logo

గుంటూరు టౌన్‌ ప్లానింగ్‌లో అంతులేని అవినీతి

‘రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గుంటూరు నగరపాలక సంస్థలో ప్రత్యేక రాజ్యాంగం నడుస్తోంది. పట్టణ ప్రణాళికలో అంతులేని అవినీతి, అక్రమ వసూళ్లు రాజ్యమేలుతున్నాయి.

Updated : 12 Jun 2024 05:45 IST

కమిషనర్, సిటీ ప్లానర్, డిప్యూటీ, అసిస్టెంట్ సిటీ ప్లానర్స్‌పై కేసు నమోదు చేయాలి

మాట్లాడుతున్న నాగవంశీ, పక్కన మామిడి సీతారామయ్య, తదితరులు

పట్టాభిపురం(గుంటూరు), న్యూస్‌టుడే: ‘రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గుంటూరు నగరపాలక సంస్థలో ప్రత్యేక రాజ్యాంగం నడుస్తోంది. పట్టణ ప్రణాళికలో అంతులేని అవినీతి, అక్రమ వసూళ్లు రాజ్యమేలుతున్నాయి. భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేందుకు తీవ్ర జాప్యం చేస్తున్నారు. అయిదేళ్లలో నరకయాతన పడ్డాం. కమిషనర్‌ చేకూరి కీర్తి, సిటీ ప్లానర్‌ ప్రదీప్, డిప్యూటీ సిటీ ప్లానర్‌ మహాపాత్ర, అసిస్టెంట్ సిటీ ప్లానర్స్‌ మురళి, అజయ్‌కుమార్‌లు చేసిన అవినీతిపై పోలీసు కేసు పెడ్తాం. అనిశా, సీఐడీ, విజిలెన్స్‌ విభాగాలతో విచారణ జరిపించి నూతన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’.. అని నారెడ్కో, క్రెడాయ్‌ సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. గుంటూరులోని ఓ హోటల్‌లో మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో నారెడ్కో జిల్లా అధ్యక్షుడు నాగవంశీ మాట్లాడారు. ‘భవన నిర్మాణం పూర్తయ్యాక మార్ట్‌గేజ్‌ కోసం కార్పొరేషన్‌ నుంచి పూర్తి స్థాయిలో అనుమతి తీసుకోవాలంటే ఏడెనిమిది నెలల నుంచి సంవత్సరం వరకు పడుతుంది. ఈ పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడా లేదు. సీఆర్‌డీఏ నిబంధనల ద్వారా ఆక్యుపెన్సీ ఇచ్చినప్పుడే మార్ట్‌గేజ్‌ ఇవ్వాలి. ఆక్యుపెన్సీ ఇచ్చి మార్ట్‌గేజ్‌ ఇవ్వనివి 80 శాతం వరకు ఉన్నాయి. కార్పొరేషన్‌లోని టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో జరిగిన అవినీతిపై సీఐడీ, ఏసీబీ విజిలెన్స్‌ శాఖలతో విచారణ జరిపించాలి’.. అని డిమాండ్‌ చేశారు. 

కమీషన్లు లేనిదే ఏపనీ చేయడంలేదు..

నారెడ్కో ప్రధాన కార్యదర్శి మామిడి సీతారామయ్య మాట్లాడుతూ ‘బిల్డర్లు పలు ఇబ్బందులు పడుతున్నారు. కమిషనర్‌గా కీర్తి వచ్చాక పూర్తిగా గాడి తప్పింది. కార్పొరేషన్‌లో అధికారులు కమీషన్‌ లేనిదే ఏ పనీ చేయడం లేదు. ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నా అదనంగా ముడుపులు ఇవ్వాల్సి వస్తోంది. అధికారులు, సిబ్బందిపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేస్తాం’.. అన్నారు. క్రెడాయ్‌ అధ్యక్షుడు మామిడి రామారావు మాట్లాడుతూ అయిదేళ్లుగా మేము ఎన్నో అవమానాలకు గురయ్యామని, డబ్బులిచ్చినా పనులు చేయలేదన్నారు. టౌన్‌ ప్లానింగ్‌ విభాగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని డిమాండ్‌ చేశారు.

కోట్లు నష్టపోయాం: నారెడ్కో ఉపాధ్యక్షుడు యాగంటి దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ ‘కమిషనర్‌ కీర్తి ఐఏఎస్‌కు అనర్హురాలు. అధికారులు అవినీతికి పాల్పడుతున్నా, అనుమతుల్లో జాప్యం చేస్తున్నా అసలు పట్టించుకోలేదు. అధికారుల అవినీతిలో ఆమెకు భాగస్వామ్యం ఉంది. రూ. కోట్లు నష్టపోయాం. అధికారుల అవినీతిపై హైకోర్టులో కేసులు వేస్తాం’.. అన్నారు. సభ్యులు పిడికిటి మల్లికార్జునరావు మాట్లాడుతూ ‘సమస్యల్ని పలుమార్లు కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. మా దస్త్రాలు నెలల తరబడి తొక్కిపెట్టారు. దీనిపై న్యాయపోరాటం చేస్తాం. పలకలూరు రోడ్డు నిర్మాణంలో జాప్యం చేయడంతో ఎంతో నష్టపోయాం. అవినీతి అధికారులు పైరవీలు చేసి ఇక్కడే ఉండాలని ప్రయత్నిస్తున్నారు. పూర్తిగా ప్రక్షాళన చేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు’.. అని స్పష్టం చేశారు. సమావేశంలో దాసరి శ్రీనివాసరావు, సతీష్‌రెడ్డి పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని