logo

రక్తదానం.. ‘జీవ’నది కావాలి

క్యాన్సర్‌పై అవగాహన.. మధుమేహం, రక్తపోటుపై ప్రజల్లో చైతన్యం.. ఉచిత వైద్య సేవలు, పరీక్షలు, మందుల పంపిణీ.. కొవిడ్‌ సమయంలో బాధితులకు చేయూత వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించిన తెనాలిలోని శారద సర్వీస్‌ సొసైటీ ఈ మారు రక్త ప్రాధాన్యంపై ప్రజలకు సమగ్ర సమాచారం అందించటానికి పూనుకుంది.

Updated : 13 Jun 2024 06:47 IST

రక్తదాతల సమూహం కోసం పుస్తకంలో క్యూఆర్‌ కోడ్‌

తెనాలి శారద సర్వీస్‌ సొసైటీ కృషి ఆదర్శనీయం

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో డాక్టర్‌ శారద, సొసైటీ బృందం 
తెనాలి టౌన్, న్యూస్‌టుడే: క్యాన్సర్‌పై అవగాహన.. మధుమేహం, రక్తపోటుపై ప్రజల్లో చైతన్యం.. ఉచిత వైద్య సేవలు, పరీక్షలు, మందుల పంపిణీ.. కొవిడ్‌ సమయంలో బాధితులకు చేయూత వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించిన తెనాలిలోని శారద సర్వీస్‌ సొసైటీ ఈ మారు రక్త ప్రాధాన్యంపై ప్రజలకు సమగ్ర సమాచారం అందించటానికి పూనుకుంది. ఇందుకు ఆధునిక సాంకేతికను సద్వినియోగం చేసుకుంటూ డాక్టర్‌ శారద రచించిన ‘జీవ’ పుస్తకంలో క్యూఆర్‌ కోడ్‌ పొందుపరిచారు. నాయకుల పుట్టిన రోజులు, ఇతర వేడుకల సమయంలో శిబిరాల ద్వారా ఒకే సారి పెద్ద మొత్తంలో వస్తున్న రక్తం అనేక మార్లు గడువు మీరి వృథా అవుతుందని, అలా కాకుండా వాస్తవంగా ఎంత రక్తం అవసరమవుతుందో అంచనా వేసి ఆ మేరకు సేకరించి, ముందుకు వచ్చిన దాతల వివరాలు నమోదు చేసుకుని, అవసరమైన సమయంలో వారి నుంచి సేకరిస్తే అందరికీ మంచి జరుగుతుందన్న అవగాహననూ ఈ పుస్తకం కలిగిస్తుంది. ప్రతి మనిషి ఎవరి కోసమో కాకుండా తన ఆరోగ్యం కోసం రక్తదానం చేయాలని, దానం చేసిన మేరకు కొత్త రక్తం తయారై దాతలు అనేక అనారోగ్యాలకు దూరం అవుతారని, ఆరోగ్యంగా ఉంటారని కూడా పుస్తకంలో సమాచారాన్ని చేర్చారు. రక్త దానం అనేది జీవ నదిలా సాగి, ప్రాణాలు నిలపాలన్నదే లక్ష్యం.

వెంకయ్యనాయుడు నుంచి అభినందనలు : డాక్టర్‌ శారద, సర్వీస్‌ సొసైటీ సభ్యులు ఇటీవల విజయవాడ స్వర్ణభారతి ట్రస్ట్‌ కార్యాలయంలో మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడును కలిసి తమ ఆలోచనను వివరించి ‘జీవ’ పుస్తకాన్ని అందించారు. ఆయన పుస్తకాన్ని చదివి డాక్టర్‌ శారద బృందాన్ని అభినందించారు. మీరు ఆశించిన విధంగా అన్ని ప్రాంతాల వారికి నమూనా అవుతుందని భరోసా ఇచ్చారు.

14న పుస్తకావిష్కరణ: జీవ పుస్తకాన్ని ఈ నెల 14న తెనాలిలో ప్రముఖుల చేతుల మీదుగా ఆవిష్కరించి, యావత్తు అంశాలపై ప్రజలకు అవగాహన కలిగించనున్నట్లు డాక్టర్‌ శారద తెలిపారు. రక్తం, రక్తదాన ఆవశ్యకతŸపై ప్రత్యేకంగా ఒక గీతం, నృత్య రూపకాలు ఉంటాయని, తుదిగా విషయాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకే తమ ప్రయత్నాలను ఆమె వివరించారు.

ప్రజలకు మేలు చేయడమే లక్ష్యం

రక్తం గురించి సంపూర్ణ అవగాహన కలిగిస్తూ సరళమైన భాషలో ‘జీవ’ పేరిట పుస్తకం రాశా. ఈ పుస్తకంపై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ ద్వారా అర్హత ఉన్న రక్తదాతలు వారి పేర్లను నమోదు చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నాం. తొలి ప్రయత్నంగా తెనాలి పరిధిలోని దాతల సమాచారాన్ని మా సిబ్బంది రిజిస్టర్‌ చేస్తారు. ఆ వివరాలను సబ్‌ కలెక్టర్‌కు అందిస్తాం. ప్రభుత్వ వైద్యశాలకు, దాతల గ్రూపులకూ అనుసంధానం చేస్తాం. అవసరమైన వారు సంప్రదిస్తే దాత, స్వీకర్త నడుమ ప్రక్రియ పూర్తి చేయడానికి సహకరిస్తాం. తుదిగా రక్తం అవసరమైన వారికి మేలు చేయడమే లక్ష్యం. ఇందుకు తెనాలి నుంచి జరుగుతున్న ఈ ప్రయత్నం అందరికీ నమూనా కావాలన్నది మా ఆశయం’

- డాక్టర్‌ శారద

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని