logo

పల్నాడుకు దక్కని మంత్రి పదవి

పల్నాడు జిల్లాలో లోక్‌సభ స్థానంతోపాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెదేపా జయకేతనం ఎగురవేసింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా అన్ని నియోజకవర్గాల్లో రికార్డు మెజారిటీతో అభ్యర్థులు విజయం సాధించారు.

Published : 13 Jun 2024 05:37 IST

ఆశావహులైన సీనియర్లలో నిరాశ

ఈనాడు, అమరావతి : పల్నాడు జిల్లాలో లోక్‌సభ స్థానంతోపాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెదేపా జయకేతనం ఎగురవేసింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా అన్ని నియోజకవర్గాల్లో రికార్డు మెజారిటీతో అభ్యర్థులు విజయం సాధించారు. వైకాపా పాలనలో పల్నాడు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఐదేళ్లపాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈనేపథ్యంలో కూటమి అధికారంలోకి రావడంతో జిల్లాలో సీనియర్‌ నేతలు మంత్రివర్గంలో పల్నాడు నుంచి ప్రాతినిధ్యం ఉంటుందన్న ఆశాభావంతో ఉన్నారు. అయితే పల్నాడు జిల్లా నుంచి ఒక్కరికీ మంత్రి పదవి దక్కకపోవడంతో సీనియర్లు నిరాశ చెందారు. ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రాతిపదికన, సామాజిక సమీకరణలు పరిగణనలోకి తీసుకోవడంతో పల్నాడుకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దక్కలేదు. సత్తెనపల్లి నుంచి గెలిచిన సీనియర్‌ నేత కన్నా లక్ష్మీనారాయణ, గురజాల నుంచి గెలిచిన యరపతినేని శ్రీనివాసరావు, వినుకొండ నుంచి విజయం సాధించిన జీవీ ఆంజనేయులు ఈసారి మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని భావించారు. మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని దీటుగా ఎదుర్కొని ఓడించిన జూలకంటి బ్రహ్మారెడ్డి ఆశావహుల జాబితాలో ఉన్నారు. అయితే వివిధ సమీకరణలను పరిగణనలోకి తీసుకున్న అధిష్ఠానం పల్నాడుకు ప్రాతినిధ్యం కల్పించలేకపోయింది. 

గుంటూరు జిల్లాలో పొన్నూరు నుంచి ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ ఈసారి మంత్రివర్గంలో స్థానం ఉంటుందని గట్టిగా ఆశించారు. జిల్లా నుంచి నారా లోకేష్, నాదెండ్ల మనోహర్‌కు మంత్రి పదవులు దక్కడంతో ఆయనకు అవకాశం కల్పించలేకపోయారు. బాపట్ల జిల్లాలో వేమూరు నుంచి గెలిచిన నక్కా ఆనందబాబు గత తెదేపా ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఈసారి కూడా పార్టీ అవకాశం ఇస్తుందని భావించారు. కొండేపి నుంచి గెలుపొందిన డోలా బాల వీరాంజనేయస్వామికి మంత్రివర్గంలో స్థానం దక్కడంతో ఆనందబాబుకు ఇవ్వలేకపోయారు. పర్చూరు నుంచి మూడుసార్లు వరుసగా గెలిచి హ్యాట్రిక్‌ సాధించిన ఏలూరు సాంబశివరావు బాపట్ల జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సేవలు అందించడంతోపాటు పార్టీ కష్టకాలంలోనూ అండగా ఉన్నందున మంత్రి పదవి ఆశించారు. జిల్లాలో అద్దంకి నియోజకవర్గం నుంచి గెలుపొందిన గొట్టిపాటి రవికుమార్‌కు అవకాశం ఇవ్వడంతో సాంబశివరావుకు స్థానం దక్కలేదు. మంగళవారం అర్ధరాత్రి వరకు జాబితాలో పేరు ఉంటుందా? లేదా? అన్న మీమాంసతో ఉత్కంఠగా ఎదురుచూశారు. అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత జాబితా బహిర్గతం కావడంతో ఆశావహులు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. అయితే మంత్రివర్గంలో ఇంకా ఒకరికి అవకాశం కల్పించే వెసులుబాటు ఉండటంతో ఎవరికివారు ఆశాభావంతో ఉన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని