logo

తెలుగు నేల మురవంగా.. చంద్రన్న సేన సగర్వంగా..

Published : 13 Jun 2024 05:52 IST

 అట్టహాసంగా  ప్రమాణ స్వీకారోత్సవం

జిల్లాలో తెరలపై వీక్షించిన జనం

ఈనాడు డిజిటల్, నరసరావుపేట: చంద్రబాబు నాయుడు అను నేను.. అని వినగానే పల్నాడు పరవశించింది.. కొణిదెల పవన్‌ కల్యాణ్‌ అను నేను.. అని తెరపై చూడగానే ఈలలతో మారుమోగింది.. నారా లోకేష్‌ అను నేను అన్నప్పుడు చప్పట్లతో స్వాగతించారు.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఎల్‌ఈడీ తెరలు, టీవీల్లో వీక్షిస్తున్న అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు సంబరాల్లో మునిగితేలారు. ఈ ఘడియల కోసమే అయిదేళ్లుగా ఎదురుచూశామని, జూన్‌ 12ను ఎప్పటికీ మరువబోమని అభిమానులు భావోద్వేగానికి లోనయ్యారు. ఆనందభాష్పాలతో ఉప్పొంగిపోయారు. కల నెరవేరిందని తమ అభిమాన నేతలు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం.. కళ్లారా చూడడం.. ఈ ఉద్విగ్న క్షణాల కోసమే అహర్నిశలు కష్టపడ్డామని తెలుగుదేశం, జనసేన పార్టీ కార్యకర్తలు ఆనందాన్ని పంచుకున్నారు.  

నకరికల్లు మండలం గుండ్లపల్లి నుంచి ప్రమాణ స్వీకారోత్సవానికి తరలుతున్న కార్యకర్తలు 

కృష్ణా జిల్లా గన్నవరం సమీపాన కేసరపల్లిలో బుధవారం చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి జిల్లా ఎమ్మెల్యేలు అయిన కన్నా లక్ష్మీనారాయణ, భాష్యం ప్రవీణ్, యరపతినేని శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు, చదలవాడ అరవిందబాబు, జీవీ ఆంజనేయులు, జూలకంటి బ్రహ్మారెడ్డి ఉదయమే బయలుదేరారు. ట్రాఫిక్‌లో చిక్కుకుని కన్నా లక్ష్మీనారాయణ వేదిక స్థలానికి చేరుకోలేకపోయారు. సమయం మించిపోతుందని ప్రత్తిపాటి పుల్లారావు కారు దిగి ఓ కార్యకర్త ద్విచక్ర వాహనంలో కేసరపల్లికి చేరుకున్నారు. మంత్రివర్గ కూర్పులో సామాజిక సమతూకం పాటిస్తూ, యువతకు ప్రాధాన్యమిస్తూ అందరికీ అవకాశం కల్పించిన చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందని జిల్లా అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. జిల్లాలో అన్ని ప్రధాన పట్టణాల్లో పలుచోట్ల ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేసి సీఎం చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. నరసరావుపేటలో రెండుచోట్ల తెరలు ఏర్పాటు చేశారు. ప్రకాశ్‌నగర్‌లోని భువనచంద్ర టౌన్‌హాల్‌లో జరిగిన ప్రత్యక్ష ప్రసారాన్ని కలెక్టర్‌ శ్రీకేశ్‌ బాలాజీరావు, జేసీ శ్యాంప్రసాద్‌ తదితరులు వీక్షించారు. పదుల సంఖ్యలో ఉద్యోగులు, వందల సంఖ్యలో అభిమానులు పోటెత్తారు. వినుకొండరోడ్డులోని ఓ ప్రయివేటు కల్యాణ మండపంలోనూ మరో తెర ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని ప్రసారం చేశారు. వినుకొండ, గురజాల, పెదకూరపాడు, క్రోసూరు తదితర ప్రాంతాల్లో ఎల్‌ఈడీ తెరల్లో అభిమానులు వీక్షించారు. అనంతరం బాణసంచా కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు.  

క్రోసూరులో కేకు కోస్తూ..  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని