logo

అమరావతికి అందలం.. రాజధాని రైతుల సంబరం

ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయడంతో అమరావతి రైతుల్లో ఆనందోత్సవాలు మిన్నంటాయి. అమరావతి సృష్టికర్త చంద్రబాబు ఇప్పుడు సీఎం కావడంతో రాజధానికి ఇక ఎలాంటి ఇబ్బందులు ఉండవని సంతోషం వ్యక్తం చేశారు

Published : 13 Jun 2024 06:19 IST

చంద్రబాబు ప్రమాణ స్వీకారంతో ఆనందోత్సవాలు

 తెదేపా గీతాలకు నృత్యం చేస్తున్న రాజధాని మహిళలు
ఈనాడు-అమరావతి, తుళ్లూరు, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయడంతో అమరావతి రైతుల్లో ఆనందోత్సవాలు మిన్నంటాయి. అమరావతి సృష్టికర్త చంద్రబాబు ఇప్పుడు సీఎం కావడంతో రాజధానికి ఇక ఎలాంటి ఇబ్బందులు ఉండవని సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత సీఆర్‌డీఏ అధికారుల వైఖరిలో మార్పు రావడం, రాజధానిలో పనులు ప్రారంభించడంతో వారికి నమ్మకం ఏర్పడింది. చంద్రబాబు పవన్‌కల్యాణ్‌తోపాటు బీజేపీ నేతలు కూడా అమరావతికి ఇప్పటికే మద్దతు ప్రకటించారు. రాజధాని రైతులు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకుని ఆనందం పంచుకున్నారు. అమరావతి గీతాలకు నృత్యం చేశారు. ఆరేళ్ల పిల్లల నుంచి అరవై ఏళ్లు దాటిన వృద్ధుల వరకు ఈ సంబరాల్లో పాల్గొన్నారు. ఐదేళ్లుగా అమరావతికి పట్టిన పీడ విరగడైందని సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబాబు సీఎం కావడంతో అమరావతికి అన్నీ మంచి శకునాలేనని భావిస్తున్నారు. చంద్రబాబునాయుడు గురువారం వెలగపూడి సచివాలయానికి రానున్న నేపథ్యంలో ఘనస్వాగతం పలికేందుకు అమరావతి రైతులు సిద్ధమయ్యారు. 

ఆసక్తిగా తిలకిస్తూ..

నవ్యాంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు, మంత్రుల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు గుంటూరు జిల్లా వ్యాప్తంగా 36 ప్రదేశాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్‌లను అధికారులు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రిగా నాల్గోసారి చంద్రబాబు ప్రమాణస్వీకార ఘట్టాన్ని ప్రధాన కూడళ్లలో తోటి ప్రజలతో కలసి వీక్షించారు. అనంతరం మిఠాయిలు పంచి ఆనందం పంచుకున్నారు. చంద్రబాబునాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారంతో అమరావతి ప్రగతి పట్టాలెక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలో అన్ని రంగాలు అభివృద్ధి చెంది ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, ప్రజల జీవనప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. జిల్లాకు చెందిన మంత్రులు నారా లోకేశ్‌, నాదెండ్ల మనోహర్‌ ప్రమాణ స్వీకార సమయంలో చప్పట్లతో ఆనందం పంచుకున్నారు. 

దుష్ట పాలన నశించింది

ఐదేళ్ల వైకాపా దుష్ట పాలన నశించింది. అమరావతి రూపకర్త చంద్రబాబు నాయడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంతో మాకు నిజమైన పండుగ వచ్చింది. 1631 రోజులుగా సాగిన ఉద్యమానికి ఏన్డీయే కూటమి గెలుపుపొందడంతో ముగింపు పలికాం. దేవుళ్లకు మొక్కులు చెల్లించుకొని విజయోత్సవాలు చేసుకుంటున్నాం. 
- గౌర్నేని స్వరాజ్యరావు, అమరావతి సమన్వయ కమిటీ సభ్యుడు, తుళ్లూరు 


రైతు ఉద్యమం గెలిచింది

అమరావతిని కాపాడాలని కోరుతూ న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో తుళ్లూరు నుంచి తిరుమల తిరుపతి వరకు మహాపాదయాత్ర చేశాం. అమరావతి నుంచి అరసవల్లి వరకు రెండో పాదయాత్ర నిర్వహించాం. శ్రీవారి కరుణతో రైతు ఉద్యమం గెలిచింది. అమరావతి నిలిచింది.  

- గద్దె బుచ్చి తిరుపతిరావు, అమరావతి ఐకాస నాయకుడు, తుళ్లూరు 
మంచి రోజులొచ్చాయి 
అయిదేళ్ల నిరంకుశ అరాకచక పాలన అనంతరం అమరావతికి విముక్తి లభించింది. జగన్‌ పాలనలో ఏనాడూ పండగలు జరుపుకో లేదు. చంద్రబాబు రాకతో మళ్లీ మంచి రోజులు వచ్చాయి. మాకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేం.

- అరుంధతి, రాజధాని మహిళా రైతు, తుళ్లూరు


రాష్ట్ర భవిష్యత్తుకు మేలి మలుపు

తిరుగులేని మోజార్టీతో ఎన్డీయే కూటమి గెలుపొందడం రాష్ట్ర భవిష్యత్తు మేలి మలుపు. చంద్రబాబు సారధ్యంలో అమరావతి సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. ఆ ఫలాలు రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకు అందుతాయి. 
-  పావని, రాజధాని మహిళా రైతు, తుళ్లూరు


న్యాయం గెలిచింది.. ధర్మం నిలిచింది

ధర్మబద్ధంగా చేస్తున్న రాజధాని రైతుల ఉద్యమం గెలిచింది. అమరావతి రూపకర్త చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారంతో రైతుల ఉద్యమానికి తెరపడింది. వైకాపా అధినేత మూడు రాజధానులంటూ ఎన్ని కుయుక్తులు పన్నినా చివరకు అమరావతి నిలిచి న్యాయమే గెలిచింది.

- మూల్పూరి మురళీకృష్ణ, హైకోర్టు న్యాయవాది, తుళ్లూరు

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని