logo

మోగనున్న బడి గంటలు..!

వేసవి సెలవులు అనంతరం పాఠశాలలు గురువారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ముందు అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం బుధవారం నుంచే ప్రారంభం కావల్సిఉన్నా సీఎంగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో సెలవులను ఒకరోజు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు పొడిగించారు.

Published : 13 Jun 2024 06:11 IST

నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం 

వేణుగోపాల్‌నగర్‌ పాఠశాల  

నగరపాలకసంస్థ (గుంటూరు), న్యూస్‌టుడే: వేసవి సెలవులు అనంతరం పాఠశాలలు గురువారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ముందు అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం బుధవారం నుంచే ప్రారంభం కావల్సిఉన్నా సీఎంగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో సెలవులను ఒకరోజు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు పొడిగించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,730 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో సుమారు 3 లక్షలకుపైగా విద్యార్థులు తరగతులకు హాజరుకానున్నారు. పాఠశాలల్లో నాడు- నేడు పనులు మండల, గ్రామీణ ప్రాంతాల్లో కొంత వరకు పూర్తికాగా.. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలో పాఠశాలల అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. తిరిగి ఈ పనులు ప్రారంభించి పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. యూనిఫారంతోపాటు, పాఠ్య, నోటు పుస్తకాలు, విద్యాకానుకను పూర్తిస్థాయిలో విద్యార్థులకు అందజేసేందుకు అధికారులు దృష్టి సారిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో విద్యా కానుక పాఠశాలలు ప్రారంభమైన రెండు నెలలకు గానీ విద్యార్థుల చేతికి అందని పరిస్థితి. ఈ ఏడాది ఎన్నికలు ఉన్నా విద్యాకానుక కిట్లను విద్యార్థులకు సకాలంలో అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 

నాడు - నేడు పనులు పూర్తి చేసేందుకు చర్యలు 

రెండో విడతలో పాఠశాలల్లో ప్రారంభమైన నాడు- నేడు పనులు ఎన్నికలు వచ్చినందున మధ్యలోనే ఆపేశారు. కొన్ని పాఠశాలల్లో పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో నిర్మాణ సామగ్రి కూడా వేరే చోటకు తరలించారు. పోలింగ్‌ కేంద్రాలు పెట్టని చోట్ల మాత్రం సామగ్రిని అలాగే ఉంచారు. ఇనుము, చిప్స్‌ రాళ్ల ఇతర నిర్మాణ సామగ్రి పాఠశాలల ఆవరణలోనే ఉండడం వల్ల విద్యార్థులు రాకపోకలు, ఆడుకుంటున్న సందర్భాల్లో ప్రమాదాలు జరుగుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున ఈ పనులు వేగవంతం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. సెలవు రోజుల్లో పనులు వేగం పెంచి సాధారణ రోజుల్లో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా పనులు పూర్తి చేయాలని పలువురు సూచిస్తున్నారు.

సకాలంలో పాఠ్యపుస్తకాలు చేరేనా..?

గతంలో పాఠశాలలకు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠ్యపుస్తకాల డిపో నుంచే సరఫరా చేశారు. ఈ ఏడాది నూతన విధానంలో 1-7 తరగతుల వరకు ప్రభుత్వ పాఠ్యపుస్తకాల నుంచి సరఫరా చేస్తుండగా, 8, 9, 10 తరగతుల విద్యార్థులు రాష్ట్ర ప్రచురణల డిపో నుంచే నేరుగా పాఠశాలలకు సరఫరా చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే అన్ని పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు చేరాల్సి ఉన్నా కొన్ని చోట్ల పూర్తిస్థాయిలో పుస్తకాలు అందలేదని తెలుస్తోంది. వచ్చిన పుస్తకాలను గురువారం తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు అందజేయనున్నారు. పాఠ్యపుస్తకాల పంపిణీ రెండు రోజుల్లో పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. విద్యా ప్రమాణాళిక ప్రకారం ఇచ్చిన షెడ్యూల్‌ను అనుసరించి రోజువారీ తరగతులు పాఠ్యాంశాల బోధన ప్రారంభమవుతోంది. 

  • పాఠశాలల ప్రారంభం నేపథ్యంలో విద్యా వాతావరణం పక్కాగా ఉండేలా మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు దృష్టి సారించాలని డీఈవో శైలజ ఆదేశాలు జారీ చేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని