logo

విద్యార్థులకు ‘నాడు-నేడు’ కష్టాలు

‘నాడు-నేడు’ కింద పాఠశాలల దశాదిశా మార్చేశాం అని గొప్పలు చెప్పిన వైకాపా ప్రభుత్వం వల్ల నేడు విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు.

Published : 13 Jun 2024 05:48 IST

చాలాచోట్ల అసంపూర్తిగా గదుల నిర్మాణం

పాఠశాలల పునఃప్రారంభ వేళ తప్పని అవస్థలు 

చిలకలూరిపేట బీఆర్‌ఐజీ పురపాలక ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం ఇలా.. 

ఈనాడు డిజిటల్, నరసరావుపేట: ‘నాడు-నేడు’ కింద పాఠశాలల దశాదిశా మార్చేశాం అని గొప్పలు చెప్పిన వైకాపా ప్రభుత్వం వల్ల నేడు విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. మొదటిదశలో కొన్ని పాఠశాలలకు బల్లలు, పెయింట్స్, మరుగుదొడ్లు నిర్మించిన గత ప్రభుత్వం రెండో ఫేజ్‌కు వచ్చేసరికి చేతులెత్తేసింది. ప్రారంభించి పూర్తి చేస్తామని గడువుల మీద గడువులు విధించి చివరకు ప్రభుత్వమే మారిపోయినా పనులు మాత్రం పూర్తికాలేదు. కొన్నిచోట్ల శ్లాబుల దశలో, మరికొన్నిచోట్ల ప్లాస్టింగ్‌ దశలో, ఇంకొన్నిచోట్ల పెయింటింగ్‌ దశలో నిధుల కొరతతో ఆగిపోయాయి. గురువారం పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న వేళ విద్యార్థులకు కష్టాలు స్వాగతం పలుకుతున్నాయి. 

 ఇసుక కొరతతో..

2022 జూన్‌లో ‘నాడు-నేడు’ రెండో విడత పనులు ప్రారంభించారు. 2023 మే నాటికి పూర్తి చేయాలని గడువు విధించారు. కానీ రెండు సంవత్సరాలు పూర్తైనా నేటికీ పనులు పూర్తికాలేదు. పనులు పూర్తికాకపోవడానికి ప్రధానంగా ఇసుక, నిధుల కొరత కారణమని తెలుస్తోంది. ఇసుక ఉన్నప్పుడు నిధులు మంజూరు కాలేదు. నిధులు ఉన్నప్పుడేమో ఇసుక రాలేదని అధికారులు చెబుతున్నారు. జేపీ సంస్థ నుంచి ఇసుక కాంట్రాక్ట్‌ మారినప్పటి నుంచి ఈ ఇసుక కొరత ఇంకా ఎక్కువైందని పేర్కొంటున్నారు. జిల్లాలో అన్ని స్కూళ్లలో జరుగుతున్న పనులకు సంబంధించి మొత్తం ఐదువేల టన్నుల ఇసుక అవసరమని జిల్లా ఉన్నతాధికారులు ఎప్పటినుంచో రాష్ట్రస్థాయి అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. అయితే ఐదువేల టన్నులు ఉన్నట్లు రికార్డుల్లో మాత్రమే చూపిస్తున్నారని, క్షేత్రస్థాయిలో వచ్చేసరికి రెండువేల టన్నుల ఇసుక కూడా లేదని ప్రధానోపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. పనుల కోసం కొన్నిచోట్ల పాఠశాలలకు కొంతమేర ఇసుక సరఫరా చేశారు. కానీ పనులు మొదలుకాలేదు. దీంతో ఉన్న ఇసుక కుప్పలు కరిగిపోయాయి. ‘ఆడుదాం ఆంధ్రా’ సమయంలో ఇసుక మొత్తం క్రీడాకారుల ఆటల వల్ల నేలలో కలిసిపోయిందని సీఆర్పీలు ఉన్నతాధికారులకు సమాధానం చెప్పారు. పైనుంచి ఇసుక రాకపోవడం వల్లే పనులు నడవడం లేదని తెలుస్తోంది.

మరోవైపు నిర్మాణ పనులు పూర్తయిన చోట తలుపులు, కిటికీలు బిగించలేదు. ఇవీ ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. రాకపోవడంతో కొన్నిస్కూళ్లలో అలానే వదిలేశారు. మరికొన్ని స్కూళ్లలో ప్లాస్టింగ్‌ పూర్తిచేశారు. పెయింట్‌ వేస్తే పని పూర్తవుతుంది. కానీ తర్వాత ఏ ప్రభుత్వం వస్తుందో? వచ్చేవారు బిల్లులు ఇస్తారో లేదో? అని గుత్తేదారులు మార్చిలోనే వేయకుండా ఆపేశారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక చాలా బడుల్లో పనులు ఆపేశారు. ముగిశాక ఇటీవల కొన్నిచోట్ల పనులు ప్రారంభించారు. కానీ నత్తనడకన సాగుతున్నాయి. అంతేకాకుండా కొత్త ప్రభుత్వం నాడు-నేడు రెండో విడతపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని గుత్తేదారులు ఎదురుచూస్తున్నారు. కానీ బడుల్లో నిర్మాణ సామగ్రి వల్ల విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగుతోంది. కొన్నిచోట్ల తరగతి గదుల్లో సిమెంట్‌ వంటి సామగ్రి నిల్వ చేశారు. ఇలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే గత విద్యాసంవత్సంలో చాలీచాలని గదుల్లో, చెట్లకింద పాఠాలు విన్నవిద్యార్థులకు ఈసారైనా ఆ కష్టాలు తప్పుతాయని భావించినా ఫలితం లేకుండాపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని