logo

గంజాయి అనే మాట వినపడకూడదు

‘గంజాయి అనే మాట వినపడకూడదు. 100 రోజుల్లో గంజాయి రహిత గుంటూరును చూడాలి’.

Published : 13 Jun 2024 06:15 IST

ఎస్పీ తుషార్‌ డూడీకి కేంద్ర మంత్రి పెమ్మసాని ఆదేశం

పట్టాభిపురం(గుంటూరు), న్యూస్‌టుడే: ‘గంజాయి అనే మాట వినపడకూడదు. 100 రోజుల్లో గంజాయి రహిత గుంటూరును చూడాలి’.. అని కేంద్ర మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ సూచించారు. అర్బన్‌ ఎస్పీ తుషార్‌ డూడీతో బుధవారం ఫోన్‌లో ఆయన మాట్లాడారు. ‘గుంటూరు పార్లమెంట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో గంజాయి విచ్చలవిడిగా విక్రయాలు జరుగుతున్నాయి. కొనుగోళ్లు పెరిగిపోయాయి. యువత భవిష్యత్తు నాశనమవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వ్యవహారంపై చాలా సీరియస్‌గా ఉన్నారు. మత్తు పదార్థాల విక్రయాలపై ఉక్కుపాదం మోపాలి. దీనివెనుక ఎంతటి వారున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. 100 రోజుల తర్వాత గుంటూరులో ఎక్కడా గంజాయి కనిపించకూడదు’.. అని ఆదేశించారు. దీనికి ఎస్పీ స్పందిస్తూ గంజాయి విక్రేతలపై చర్యలు తీసుకుంటామన్నారు. దాని నిర్మూలనకు కఠిన చర్యలు చేపడతామన్నారు. 

నగరపాలక సంస్థ కమిషనర్‌కూ.. ‘వర్షాకాలంలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టాలి. అందుకు తగిన విధంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి’.. అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ నగరపాలక సంస్థ కమిషనర్‌ కీర్తి చేకూరికి సూచించారు. ఆయన బుధవారం ఆమెతో పోన్‌లో మాట్లాడారు. ‘వర్షాలు కురవక ముందే కాలువల్లో పూడిక పూర్తిగా తొలగించాలి. మురుగునీటి పారుదల సవ్యంగా ఉండేలా చూడాలి. వర్షాకాలంలో మురుగు, వర్షపు నీరు పొంగి పొర్లకుండా చర్యలు తీసుకోవాలి. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో ఏమరుపాటుగా వ్యవహరించొద్దు’.. అని పెమ్మసాని ఆదేశించారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని