logo

అద్దంకి చరిత్రలోతొలి మంత్రిగా..

అద్దంకి నియోజకవర్గ చరిత్రలో తొలిసారి మంత్రి పదవి దక్కింది. 1955లో నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఎందరో దిగ్గజాలు శాసనసభ్యులుగా పని చేశారు.

Published : 13 Jun 2024 06:25 IST

మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న గొట్టిపాటి రవికుమార్‌ 
అద్దంకి, యద్దనపూడి, న్యూస్‌టుడే: అద్దంకి నియోజకవర్గ చరిత్రలో తొలిసారి మంత్రి పదవి దక్కింది. 1955లో నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఎందరో దిగ్గజాలు శాసనసభ్యులుగా పని చేశారు. ఈ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు విజయం సాధించిన వారి జాబితాలో గొట్టిపాటి రవికుమార్‌ పేరు నిలిచింది. యద్దనపూడిలో పుట్టిన రవికుమార్‌ తల్లిదండ్రులు డాక్టర్‌ శేషగిరిరావు, జయంతి. రాజకీయాల్లో చురుగ్గా ఉండే పెదనాన్న దివంగత గొట్టిపాటి హనుమంతరావు బాటలో రవికుమార్‌ పయనించారు. మార్టూరు నుంచి ఎమ్మెల్యేగా, ప్రకాశం జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా హనుమంతరావు పని చేశారు. 1994లో మార్టూరు నుంచి గొట్టిపాటి హనుమంతరావు తెదేపా మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. అనంతరం చంద్రబాబునాయుడి మంత్రి వర్గంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా పని చేశారు. మంత్రిగా ఉండగా మరణానంతరం జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన కుమారుడు గొట్టిపాటి నరసింహారావు(నరసయ్య) పోటీ చేసి భారీ విజయం సాధించారు. 1999లోనూ మార్టూరు నుంచి గొట్టిపాటి నరసయ్య తెదేపా నుంచి పోటీ చేసి గెలిచారు. ఈ వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసిన గొట్టిపాటి రవికుమార్‌కు రాజకీయాలంటే ఆసక్తి పెరిగింది. 2004లో జరిగిన ఎన్నికల్లో తనకు తెదేపా టిక్కెట్‌ కావాలని కోరినప్పటికీ రవికుమార్‌కు అవకాశం రాలేదు. అనంతరం తండ్రి డాక్టర్‌ గొట్టిపాటి శేషగిరిరావు.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డితో కలిసి చదువుకున్న నేపథ్యంలో 2004లో కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్‌ సాధించుకోగలిగారు. మార్టూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. అద్దంకి నియోజకవర్గం నుంచి విజయం సాధిస్తున్న హనుమంతరావు సోదరుడి కుమారుడు గొట్టిపాటి రవికుమార్‌కి సీఎం చంద్రబాబు మంత్రివర్గంలోనే పని చేసే అరుదైన అవకాశం దక్కడం యద్దనపూడి గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని