాచర్ల నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మాచర్ల మున్సిపాలిటీతోపాటు నియోజకవర్గంలో సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ప్రతిపక్షాల తరఫున అభ్యర్థులను నామినేషన్‌ వేయకుండా అడ్డుకుని అన్నీ ఏకగ్రీవంగా వైకాపాకు వచ్చేలా చేయడానికి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బరితెగించారు. ఇందుకు అప్పట్లో పని చేసిన పోలీసులు అన్నివిధాలా సహాయ సహకారాలు అందించి తమవంతు పాత్ర పోషించారు. తెలుగుదేశం అభ్యర్థులకు అండగా ఉండి నామినేషన్‌ వేయించడానికి వెళ్లిన తెదేపా నాయకులపై మాచర్ల పట్టణంలోనే వారి వాహనంపై దాడి చేసి భయానక పరిస్థితి సృష్టించారు.

ఏజెంట్లను భయపెట్టి.. ఈవీఎంలను పగలగొట్టి..

పల్నాడులో స్థానికసంస్థల ఎన్నికల్లో మొదలైన సంస్కృతిని సార్వత్రిక ఎన్నికల్లోనూ కొనసాగించాలని పిన్నెల్లి సోదరులు చేయని ప్రయత్నం లేదు. సార్వత్రిక ఎన్నికల్లోనూ అధికార పార్టీకి భయపడి ఓట్లు వేయకపోతే విష సంస్కృతి ఇంకా పెచ్చరిల్లే ప్రమాదముందని ప్రజలు తెగబడి ధైర్యంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఒకవైపు పిన్నెల్లి సోదరులు, వారి అనుచరులు హెచ్చరికలు చేస్తున్నా తెదేపా ఏజెంట్లు ధైర్యంగా బూత్‌ల్లో కూర్చొగా ఓటర్లు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ పరిస్థితిని జీర్ణించుకోలేని పిన్నెల్లి సోదరులు దాడులకు తెగబడి దొరికినవారిని దొరికినట్లు చితకబాదారు. ఏజెంట్లను భయపెట్టినా వారు పోలింగ్‌ బూత్‌ వదిలి బయటకు రాకపోవడంతో వారి ఇళ్లకెళ్లి కుటుంబసభ్యులపై దాడి చేసి భయానక వాతావరణం సృష్టించారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం వంటిదని తెలిసినా నిరంకుశత్వంతో తాము మాత్రమే అధికారంలో ఉండాలన్న లక్ష్యంతో ప్రత్యర్థుల పతనమే ధ్యేయంగా ఐదేళ్లపాటు సాగిన ఆరాచకానికి ఓటు అనే ఆయుధం ప్రయోగించేందుకు ప్రజలు పోటెత్తారు. అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లోనూ 80 శాతం మందికిపైగా ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోవడమే ఓటర్ల వచ్చిన తెగువకు కారణమని స్థానికులు చెబుతున్నారు. దీనిని జీర్ణించుకోలేని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి స్వయంగా ఈవీఎం ధ్వంసం చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. 2021లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పల్నాడులో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. అప్పట్లో తెదేపా నేతలపై దాడికి పాల్పడిన తురకా కిషోర్‌కు మాచర్ల మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవి అప్పగించడాన్ని గుర్తుచేసుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని