logo

పోరాట యోధులకు అమాత్య యోగం

రేపల్లె నుంచి వరుసగా మూడుసార్లు గెలిచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్‌ సాధించిన అనగాని సత్యప్రసాద్‌ తెదేపాలో బలమైన బీసీ నేతగా ఎదిగారు

Published : 13 Jun 2024 06:30 IST

పెదనాన్న వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని..

ప్రధాని మోది, సీఎం చంద్రబాబు సమక్షంలో అనగానితో ప్రమాణం చేయిస్తున్న గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

రేపల్లె నుంచి వరుసగా మూడుసార్లు గెలిచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్‌ సాధించిన అనగాని సత్యప్రసాద్‌ తెదేపాలో బలమైన బీసీ నేతగా ఎదిగారు. ఆయన పెదనాన్న అనగాని భగవంతరావు కూచినపూడి నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాష్ట్ర మంత్రిగా సేవలందించారు. నియోజకవర్గాల పునర్విభజనలో కూచిపూడి రద్దయింది. భగవంతరావు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన అనగాని సత్యప్రసాద్‌ 2009లో రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీ చేసి త్రిముఖ పోరులో ఓటమి పాలయ్యారు. నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉండి పార్టీని బలోపేతం చేశారు. 2014 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. వైకాపాకు చెందిన సీనియర్‌ నేత మోపిదేవి వెంకట రమణారావును ఓడించారు. 2019 ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితుల్లోను మోపిదేవిపై వరుసగా రెండోసారి అనగాని విజయం సాధించారు. ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నో పోరాటాలు చేశారు. తెదేపా గెలుపునకు అలుపెరగని కృషి చేశారు. మరోమారు రేపల్లె బరిలో విజయం సాధించి మంత్రి పదవి దక్కించుకున్నారు.

గొట్టిపాటి.. అనగానికి మంత్రి పదవులు

బాపట్ల, రేపల్లె అర్బన్, న్యూస్‌టుడే :తెదేపాను వీడాల్సిందేనని వారిపై ఎన్నో రకాలుగా నాటి వైకాపా ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చింది. ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టింది.. ఏ మాత్రం వెరవలేదు.. బెదరలేదు.. కష్టాలకు ఎదురొడ్డి నిత్యం ప్రజల్లో ఉంటూ తెదేపాను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేశారు. చివరకు విజయం సాధించారు. నాటి పోరాటానికి గుర్తింపుగా రాష్ట్ర మంత్రి వర్గంలో అనగాని, గొట్టిపాటికి స్థానం దక్కింది. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెదేపా అభ్యర్థులు ఘన విజయం సాధించి ఎమ్మెల్యేలయ్యారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్‌బాబు మంత్రి పదవులు ఆశించిన వారిలో ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి వరకు ఆమాత్య పదవి ఎవరిని వరిస్తుందా అని ఎమ్మెల్యేలు, తెదేపా నేతలు, కార్యకర్తల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఉత్కంఠకు తెరపడింది. మంత్రివర్గంలో స్థానం కల్పిస్తున్నట్లు గొట్టిపాటి, అనగానికి అధినేత, సీఎం చంద్రబాబు నుంచి ఫోన్‌ వచ్చింది. తెదేపా కూటమి ప్రభుత్వంలో జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కడంతో ప్రాధాన్యం లభించినట్లయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని