logo

ప్రభుత్వ నిర్ణయం.. రొయ్యకు ప్రాణసంకటం

పెట్రోలు బంకుల్లో వాహనాలకు తప్ప విడిగా పెట్రోలు, డీజిల్‌ విక్రయించరాదన్న ఎన్నికల అధికారుల ఆదేశాలు ఆక్వా రైతులను ఆపదలోకి నెట్టాయి.

Updated : 26 May 2024 05:13 IST

ఎన్నికల అధికారుల ఆదేశాలే కారణం
క్యాన్లలో డీజిల్‌ పోయనిపెట్రోలు బంకు నిర్వాహకులు
జనరేటర్లు తిరగక రైతుకు తీరని నష్టం
బాపట్ల, న్యూస్‌టుడే

పెట్రోలు బంకుల్లో వాహనాలకు తప్ప విడిగా పెట్రోలు, డీజిల్‌ విక్రయించరాదన్న ఎన్నికల అధికారుల ఆదేశాలు ఆక్వా రైతులను ఆపదలోకి నెట్టాయి. కరెంటు కోతలు, సరఫరాకు అంతరాయంతో చెరువుల్లో ఏరియేటర్లు తిప్పి రొయ్యలకు ఆక్సిజన్‌ అందించడానికి జనరేటర్లు నడపడానికి డీజిల్‌ కావాల్సి ఉంది. ఎన్నికల అధికారుల ఆదేశాలు చూపి ఆక్వా రైతులకు పెట్రోలు బంకు నిర్వాహకులు క్యాన్లలో డీజిల్‌ పోయడం లేదు. ఏరియేటర్లు తిప్పకపోతే రొయ్యలు చనిపోతాయని జనరేటర్‌ నడపడానికి క్యాన్లలో డీజిల్‌ పోయాలని కోరుతున్నా జిల్లా అధికారుల ఆదేశాలు ఉంటేనే ఇస్తామని స్పష్టం చేస్తున్నారు. దీంతో ఆక్వా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కర్లపాలెం మండలంలో రెండ్రోజుల క్రితం కరెంటు సరఫరా లేక ఆక్సిజన్‌ అందక రొయ్యలు నీటిపై తేలడంతో తక్కువ ధరకు విక్రయించాల్సి వచ్చి సాగుదారులు నష్టపోయారు.

రొయ్యల చెరువు వద్ద వినియోగించే జనరేటర్‌ ఇదే..

జిల్లాలో తీర ప్రాంత మండలాలు రేపల్లె, నిజాంపట్నం, నగరం, పిట్టలవానిపాలెం, కర్లపాలెం, బాపట్ల, చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల్లో 22 వేల ఎకరాల్లో రొయ్యల చెరువులు ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు మేతలు వేసి విరామం ఇచ్చే సమయంలో తప్ప చెరువుల్లోని రొయ్యలకు ఏరియేటర్ల ద్వారా ఆక్సిజన్‌ అందిస్తారు. రాత్రి పూర్తిగా ఏరియేటర్లు తిప్పుతారు. కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడితే ఏరియేటర్లు తిప్పటానికి డీజిల్‌ జనరేటర్లు వినియోగిస్తున్నారు. ఏరియేటర్లకు కొద్ది సమయం ఆపిన రొయ్యలు చనిపోతాయి. ప్రస్తుతం గాలి వానతో విద్యుత్తు సరఫరాకు తరచుగా అంతరాయం ఏర్పడుతోంది. దీంతో డీజిల్‌ జనరేటర్లు ఆడించి చెరువుల్లో ఏరియేటర్లు తప్పనిసరిగా తిప్పి రొయ్యలకు ఆక్సిజన్‌ అందిస్తేనే బతుకుతాయి.
ఇలాగైతే.. అయినకాడికి అమ్ముకోవాల్సిందే..: ఎన్నికల అనంతరం, ఓట్ల లెక్కింపు తర్వాత ఘర్షణలు తలెత్తకుండా నివారణ చర్యల్లో భాగంగా అంటూ పెట్రోలు బంకుల్లో వాహనాలకు తప్ప విడిగా పెట్రోలు, డీజిల్‌ విక్రయించరాదని పెట్రోలు బంకు నిర్వాహకులను జిల్లా ఎన్నికల అధికారి ఆదేశించారు. ఈ ఆదేశాలు అమలులో భాగంగా ఆక్వా రైతులకు క్యాన్లలో రెండ్రోజుల నుంచి బంకు నిర్వాహకులు డీజిల్‌ పోయడం లేదు. జిల్లా అధికారుల నుంచి ఆదేశాలు వస్తేనే డీజిల్‌ పోస్తామని చెప్పడంతో ఆందోళనకు గురయ్యారు. కర్లపాలెం మండలంలో రెండ్రోజుల క్రితం విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. జనరేటర్‌ వేయడానికి డీజిల్‌ లేకపోవడంతో ఏరియేటర్లు తిరగక ఆక్సిజన్‌ అందక రెండు చెరువుల్లో రొయ్యలు నీటిపైకి వచ్చి తేలాడాయి. రైతులు తక్కువ ధరకు రైతులు విక్రయించి నష్టపోయారు. సమస్య పగలు రావడంతో చూసి వెంటనే విక్రయించుకుని తక్కువ నష్టంతో బయటపడ్డారు. అదే అర్ధరాత్రి సమయంలో సమస్య వస్తే ఉదయానికి మొత్తం రొయ్యలు చనిపోయి విక్రయించటానికి కూడా అవకాశం ఉండక రూ.లక్షల్లో నష్టపోవాల్సి వచ్చేది. బహుళ అంతస్థుల భవనాలు, వాణిజ్య భవనాల్లో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడితే జనరేటర్లు వేసి లిఫ్టులు నడపటానికి డీజిల్‌ కావాలి. వీరు సైతం డీజిల్‌ లభించక ఇబ్బంది పడుతున్నారు.

రూ.లక్షల్లో నష్టపోవాల్సి వస్తుంది

జనరేటర్లు నడపడానికి ఆక్వా చెరువులకు డీజిల్‌ కావాలి. పెట్రోలు బంకుల్లో క్యాన్లలో డీజిల్‌ విక్రయించకుండా విధించిన ఆంక్షల నుంచి ఆక్వా రైతులకు మినహాయింపు ఇవ్వాలి. లేకుంటే అత్యవసరంగా జనరేటర్‌ వేయక ఏరియేటర్లు చెరువులో తిరగకపోతే రొయ్యలు చనిపోయి రూ.లక్షల్లో నష్టపోవాల్సి వస్తుంది.

 శరత్, ఆక్వా రైతు

గుర్తింపు పత్రం చూపిస్తే డీజిల్‌ పోసేలా చర్యలు

ఆక్వా రైతులు సాగుకు సంబంధించి మత్స్యశాఖ జారీ చేసిన లైసెన్స్‌ గుర్తింపు పత్రం పెట్రోలు బంకుల్లో చూపిస్తే క్యాన్లలో డీజిల్‌ పోసేలా చర్యలు తీసుకుంటాం. మత్స్యశాఖ జేడీ ద్వారా బంకుల నిర్వాహకులకు ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేయిస్తాం. ఆక్వా రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తాం.

 రంజిత్‌బాషా, జిల్లా ఎన్నికల  అధికారి, కలెక్టర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని